లఘు చిత్రాలు రాసుకుంటూ, తీసుకుంటూ ఉండే రాజ్ తరుణ్ సహాయ దర్శకుడిగా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు. అటుపై అనుకోని రీతిలో నటుడిగా మారి హీరోగా సెటిలైపోయాడు. కలం కదిలించే శక్తి ఉన్నా ఇన్నాళ్లు తన సినిమాలకు ఆ పని చేయని ఈ వైజాగ్ కుర్రోడు ఇప్పుడో సినిమాకి తొలిసారిగా తన కలం కదిలించాడు. అదీ ఏకంగా ఓ పాటకోసం. రాజ్ తరుణ్ హీరోగా ఏకే ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ పై ‘కిట్టుగాడు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమ్మాయిలను టీజ్ చేస్తూ సాగే ఓ పాట ఉందట.
దానికోసం ఓ గేయ రచయితతో జరిపిన చర్చలు ఎంతకీ చిత్ర బృందానికి నచ్చడంలేదట. దాంతో పాట ఎలా ఉండాలో తెలిపేలా రాజ్ తరుణ్ కొన్ని వాఖ్యలు రాసి చిత్ర బృందానికి వినిపించాడట. అంతే.. అందరూ ఇతగాడి ప్రతిభను మెచ్చుకుంటూ ఈ పాట నువ్వే రాయాలని అభిమానపూర్వక ఆదేశాలు జారీ చేశారట. దాంతో ఈ హీరో కూడా ధైర్యం కూడగట్టుకుని పని కానిచ్చేశాడట. ఆడియో విడుదల వరకు ఈ విషయం బయటకు పొక్కనీయకూడదనుకున్నా ఒకరిద్దరి చెవిన ఆశ్రయం పొందిన ఈ మాట ఆ నోటా ఈ నోటా చేరి ఇలా బయటకొచ్చేసింది. హీరోలు కథలు రాయడం చూశాం పాటలు పాడడం విన్నాం ఇలా రాయడం మాత్రం రాజ్ తరుణ్ కె చెల్లింది కదూ..!