Raja Raja Chora Review: రాజ రాజ చోర సినిమా రివ్యూ & రేటింగ్!

“తిప్పరా మీసం, గాలి సంపత్” లాంటి డిజాస్టర్స్ అనంతరం శ్రీవిష్ణు ఎలాగైనా హిట్టు కొట్టాలనే తపనతో చేసిన సినిమా “రాజ రాజ చొర”. వివేక్ ఆత్రేయ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన హశిత్ గోలి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఎప్పుడో ఫస్ట్ లాక్డ్ డౌన్ కి ముందు రిలీజ్ చేసినా కారణాంతరాల వలన సినిమా ఇన్నాళ్లకు రిలీజ్ అయ్యింది. టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ వరకూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చిన “రాజ రాజ చోర” నేడు (ఆగస్ట్ 19) సినిమాగా విడుదలై ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం.

కథ: భాస్కర్ (శ్రీ విష్ణు) అమీర్ పేట్ లోని ఓ జిరాక్స్ షాప్ లో వర్క్ చేస్తుంటాడు. పెద్దగా చదువుకోలేదు కానీ గర్ల్ ఫ్రెండ్ సంజన (మేఘ ఆకాష్) దగ్గర మాత్రం పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లా బిల్డప్ ఇస్తుంటాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అమ్మాయి దగ్గర మాత్రం లగ్జరీ లైఫ్ గడిపేస్తుంటాడు.

కట్ చేస్తే.. భాస్కర్ గురించి ప్రపంచానికి తెలియని మరో విషయం ఉంటుంది. అదే అతడికి పెళ్లై ఒక బాబు కూడా ఉన్నాడని. భార్య విద్య (సునైన)ను లా చదివిస్తూ ఇల్లు నెట్టుకురావడం కోసం నానా కష్టాలు పడుతుంటాడు. ఇలా మూడు విభిన్నమైన జీవితాలను ఒకేసారి మ్యానేజ్ చేస్తున్న భాస్కర్ జీవితంలోకి పోలీస్ ఆఫీసర్ విలియమ్స్ (రవిబాబు) రావడం వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి? అందరి జీవితాలు ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: శ్రీవిష్ణు తన ఎనర్జీతో, బాడీ లాంగ్వేజ్ తో భాస్కర్ పాత్రను రంజింపజేశాడు. ఆ క్యారెక్టర్ లో అతడి డైలాగ్ డెలివరీ కూడా భలే ఫన్నీగా ఉంటుంది. యూత్ ఆడియన్స్ కు ఈ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుంది.

మేఘ మొదటిసారి ఒక మెచ్యూర్డ్ రోల్ ప్లే చేసింది. ఆ ముక్కుపుడక తప్ప ఆమె లుక్ & యాక్టింగ్ లో వంక పెట్టడానికి ఏమీ లేదు. సునైనకు ఎట్టకేలకు మంచి పాత్ర దొరికింది. ఆమె ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది.

అజయ్ ఘోష్, రవిబాబుల పాత్రలు సినిమాలో చాలా కీలకం. వాళ్ళు ఆ పాత్రల్లో జీవించేశారు. శ్రీకాంత్ అయ్యంగార్, తనికెళ్ళ భరణి క్యారెక్టర్స్ కథా గమనానికి తోడ్పడ్డాయి.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు హశిత్ గోలి రాసుకున్న కథనం గురించి మాట్లాడుకునే ముందు కథను మాత్రం కచ్చితంగా ప్రశంసించాల్సిందే. ప్రతి మనిషి తాను చేస్తున్నది తప్పు కాదు అనే భ్రమలో తనను తాను మోసం చేసుకోవడమే కాక తన జీవితంలో భాగస్వాములైన వారిని ఎంతటి క్షోభకు గురి చేస్తాడో అనే కోర్ పాయింట్ తో అద్భుతమైన కథను రాసుకున్నాడు. ప్రతి పాత్రకు ఇచ్చిన జస్టిఫికేషన్ అద్భుతంగా ఉంది. ఒక కాలేజ్ స్టూడెంట్ నుంచి, రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న 55 ఏళ్ళ ముసలి వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఆ పాత్రలకు కనెక్ట్ అవుతారు. నిజానికి చాలా గొప్ప నీతిని కథగా చెప్పాలనే ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

అయితే.. కథనం విషయంలో చాలా తప్పులు దొర్లేసాయి. ప్రతి పాత్రకూ జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం సాగదీసిన స్క్రీన్ ప్లే మైనస్ గా మారింది. అలాగే.. ఫస్టాఫ్ మొత్తం క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్స్ కి సరిపెట్టడం అనేది కూడా మైనస్సే. కాకపోతే.. తొలి భాగంలో కామెడీ బాగా వర్కవుట్ చేయడంతో జనాలు ఆ ల్యాగ్ ను, కథ ఇంకా మొదలవ్వలేదనే కీలక పాయింట్ ను పెద్దగా పట్టించుకోరు. అన్నిటికంటే క్లైమాక్స్ లో హీరో తాను చేసిన తప్పులను తనకు తానే శిక్ష వేసుకొని, నిర్మా వాషింగ్ పౌడర్ లో ఉతికినంత స్వచ్ఛంగా మారిపోవడం అనేది చిన్నపాటి నీతి కథలా పర్వాలేదు అనిపించేలా ఉన్నా.. సినిమాటిక్ గా యాక్సెప్ట్ చేయడం కష్టం. ఓవరాల్ గా దర్శకుడిగా కంటే కథకుడిగా హశిత్ గోలి మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

ఎప్పట్లానే వివేక్ సాగర్ సంగీతంతో సినిమాని నడిపించేశాడు. అతడి నేపధ్య సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా వరకూ నేచురల్ లైటింగ్ తో సినిమాని సహజంగా చిత్రీకరించడానికి అతడి పనితనం తోడ్పడింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ఇంకాస్త కమర్షియల్ ఫ్రీడం ఇచ్చి ఉంటే బాగుండేది. ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంటుంది.

ఎడిటర్ విప్లవ్ నైషధం ఇంకాస్త షార్ప్ గా ఎడిట్ చేసి.. సన్నివేశాల అల్లిక విషయంలో దర్శకుడితో బాగా ట్రావెల్ చేసి ఉంటే ఇంకా బెటర్ అవుట్ పుట్ వచ్చేది. రన్ టైమ్ సినిమాకి మైనస్ అనే చెప్పాలి. అలాగే.. ఫస్టాఫ్ మొత్తం అటుకుల బొంతలా ఉంటుంది. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తపడి ఉంటే సినిమా ఘన విజయం సొంతం చేసుకొని ఉండేది.

విశ్లేషణ: ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ-తాతయ్యల దగ్గర విన్న నీతి కథలను, మళ్ళీ ఒకసారి నెమరు వేసే సినిమా “రాజ రాజ చొర”. దర్శకుడు రాసుకున్న కథ, శ్రీవిష్ణు కామెడీ టైమింగ్, వివేక్ సాగర్ సంగీతం, అద్భుతంగా రాసుకున్న క్యారెక్టర్ ఆర్క్స్ కోసం సినిమాని ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు.

రేటింగ్: 2.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus