రాజశేఖర్ తో ‘బేబీ’ రీమేక్ చేస్తున్న ప్రవీణ్ సత్తారు..!

ఎల్బీడబ్ల్యు, రొటీన్ లవ్ స్టోరీ వంటి యూత్ ఫుల్ సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. తర్వాత ‘చందమామ కథలు’ సినిమాకి ప్రశంసలతో పాటు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే వసూళ్లు రూపేణా ఆ ఆదరణ కరువయ్యింది. దాని ఫలితమో ఏమో గానీ ‘గుంటూరు టాకీస్’ సినిమా చేసిన ఈయన పలు విమర్శలు మూట గట్టుకున్నారు. లాభాలు మాత్రం దండిగా ముట్టాయి.వేరే సినిమాల్లోని కథలను తిరగమోత పెడతాడన్న నింద ఇతగాడిపై ఉంది. ఇటీవల ప్రవీణ్ చెప్పిన ఓ మాట కూడా దీనికి వంత పాడుతున్నట్టుగానే ఉంది. రాజశేఖర్ తో ప్రవీణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ చిత్రం ‘బేబీ’ లా ఉంటుందని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ప్రవీణ్ ఆ సినిమా గురించి చెప్పాలనుకుంటే థ్రిల్లర్ అని చెప్పొచ్చు. కానీ ‘బేబీ’తో పోలిక పెట్టడం అతడిపై గల మచ్చను మరోమారు గుర్తుచేసింది. పుల్లెల గోపీచంద్ బయోపిక్ గురించి చెబుతూ జీవితంలో ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుందన్నాడు. ఇప్పటికే గోపితో అతడి కుటుంబంతో పలు విషయాలపై చర్చించి ఎంతో శ్రద్దగా స్క్రిప్ట్ చేస్తున్నాడట ప్రవీణ్.దీని తర్వాత ఓ ఎమోషనల్ సెన్సిటివ్ లవ్ స్టోరీ చేయనున్నట్టు చెప్పిన ప్రవీణ్ గుంటూరు టాకీస్ సీక్వెల్ పై వస్తోన్న వార్తలకు స్పందిస్తూ “తాను సీక్వెల్స్ చేసే రకం కాదని, బహుశా ఆ నిర్మాత చేస్తుండొచ్చు. ఆయనకి నచ్చినన్ని భాగాలుగా తీసుకోవచ్చని” బదులిచ్చాడు. ఇక స్టార్స్ తో సినిమా చేస్తారా లేక యాక్టర్స్ తోనా అన్న ప్రశ్నకు ‘ఇద్దరితోను’ అని చెబుతూనే ‘ స్టార్ తో చేసే సినిమాలకు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదంటూ’ సెటైర్ వేశాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus