ఇటీవల ఓ మహిళా జర్నలిస్టు ‘డ్యూడ్’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా.. ‘మీరు హీరో మెటీరియల్ కాదు’ అంటూ పెద్ద దుమారం రేపింది. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు హీరో ప్రదీప్ రంగనాథన్ చాలా ఇబ్బంది పడ్డాడు. వెంటనే పక్కనే ఉన్న శరత్ కుమార్ మైకు తీసుకుని ఆ జర్నలిస్టుకి సున్నితంగా క్లాస్ పీకారు. తర్వాత సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ మహిళా జర్నలిస్ట్ ‘మీరు హీరో మెటీరియల్ కాదు’ అనడం నూటికి నూరు శాతం తప్పే. కానీ ఆమె ఇంటెన్షన్ ను డీప్ గా పరిశీలిస్తే.. ఇక్కడ కొన్ని చేదు నిజాలు బయటపడతాయి.
అదేంటంటే…. రజినీకాంత్, ధనుష్, విశాల్, విజయ్ సేతుపతి వంటి వాళ్ళు టాలీవుడ్ కి చెందిన వాళ్ళు అయితే స్టార్స్ అయ్యేవాళ్ళా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే టాలీవుడ్.. గ్లామర్ లేని వాళ్ళని హీరోలుగా ఎంకరేజ్ చేస్తుంది అనడానికి లేదు. ఇక్కడ ఫిలిం మేకర్స్ గుర్తించాలంటే గ్లామర్ అయినా ఉండాలి లేదంటే డబ్బైనా ఉండాలి. బ్యాక్ గ్రౌండ్ సంగతి తర్వాత..! ఫేస్ వాల్యూ లేదు కానీ టాలెంట్ ఉంది అంటే మీడియా సంస్థలు వాళ్ళని కనీసం యాంకర్లుగా కూడా తీసుకోరు అనేది చేదు నిజం.
అందుకే రజినీకాంత్, విశాల్, ధనుష్, విజయ్ సేతుపతి వంటి వాళ్ళు టాలీవుడ్ కి చెందిన వాళ్ళు అయితే కమెడియన్స్ లేదా సైడ్ క్యారెక్టర్స్ కి పరిమితం చేసేవారు. మరి సుహాస్ ఎలా హీరో అయ్యాడు అనే డౌట్ కూడా కొంతమందికి రావచ్చు. మొదట్లో అతన్ని కూడా సైడ్ క్యారెక్టర్ గానే చూశారు. కానీ ‘కలర్ ఫోటో’ సినిమా కాన్సెప్ట్ ‘కలర్ డిస్క్రిమినేషన్’ గురించి ఉంటుంది. పైగా అది కోవిడ్ టైంలో ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అందువల్ల ఇళ్లల్లోనే ఉండే ప్రేక్షకులు ‘కొత్త సినిమా కదా.. నేరుగా ఇంట్లోనే చూడొచ్చు’ అనే ఆలోచనతో చూశారు.
అది సుహాస్ కి కలిసొచ్చింది. అదే సినిమా కనుక థియేటర్లలో రిలీజ్ అయితే.. దానికి అంత రీచ్ వచ్చి ఉండేది కాదేమో. అతను ఈరోజు హీరోగా బిజీ అయ్యే వాడు కూడా కాదేమో..! ఆ రకంగా సుహాస్ అదృష్టవంతుడు. లేదు అంటే.. సుహాస్ లాంటి వాళ్ళు నేరుగా తమిళ సినిమా రంగంలో అడుగుపెట్టి.. అక్కడ ప్రూవ్ చేసుకుంటే.. అప్పుడు తెలుగు ఫిలిం మేకర్స్ వాళ్ళని ఫోకస్ చేసేవాళ్ళు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. ఇది చేదు నిజం.