రాజమౌళి “వారణాసి” (SSMB29) ఈవెంట్, ఎంత పెద్ద ప్లానింగ్‌లో అయినా కూడా కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని నిరూపించింది. 130 అడుగుల స్క్రీన్, ‘వెరైటీ’లో గ్లోబల్ లైవ్ స్ట్రీమింగ్.. అంతా పక్కాగా ప్లాన్ చేసినా, ఈవెంట్‌ను నడిపించే ‘హోస్ట్’ విషయంలో జక్కన్న లెక్క దారుణంగా తప్పింది. సోషల్ మీడియా ఫాలోవర్ కౌంట్‌ను నమ్మి, స్టేజ్ ఎక్స్‌పీరియన్స్‌ను తక్కువ అంచనా వేయడం ఈ గ్రాండ్ ఈవెంట్‌కు అతిపెద్ద మైనస్‌గా నిలిచింది. ఈ ఫెయిల్యూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈవెంట్ హోస్టింగ్ కోసం జక్కన్నది మాస్టర్ ప్లాన్. తెలుగు ఆడియన్స్‌కు ‘క్వీన్’ సుమ, నార్త్ యూత్‌ను కవర్ చేయడానికి ‘యూట్యూబ్ కింగ్’ ఆశిష్ చంచ్లాని. ఈ కాంబోతో మొత్తం ఇండియాను కట్టిపడేయాలని ఆయన ప్లాన్. కానీ, యూట్యూబ్ వీడియోలలో మిలియన్ల వ్యూస్ తెచ్చే ఆశిష్, లక్షల మంది లైవ్ క్రౌడ్ ముందు పూర్తిగా తేలిపోయాడు. స్టేజ్ ఒత్తిడి, సుమతో కెమిస్ట్రీ కుదరక, అసలు హైలెట్ కాలేకపోయాడు. దీంతో భారం మొత్తం సుమ ఒక్కరే మోయాల్సి వచ్చింది.
హోస్టింగ్ ఫెయిల్యూర్‌తో రాజమౌళి అసహనంగా ఉన్న టైమ్‌లోనే, అసలుకే ఎసరు వచ్చింది. అందరూ వెయిట్ చేస్తున్న ‘వారణాసి’ కాన్సెప్ట్ ట్రైలర్‌ను ఆ భారీ స్క్రీన్‌పై ప్లే చేయగా, ఊహించని టెక్నికల్ గ్లిట్చ్ తలెత్తింది. వీడియో పదే పదే ఆగిపోవడంతో జక్కన్న తీవ్రంగా అప్‌సెట్ అయ్యారు. ఈ గందరగోళం, యాంకర్ల మధ్య సమన్వయం లేకపోవడం ఈవెంట్ ఫ్లోను దారుణంగా దెబ్బతీశాయి, అరగంటకు పైగా ఆలస్యం చేశాయి.
ఈ మొత్తం డ్రామా చూసిన నెటిజన్లు జక్కన్న ప్లానింగ్‌ను తప్పుబట్టారు. “యూట్యూబ్ ఫాలోవర్ కౌంట్ చూసి పిలిస్తే ఇలాగే ఉంటుంది” అని, “నవీన్ పోలిశెట్టి, కపిల్ శర్మ లాంటి అసలైన స్టేజ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారే ఇలాంటి భారీ ఈవెంట్లకు కరెక్ట్” అని కామెంట్స్ పెట్టారు. యూట్యూబ్ స్టార్లను నమ్మి పరువు పోగొట్టుకోవడం కంటే, అనుభవం ఉన్న యాంకర్లను నమ్మడమే బెటర్ అని ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చేశారు.