రాజ్ దూత్

దివంగత నటులు రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయమవుతూ నటించిన చిత్రం “రాజ్ దూత్”. అర్జున్-కార్తీక్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు (జూలై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్-ట్రైలర్ కంటే శ్రీహరి కుమారుడు అనే సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించింది? శ్రీహరి కుమారుడు మేఘాంశ్ డెబ్యూ ఏమేరకు సక్సెస్ అయ్యింది అనేది చూద్దాం..!!

కథ: సంజు (మేఘాంశ్) తొలిచూపులోనే ప్రియ (నక్షత్ర)ను ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం ఆమె తండ్రి (అనీష్ కురువిళ్ల)ను ఒప్పించడానికి పలుమార్లు కలుస్తాడు. మొదట్లో సంజుని ఈసడించుకొన్న ప్రియ తండ్రి.. మనోడి పట్టుదల చూసి తన తండ్రి (కోటా శ్రీనివాసరావు) కు చాలా ఇష్టమైన రాజ్ దూత్ బండిని తీసుకురమ్మని, అప్పుడు తన ప్రేమను అంగీకరించి పెళ్లి చేస్తానని చెబుతాడు.

ఈ క్రమంలో సంజు “రాజ్ దూత్” బండి సాధించడం కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది “రాజ్ దూత్” కథాంశం.

నటీనటుల పనితీరు: నటుడిగా చిన్నప్పుడే తండ్రితో కలిసి “భైరవ” అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేసి ఉన్న మేఘాంశ్ “రాజ్ దూత్”లో చాలా సింపుల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెర్ఫార్మ్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో కాస్త తడబడ్డాడు కానీ.. డ్యాన్స్, ఫైట్స్ సీక్వెన్స్ లలో పర్వాలేదనిపించుకొన్నాడు. హీరో కదా అని మాస్ ఇమేజ్ కోసం కంటే నటుడిగా తన సత్తాను చాటుకోవడం కోసం మేఘాంశ్ చేసిన ప్రయత్నం అభినందనీయం. ఓవరాల్ గా తొలి చిత్రంతో పాస్ మార్కులు సంపాదించుకొన్నాడు కానీ.. నటుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకోలేదు మేఘాంశ్. తదుపరి చిత్రంతో అది సాధిస్తాడని ఆశిద్దాం.

నక్షత్ర అందంగా ఉన్నా.. అభినయం మాత్రం సోసోగా ఉంది. లెక్కకు మిక్కిలి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. ఏ ఒక్కరికీ సరైన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ లేకపోవడం అనేది మైనస్. ఫ్రెండ్ క్యారెక్టర్లో సుదర్శన్ కాస్త నవ్వించాడు. కానీ.. పంచ్ లు పెద్దగా పడలేదు.

సాంకేతికవర్గం పనితీరు: వరుణ్ సునీల్ సంగీతం, విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదు అనిపించేలా ఉంది. ప్రొడక్షన్ వేల్యుస్ మాత్రం మరీ బేసిక్ లెవల్లో ఉన్నాయి. మరీ రిస్క్ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ నిర్మాణ విలువలు ఇంకాస్త బాగుండి ఉంటే ప్రేక్షకులకు ఒక కమర్షియల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండేది.

దర్శక ద్వయం అర్జున్-కార్తీక్ లు రాసుకొన్న మూలకథలో పట్టు లేదు, అలాగే.. కథనం కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది చాలా సన్నివేశాల్లో. ముఖ్యంగా హీరో-విలన్ నడుమ సాగే కన్వర్జేషన్ కానీ రియలైజేషన్ ఎపిసోడ్స్ లో సహజత్వం లోపించింది. అలాగే.. లాజిక్స్ కూడా పెద్దగా కనిపించవు. సీనియర్ ఆర్టిస్టులను మరీ ఎక్కువగా వాడేయడం వలన కథకు బలం చేకూరడం పోగా.. కథనం మరీ పల్చబడిపోయింది. దర్శకద్వయం అర్జున్-కార్తీక్ కథ మీద కంటే కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది.

విశ్లేషణ: శ్రీహరి గారి మీద అభిమానం, కాస్త సహనం ఉంటే “రాజ్ దూత్”ను థియేటర్లో చూడడం పెద్ద టాస్క్ లా అనిపించదు కానీ.. సగటు ప్రేక్షకులకు ఈ చిత్రం మింగుడుపడడం అనేది కష్టమే.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus