రాజా చెయ్యి వేస్తే

  • April 29, 2016 / 09:22 AM IST

నారా రోహిత్ నెలకో సినిమా చొప్పున విడుదల చేస్తున్నాడు. ఒక్కటి కూడా సరైన హిట్ కొట్టలేదు. ఈ వారం ‘రాజా చెయ్యి వేస్తే’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘ఈగ’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాలను నిర్మించిన వారాహి చలనచిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’ను నిర్మించడంలో ప్రేక్షకులు సినిమాపై కాస్త ఆసక్తి చూపించారు. నందమూరి తారకరత్న ఈ సినిమాలో విలన్ గా నటించడం కూడా ప్లస్ అయ్యింది. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చదివి తెలుసుకోండి.

కథ : విజయ్ మాణిక్(నందమూరి తారకరత్న) క్రూరమైన హంతకుడు. ఎటువంటి క్లూస్ వదలకుండా కిరాతకంగా హత్య చేయడం అతడి స్టైల్. రాజకీయ నాయకులు, మంత్రులు అండదండలు ఉండడంతో పోలీసులకి యాక్షన్ తీసుకునే అవకాశమే రాదు. రాజారామ్ (నారా రోహిత్) దర్శకుడు కావాలని కలలు కనే ఓ కుర్రాడు. కాఫీ డేలో రాజారామ్ చెప్పిన కథ నచ్చడంతో ఓ దర్శకుడు అవకాశం ఇస్తానని మంచి ప్రేమకథ రాసి మెయిల్ చేయమంటాడు. అది నచ్చడంతో యాక్షన్ కథకు ముగింపు రాయమంటాడు. చివరకు, రాజారామ్ క్లైమాక్స్ రాసినట్టు విజయ్ మాణిక్ ను చంపమని గన్ కొరియర్ చేస్తాడు. లేదంటే రాజారామ్ ప్రేయసి చైత్ర(ఇషా తల్వార్)ను చంపేస్తానని బెదిరిస్తాడు. ఓసారి హత్యాయత్నం కూడా చేస్తాడు. విజయ్ మాణిక్ ను చంపమని రాజారామ్ ను ఆదేశించింది ఎవరు? ప్రేయసి కోసం సామాన్య యువకుడు, అత్యంత క్రూరమైన వ్యక్తిని చంపాడా? లేదా? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు : నారా రోహిత్ నటనను అతడి పర్సనాలిటీ డామినేట్ చేస్తుంది. గడ్డంతో మరింత బొద్దుగా కనిపించాడు. తారకరత్న కాస్ట్యూమ్స్, వాకింగ్, అతడు వాడిన కార్లు స్టైలిష్ గా ఉన్నాయి. కానీ, విలనిజం చూపడంలో విఫలమయ్యాడు. ఇషా తల్వార్ పాటల్లో, రొమాంటిక్ సన్నివేశాల్లో అందంగా కనిపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో బ్లాంక్ ఫేస్ పెట్టింది. ‘అదుర్స్’ రఘు కొంచం నవ్వులు పూయించాడు. శ్రీనివాస్ అవసరాల, రాజీవ్ కనకాల, శివాజీ రాజా, రవివర్మ, ‘జోష్’ రవి తదితరుల పాత్రలు కథలో పరిమితమే.

సంగీతం – సాంకేతిక వర్గం : అమీర్ ఖాన్ ‘ఫనా’లో సూపర్ హిట్ సాంగ్ ‘చాంద్ సిఫారీష్ జో కర్తా హమారీ ..’, మణిరత్నం ‘అంజలి’లో ఓ పాటను సాయికార్తీక్ యథాతథంగా కాపీ కొట్టేశాడు. ‘చిన్నారి తల్లి..’ మినహా ఒక్క పాట కూడా బాగోలేదు. సరైన ప్లేస్ మెంట్ దేనికీ లభించలేదు. స్మశానంలో ఫైట్, రీ-రికార్డింగ్ బాగుంది. మిగతా సన్నివేశాలన్నిటిలోనూ లౌడ్ రీ-రికార్డింగ్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది. దీనికి కట్, పేస్ట్ ఎడిటింగ్ తోడైంది. ఒక్కసారిగా సన్నివేశాన్ని ముగించి, తర్వాత సన్నివేశం ప్రారంభించారు. రీ-రికార్డింగ్ కంటిన్యుటీ, సినిమాటోగ్రఫీ అన్నీ నాన్-సింక్ లో వెళతాయి. సాంకేతికంగా సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు ఏవీ లేవు. సుధీర్ చిలుకూరి రాసిన మాటలు కథానుగుణంగానూ, అర్థవంతంగానూ ఉన్నాయి. సినిమాలో మేజర్ హైలైట్స్ డైలాగ్స్ మాత్రమే.

దర్శకత్వం : తొలిసారి దర్శకత్వం వహించిన ప్రదీప్ చిలుకూరి కొన్ని మెరుపులు మెరిపించాడు. కానీ, రెండున్నర గంటల సినిమాకి అవి ఏమాత్రం సరిపోవు. రొటీన్ కథే. కానీ, కొత్త చెప్పాలని ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో మాస్ ప్రేక్షకుల అభిరుచులు, కమర్షియల్ అంశాలు అంటూ ఏవేవో కథలో జొప్పించి సాగదీశారు. సాధారణంగా హాలీవుడ్ లో ఇటువంటి సినిమాలను గంటన్నరలో ముగించేస్తారు. ఈ సినిమాకి నిడివి ప్రధాన అవరోధంగా మారింది. కథనం(స్క్రీన్ ప్లే) కూడా గొప్పగా లేదు.

విశ్లేషణ : విలన్(తారకరత్న) ఇంట్రడక్షన్ ఓ రేంజ్ అసలు. హీరో ఎంటరయిన తర్వాత ఇంటెర్వెల్ ముందు వరకూ విలన్ ఊసే ఉండదు. హీరో(నారా రోహిత్) ప్రేమకథ పేరుతో సాగదీసి సాగదీసి వదిలారు. మధ్యలో కామెడీ కాస్త బాగోవడంతో కొంచమైనా ఊపిరి తీసుకునే అవకాశం లభించింది. ప్రథమార్థం అంతా ఏదో అలా అలా నడిచింది. ద్వితీయార్థంలో అసలు కథ మొదలైన తర్వాత కూడా పెద్దగా ఆసక్తి ఉండదు. ఏదో కథ ముందుకు వెళ్తుందంటే వెళ్తుందన్నట్లు సాగింది. ఓ క్రూరుడితో సామాన్యుడు, మేథావి తలపడే సన్నివేశాలు ఉత్కంఠ కలిగించాలి. కానీ, ప్రతి సన్నివేశం చప్పగా సాగుతుంది. ‘తిలా పాపం తలా పిటికెడు’ అనే సామెత చెప్పినట్లు అందరూ తలో చెయ్యి వేసి చిత్రాన్ని కిందకు దించేశారు. స్మశానంలో ఫైట్, చర్చిలో రెండు మూడు కామెడీ సీన్లు తప్ప హర్షించే అంశాలు ఏమీ లేవు.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus