Swag Review in Telugu: శ్వాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 4, 2024 / 11:19 AM IST

Cast & Crew

  • శ్రీవిష్ణు (Hero)
  • రీతూవర్మ, దక్ష, మీరా జాస్మిన్ (Heroine)
  • గోపరాజు రమణ, రవిబాబు, పృథ్వీ, గెటప్ శ్రీను (Cast)
  • హసిత్ గోలి (Director)
  • టి.జి.విశ్వప్రసాద్ (Producer)
  • వివేక్ సాగర్ (Music)
  • వేదరామన్ శంకరన్ (Cinematography)
  • Release Date : అక్టోబర్ 04, 2024

“సామజవరగమన, ఓం భీం బుష్” చిత్రాలతో వరుస విజయాలు అందుకొని హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో తనకు ఆల్రెడీ “రాజ రాజ చోర”తో సూపర్ హిట్ ఇచ్చిన హసిత్ గోలీ (Hasith Goli) దర్శకత్వంలో శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన తాజా చిత్రం “శ్వాగ్” (Swag). అచ్చ తెలుగు సినిమా అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ లో సినిమా థీమ్ ఏమిటి అనేది ఏమాత్రం అర్థం కాకపోయినా.. సినిమా చూడాలన్న ఆసక్తి మాత్రం రేకెత్తించింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

Swag Review

కథ: 1551లో పురుషులు ముసుగులు వేసుకొనేలా చేసి మహిళా సాధికారత అంటే ఏమిటో చూపించిన వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతు వర్మ) మగాళ్లని కాలి కింద చెప్పులా చూస్తుంటుంది. ఈ విపరీత ఆధిక్యతను తట్టుకోలేని భవభూతి మహారాజు (ఒకటవ శ్రీవిష్ణు) ఓ పన్నాగం ప్రకారం శ్వాగణిక వంశాన్ని అభివృద్ధి చేసి పురుషాధిక్యతను పెల్లుబికేలా చేస్తాడు.

కట్ చేస్తే.. ప్రస్తుతంలో ఎస్.ఐగా రిటైర్ అవుతూ తన జీవితం సెటిల్ అవ్వాలంటే శ్వాగణిక వంశానికి చెందిన నిధిని దక్కించుకోవడం ఒక్కటే మార్గం అని గ్రహించిన పోలీస్ భవభూతి (రెండో శ్రీవిష్ణు) మళ్లీ ఎన్నో పన్నాగాలు పన్నుతాడు కానీ ఏవీ వర్కవుట్ అవ్వవు.

మళ్లీ కట్ చేస్తే.. సింగరేణి అలియాస్ సింగ (మూడో శ్రీవిష్ణు) తన తండ్రిని వెతుక్కుంటూ వంశ వృక్షం వద్దకు చేరుకుంటాడు. అదే సమయంలో నిధి దక్కించుకోవడం కోసం అనుభూతి (రెండో రీతు వర్మ) కూడా అక్కడికి చేరుకుంటుంది.

ఇంకోసారి కట్ చేయగా.. అసలు ఈ నిధి ఎవరికీ దక్కకుండా పోవడానికి కారణం యయాతి (నాలుగో శ్రీవిష్ణు) అని తెలుసుకుంటారు అందరూ.

ఇన్నిసార్లు కట్ చేసేసరికి ఇంత చెప్పాడు కానీ కథ చెప్పలేదు అంటూ కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు కదా.. అయితే, ఇంకోసారీ కట్ చేయాల్సి ఉంటుంది కానీ అది చెప్తే మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిపోతుంది.

సో, ఈ సినిమా కథపై, కథలో శ్రీవిష్ణు పోషించిన బహుపాత్రల గురించి ఏమాత్రం క్లారిటీ కావాలన్నా “శ్వాగ్” చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: శ్రీవిష్ణు కెరీర్లోనే చాలా రిస్క్ చేసి నటించిన సినిమా ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగు విభిన్నమైన పాత్రలతోపాటు, ఎవ్వరు ఊహించని అయిదో పాత్రలో అద్భుతంగా నటించాడు. అన్నిటికంటే అతడు పోషించిన 5వ పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కుతాయి. ఒక నటుడిగా శ్రీవిష్ణు స్థాయిని పెంచే సినిమా ఇదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

రీతు వర్మ ఒక బరువైన పాత్రను పోషించింది. ఆమె పాత్రకు మంచి వెయిటేజ్ ఉన్నప్పటికీ, ఆ పాత్రను సరిగా మోయలేకపోయింది. అందువల్ల అద్భుతంగా పండాల్సిన రుక్మిణీ దేవి పాత్ర సరిగా ఎలివేట్ అవ్వలేదు.

మీరా జాస్మిన్ (Meera Jasmine) సినిమాలో కీలకపాత్రలో అలరించింది. దక్ష(Daksha Nagarkar) కాస్త గ్లామర్ యాడ్ చేసింది. గోపరాజు రమణ-రవిబాబుల కాంబినేషన్ కామెడీ అక్కడక్కడా నవ్వించింది. కథలో కీలకమైన మలుపు లాంటి నిష్కల్మష అనే పాత్రలో కిరీటి పర్వాలేదనిపించుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు: ఒక సాధారణ కథను అసాధారణంగా ప్రెజెంట్ చేయడం ఒక లెక్క, అదే సాధారణ కథను అష్టవంకర్లు తిప్పి ప్రేక్షకుడ్ని ఎగ్జైట్ చేస్తున్నామనే భ్రమలో ఊదరగొట్టడం మరో లెక్క. దర్శకుడు హసిత్ గోలి “శ్వాగ్” (Swag) చిత్రంతో ఈ రెండో పద్ధతిని ఫాలో అయ్యాడు. నిజానికి అతడు ఎంచుకున్న మూలకథ మంచిదే. సదరు సమస్యను వేలెత్తి చూపించే విధానమూ బాగుంది. ముఖ్యంగా చైల్డ్ క్యారెక్టర్ రూపాంతరం చెందడాన్ని చెక్కుతున్న శిల్పంతో సింబాలిక్ గా చూపించిన తీరు కానీ, కన్న కొడుకును తండ్రి పాత్ర లంగోటా కట్టుకుని స్నానం చేయమని బలవంత పెట్టే సన్నివేశంలో పండిన ఎమోషన్ కానీ చాలా బాగా వర్కవుట్ అయ్యాయి.

సినిమాకి ప్లస్ పాయింట్స్ అంటే ఆ రెండు సన్నివేశాల కంపోజిషన్ అని చెప్పొచ్చు. ఒక దర్శకుడిగా తన ఆలోచనా ధోరణి ఏమిటి అనేది హసిత్ గోలి ఆ రెండు సీన్స్ తో చెప్పకనే చెప్పాడు. అయితే.. ఒక రచయితగా తన తృష్ణను తీర్చుకొనే తాపత్రయంలో ప్రేక్షకులను మరీ ఎక్కువగా కన్ఫ్యూజ్ చేశాడు. ఆ కారణంగా హిలేరియస్ గా వర్కవుట్ అవ్వాల్సిన ఫస్టాఫ్ సోసోగా సాగగా, సినిమాకి ప్రాణమైన సెకండాఫ్ ఓ మోస్తరుగా మాత్రమే అలరించగలిగింది. రాసుకున్న సన్నివేశాన్ని రచయితగా ప్రేమించడం ఎంత ముఖ్యమో, ఒక దర్శకుడిగా సదరు సన్నివేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా, మరీ ముఖ్యంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దడం కూడా అంతే ముఖ్యం.

ఈ విషయాన్ని ట్విస్టులతో మ్యానేజ్ చేద్దామని హసిత్ చేసిన ప్రయత్నం సరిగా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. అయితే.. ఒక రచయితగా అతడి ఉన్నతమైన ఆలోచనా ధోరణికి, సమాజం ఒక వ్యక్తిని ఎలా గౌరవించాలి అనే అతడి దృష్టికోణాన్ని మాత్రం కచ్చితంగా మెచ్చుకోవాలి.

వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. ఇంటర్వెల్ బ్యాంగ్ లో తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ట్విస్ట్ ను ఎలివేట్ చేసిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది.

వేదరామన్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ఎడిటర్ విప్లవ్ నైషధం కటువుగా వ్యవహరించి ఉంటే సినిమా ఇంకాస్త క్లియర్ గా ఉండేది.

విశ్లేషణ: కాంప్లెక్స్ స్టోరీస్ (సంక్లిష్టమైన కథలు) ప్రేక్షకులకు చెప్పే తీరు అరటిపండు వలిచి చేతికిచ్చినట్లుగా ఉండాలి. అందుకు మంచి ఉదాహరణ “మనం”. కథగా ఎంతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే కాన్సెప్ట్ ను విక్రమ్ కుమార్ ఒక మంచి చందమామ కథలా వివరించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు “శ్వాగ్” (Swag) కూడా అదే స్థాయి కాంప్లెక్స్ స్టోరీ, అదే స్థాయిలో కన్ఫ్యూజ్ చేసే రిలేషన్స్ కోకొల్లలుగా ఉన్నాయి సినిమాలో. కానీ.. దర్శకుడు హసిత్ ఆ కాంప్లెక్స్ స్టోరీని సింపుల్ గా నెరేట్ చేయకుండా, ట్విస్టులతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేద్దామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ముందు చెప్పినట్లుగా సినిమాలో మూలకథ కానీ, చర్చించిన సమస్య కానీ ప్రశంసార్హమైన అంశాలే అయినప్పటికీ.. వాటిని సగటు ప్రేక్షకుడు ఆస్వాదించే స్థాయిలో చెప్పలేకపోవడంతో “శ్వాగ్” (Swag) కొందరికి మాత్రమే పరిమితమైంది.

ఫోకస్ పాయింట్: శ్వాగణిక వంశ వృక్షంలో కొమ్మలు ఎక్కువై.. కథ కంచికి చేరడానికి నానా తిప్పలు పడింది.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus