కొన్ని దశాబ్దాలుగా అందరి ఇంట నవ్వులు విరబూయిస్తున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. నిన్న రాత్రి ఆమెకు ఛాతీ వద్ద నొప్పి వస్తుందని, అది గ్యాస్ నొప్పి అనుకుని ఏఐజి హాస్పిటల్లో జాయిన్ చేయగా.. ఆమెకు వచ్చింది గ్యాస్ నొప్పి కాదని, కార్డియాక్ అరెస్ట్ అని గ్రహించిన డాక్టర్లు వెంటనే చికిత్స ఆరంభించారు. అయితే.. ఆమెకు చికిత్స ఏమాత్రం పనిచేయలేదు. శనివారం తెల్లవారుజామున మరణించారు.
38 ఏళ్ల గాయత్రి ప్రొఫెషనల్ న్యూట్రీషియన్. గాయత్రి కుమార్తె తేజస్విని “మహానటి” సినిమాలో జూనియర్ సావిత్రిలా నటించిన విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్ తల్లి కమలేశ్వరి దేవి ఆయన చిన్నతనంలోనే మరణించగా.. తన కుమార్తె గాయత్రిలోనే తన తల్లిని చూసుకుంటానని ఒకానొక ఈవెంట్ లో ఆయన పేర్కొన్న విషయం ఇప్పుడు గుర్తుచేసుకుంటే గాయత్రి మరణం ఆయన్ను ఎంతగా బాధిస్తుందో అర్థం చేసుకోవచ్చు. రాజేంద్రప్రసాద్ కు ఇద్దరు పిల్లలు, కొడుకు బాలాజీ ప్రసాద్ & కుమార్తె గాయత్రి.
ఒక్కగానొక్క కుమార్తెను పోగొట్టుకున్న ఆయన్ను పరామర్శించడం ఇప్పుడు ఎవరి తరమూ కాదు. ఒక నటుడిగా కొన్ని కోట్ల మందిని ఆనందింపజేసిన రాజేంద్రుడి ఇంట ఇంతటి విషాదం నెలకొనడం నిజంగానే బాధాకరం. ఆయన ఈ బాధ నుండి త్వరగా కోలుకొని.. మళ్లీ సినిమా సెట్స్ కి వస్తారని ఆశిస్తూ.. “ఫిల్మీఫోకస్” ఆయన కుమార్తె మరణానికి తీవ్ర సంతాపం తెలియజేస్తోంది.