ఈ మాట వినగానే నిజమా? నిజమేనా? అని కచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కుర్ర హీరోల తరహా పాత్రలు ఎంచుకుంటూ, సినిమాలు చేస్తున్న హీరోను ఇద్దరు స్టార్ హీరోలకు తండ్రిగా చూపించాలి అని ఆ దర్శకుడు అనుకున్నారు కాబట్టి. ఆ ఆలోచన చేసి డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) అయితే.. ఆ హీరో రజనీకాంత్. ఇద్దరు ఆయనకు కొడుకులుగా నటించాల్సిన హీరోలు పవన్ కల్యాణ్ – మహేష్‌బాబు. అయితే ఆ తర్వాత వెంకటేశ్ – మహేష్‌బాబు అయ్యారనుకోండి.
విషయానికొస్తే.. వెంకటేశ్ (Venkatesh), మహేశ్ బాబు (Mahesh Babu), ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu). తెలుగులో సినిమాలో ఈ తరంలో ఓ ప్రామినెంట్ మల్టీస్టారర్ సినిమా ఇది. 2013 సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఈ క్రమంలో మల్టీస్టారర్ల కాన్సెప్ట్‌లో టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు అంటే పుష్కర కాలం తర్వాత మార్చి 7న సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు, పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అలా ఓ వీడియోలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాలో రజనీకాంత్ (Rajinikanth) పాత్ర గురించి చెప్పిన ఓ విషయం తెలిసింది.. సినిమాలో హీరోల తండ్రి పాత్ర రేలంగి మావయ్యగా రజనీకాంత్‌ను తీసుకోవాలని శ్రీకాంత్ అనుకున్నారట. ఆ మేరకు రజనీకాంత్‌ను కలిసి స్టోరీ చెప్పారట.
కథ నచ్చి, తెలుగులో నటించేందుకు అప్పుడు తలైవా ఆసక్తిగా ఉన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో చేయలేకపోయారు అని ఆ వీడియోలో శ్రీకాంత్ అడ్డాల చెప్పారు. ఆయన యాక్ట్ చేయలేకపోయినా ఆయనకు ఓ కథ చెప్పడం నా జీవితంలో మరచిపోలేని విషయం అని శ్రీకాంత్ అడ్డాల చెప్పారు. చేసి ఉంటే ఎలా ఉండేది అంటూ కొంతమంది ఫ్యాన్ మేడ్ వీడియోలు షేర్ చేస్తుండటం గమనార్హం.