‘వారణాసి’ (SSMB29) టైటిల్ రివీల్ ఈవెంట్ ఎంత గ్రాండ్‌గా మొదలైందో, అంతే గందరగోళంగా ముగిసింది. దేశవిదేశాల మీడియా, లక్షలాది ఫ్యాన్స్ చూస్తుండగా, మోస్ట్ అవైటెడ్ కాన్సెప్ట్ ట్రైలర్ టెక్నికల్ గ్లిట్చ్‌తో పదే పదే ఆగిపోయింది. ఈ ఊహించని పరిణామం 100% పర్‌ఫెక్షన్ కోరుకునే రాజమౌళికి తీవ్ర అసహనాన్ని కలిగించింది. ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే ఆయన స్టేజ్ మీదకు వచ్చి వివరణ ఇచ్చారు.
అయితే, ఆ వివరణ ఇస్తూ రాజమౌళి దేవుడి ప్రస్తావన తేవడమే ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. ఆయన తన ప్రసంగాన్ని “నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి” అని ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత, “మా నాన్నగారు ఈ సినిమాను హనుమంతుడే నడిపిస్తాడని ధైర్యం చెప్పారు” అని గుర్తుచేసుకున్నారు. అలాగే సతీమణి కూడా హనుమాన్ ని నమ్ముతుందని చెప్పారు. ఇక్కడే ఆయన టెక్నికల్ గ్లిట్చ్‌ను ఉద్దేశిస్తూ, “ఇలా (ట్రైలర్ ఆగిపోవడం) అవ్వగానే నాకు కోపం వచ్చింది. ఇదేనా నడిపించేది?” అంటూ తన అసహనాన్ని బహిరంగంగానే వెల్లడించారు.
ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నెటిజన్లు రాజమౌళిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. “మీ టెక్నికల్ టీమ్ ఫెయిల్యూర్‌కు, దేవుడిని, అందులోనూ హనుమంతుడిని బ్లేమ్ చేయడం ఏంటి?” అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
ట్రోలింగ్‌కు మరో కారణం కూడా ఉంది. “దేవుడిని నమ్మనప్పుడు, ఏదో తప్పు జరిగితే దేవుడిని నిందించడం ఏ రకమైన నాస్తికత్వం?” అని నెటిజన్లు లాజిక్ తీస్తున్నారు. “మీరు నాస్తికులు కావచ్చు, అది మీ ఇష్టం. కానీ మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి దేవుడిని లాగడం సరికాదు” అని గట్టిగా కామెంట్స్ పెడుతున్నారు.
నిజానికి, గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై అలా జరగడం ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుంది. కానీ రాజమౌళి లాంటి అనుభవం ఉన్న డైరెక్టర్ ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయలేక, ఇలా సెన్సిటివ్ కామెంట్స్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ‘వారణాసి’ టైటిల్ అనౌన్స్ అయిన కాసేపటికే ఇలాంటి కాంట్రవర్సీ రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.