సమస్యని అధిగమించే పనిలో 2.0 టీమ్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమర్షియల్ డైరక్టర్ శంకర్ కలయికలో వచ్చిన రోబో సంచలన విజయం సాధించింది. మళ్లీ అదే కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ 2.0. ఇందులో ఎమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 450 కోట్ల భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్నఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ముంబయిలో, ఆడియోను అబుదబిలో విడుదల చేశారు. ఈ సినిమాని ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శంకర్ అనుకున్నారు. కానీ టీజర్ కూడా రిలీజ్ కాలేదు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం అవుతుండడంతో రిలీజ్ డేట్ ని వాయిదా వేశారు. ఇప్పుడు ఈ పనులు మరింత ఆలస్యం అయ్యేట్టు ఉంది.

కారణం సేమ్. మొదట్లో ఈ సినిమాకు గ్రాఫిక్స్ చేస్తున్న అమెరికా సంస్థ ఒకటి దివాలా తీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే అమెరికాకు చెందిన మరో సంస్థతో పాటు జపాన్ కు చెందిన ఇంకో సంస్థకు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులు అప్పగించారు. తాజాగా అమెరికాకు చెందిన ఆ కంపెనీ కూడా దివాలా తీసినట్టు తెలుస్తోంది. దీంతో 2.0 గ్రాఫిక్ పనులు మరోసారి ఆగిపోయాయి. ఈసారి ఈ ప్రాజెక్టు ఎవరికి అప్పగించాలనే విషయంపై శంకర్ ఆలోచిస్తున్నారు. వెంటనే మంచి కంపెనీకి పనులు అప్పగించి ఐపీఎల్ ఫైనల్స్ సందర్భంగా ఈనెల 27న టీజర్ ను విడుదల చేయాలనీ భావిస్తున్నారు. మరి ఇదైనా వాయిదా లేకుండా వస్తుందో.. లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus