The Girlfriend: ‘చున్నీ’ వివాదం.. అది స్టంట్ కాదు: రాహుల్ రవీంద్రన్ క్లారిటీ

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న విడుదలైంది. ఈ సినిమా స్క్రీనింగ్ అవుతున్న ఓ థియేటర్‌కు రాహుల్ వెళ్లగా, సినిమా పూర్తయ్యాక ఓ యువతి ఆయన్ను కలిసింది. సినిమా చూసి చాలా ధైర్యం వచ్చిందంటూ, తన దుపట్టా తీసి విసిరేసి, రాహుల్‌ను హగ్ చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వచ్చింది. “ఇదేనా ఉమెన్ ఎంపవర్‌మెంట్?” అని కొందరు, “ఇది పక్కా పీఆర్ స్టంట్” అని మరికొందరు కామెంట్లు చేస్తూ ట్రోల్ చేశారు. మొదట నిర్మాత ఎస్‌కేఎన్ సక్సెస్ మీట్‌లో క్లారిటీ ఇచ్చినా, ట్రోల్స్ ఆగకపోవడంతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

The Girlfriend

“ఆ అమ్మాయికి డబ్బులిచ్చి చేయించారా?” అని ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు రాహుల్ స్పందించారు. “అదంతా అనుకోకుండా జరిగింది, పీఆర్ స్టంట్ కాదు. మేము ఆ థియేటర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నది కేవలం 20 నిమిషాల ముందు మాత్రమే, అలాంటప్పుడు స్టంట్ ఎలా ప్లాన్ చేస్తాం?” అని ఆయన స్పష్టం చేశారు. ఆ అమ్మాయిపై నెగిటివిటీ రాకూడదనే ఇన్నాళ్లూ స్పందించలేదని తెలిపారు.

సినిమా చూసి చున్నీలు తీసిపారేయమని తాము చెప్పడం లేదని, అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత ఇష్టమని రాహుల్ అన్నారు. ఒక అమ్మాయి దుపట్టా తీసేస్తే సంస్కృతి దెబ్బతిన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“ప్రతి వారం యాక్షన్ సీన్లలో మగాళ్లు షర్టులు చింపుకున్నప్పుడు, సెలబ్రేషన్లలో షర్టులు తీసి డ్యాన్స్ చేసినా ఎవరూ ఎందుకు స్పందించరు? సంస్కృతి అనే భారం మహిళలకే ఎందుకు?” అని రాహుల్ ప్రశ్నించారు. “సంస్కృతికి అంత ప్రాధాన్యత ఇస్తే, చాలా మంది ఇంగ్లీష్‌లో ఎందుకు ట్వీట్ చేస్తున్నారు?” అని కూడా ఆయన నిలదీశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus