ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఎంతో కొంత సంపాదించుకున్న సినిమాల్లో ‘రాజుగారి కోడిపులావ్’ మూవీ కూడా ఒకటి. బుల్లితెర మెగాస్టార్ గా పేరొందిన ప్రభాకర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. పోస్టర్లలో, ట్రైలర్లలో కూడా అతన్నే హైలెట్ చేశారు.టైటిల్, పోస్టర్, టీజర్, ట్రైలర్ అన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :
కథ: రాజుగారు(ప్రభాకర్) తన సొంత ఊరిలో ఓ హోటల్ నడుపుతూ ఉంటాడు. అతని హోటల్లో ‘రాజు గారి కోడిపులావ్’ బాగా ఫేమస్. దేశమంతా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రొఫెషనల్ గా అతని లైఫ్ బాగున్నప్పటికీ.. అతని పర్సనల్ లైఫ్ లో మాత్రం సంతోషం ఉండదు.ఎందుకంటే అతని భార్య తన మాట వినదు. తనకు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది.అలాగే తనకు కొడుకు కావాలనుకుంటే కూతురు పుట్టింది అనే బాధ మరోవైపు. ఇది పక్కన పెట్టేస్తే.. కాలేజ్ డేస్ నుండి ఫ్రెండ్స్ అయిన ముగ్గురు కపుల్స్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు.
వాళ్ళే డాని(శివ కోన), క్యాండీ (ప్రాచి కెథర్) ఆకాంక్ష(నేహా దేశ్ పాండే) బద్రి( కునాల్ కౌశిక్) ఫరూఖ్(అభిలాష్ బండారి) ఈషా(రమ్య దినేష్). వీళ్ళు రోడ్ ట్రిప్ వేసినప్పుడు దారిలో కారు ట్రబుల్ ఇస్తుంది. అది అడవి ప్రాంతం. దీంతో 10 కిలో మీటర్లు నడిచి తమ కాటేజెస్ కి వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో క్యాండీ ఊహించని విధంగా మరణిస్తుంది. ఆ తర్వాత ఈషా మిస్ అవుతుంది.ఆ తర్వాత డాని కూడా మిస్ అవుతాడు. చివరికి ఆకాంక్ష,బద్రి,ఫరూఖ్ మాత్రమే మిగిలి ఉంటారు. ఇక్కడ ఆకాంక్ష – బద్రి భార్యాభర్తలు.
అయితే ఆకాంక్ష – ఫరూక్ అక్రమ సంబంధం పెట్టుకుంటారు. ఈ విషయం తెలిసి బద్రినే వీళ్ళని చంపడానికి స్కెచ్ వేశాడేమో అని ఆకాంక్ష – ఫరూక్ భావిస్తారు. అయితే మధ్యలో క్యాండీ, ఈషా, డానీ లు ఎందుకు మిస్ అయ్యారు? వాళ్ళు మిస్ అవ్వడానికి కారణం బద్రినా? లేక ఇంకెవరైనా అయ్యుంటారా? అసలు ఇందులో రాజుగారు(ప్రభాకర్) పాత్ర ఏమిటి? అతని కూతురు, భార్య ఏమైనట్టు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : ఈ సినిమాపై బజ్ ఏర్పడటానికి ప్రధాన కారణం ప్రభాకర్. అయితే అతని పాత్ర ఈ సినిమాలో ఎక్కువ నిడివి ఉండదు. ఉన్నంతలో అతను బాగానే నటించాడు. అతని భార్య పాత్రలో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ సాయి సుధా నటించింది. ఆమె ఓ బెడ్రూమ్ సీన్ కి మాత్రమే పరిమితమైంది తప్ప.. కొత్తగా చేసింది ఏమీ లేదు. ఇక నిర్మాత, దర్శకుడు గానే కాకుండా ఈ సినిమాలో డానీ అనే పాత్రలో నటించిన శివ కోన .. బాగానే పెర్ఫార్మ్ చేశాడు. కొన్ని చోట్ల సీరియస్ గానే కనిపిస్తూ తన డైలాగ్ డెలివరీతో నవ్వించే ప్రయత్నం చేశాడు.
ఇతని క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. ఇక ఫరూఖ్ పాత్ర చేసిన అభిలాష్ బండారి కూడా బాగా నటించాడు. భవిష్యత్తులో ఇతను బిజీ ఆర్టిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆకాంక్ష పాత్ర చేసిన నేహా దేశ్ పాండే తన గ్లామర్ తో మెప్పించే ప్రయత్నం చేసింది. ఆమె నటన కూడా బాగానే ఉంది. క్యాండీ పాత్ర చేసిన ప్రాచి కెథర్ కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది. మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు. కానీ ఉన్నంతలో వాళ్ళు కూడా ఓకే అనిపించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : మళ్ళీ ఇక్కడ శివ కోన గురించి చెప్పుకోవాలి. అతనే దర్శకుడు కాబట్టి..! అతను ఓ థ్రిల్లర్ సెటప్ ను బాగానే డిజైన్ చేసుకున్నాడు. దానికి ‘రాజుగారి కోడిపులావ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేయడం కూడా బాగుంది. కానీ దానిని ఆసక్తికరంగా మలచడంలో అతను తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా సెకండ్ హాఫ్ చాలా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.ఊహించని ట్విస్ట్ లు ఉన్నప్పటికీ..
ఎందుకో అవి ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. పవన్ గుంటుకు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్ మణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. మరీ ముఖ్యంగా ఈ ‘రాజుగారి కోడిపులావ్’ లో కొన్ని డైలాగులు బాగున్నాయి.సినిమా చివరి వరకు అవి బాగానే పేలాయి. కానీ మధ్య మధ్యలో అవసరం లేకపోయినా కొన్ని బూతులు పెట్టి.. వాటికి కూడా వంక పెట్టేలా చేశారు.
విశ్లేషణ : ‘రాజుగారి కోడిపులావ్’ ఓ మంచి థ్రిల్లర్ అనుకుంటే పొరపాటే. ఇందులో బోల్డ్ కంటెంట్ గట్టిగానే ఉంది. ఫస్ట్ హాఫ్ పరంగా ఓకే అనిపించినా.. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి బోర్ కొట్టిస్తుంది. ఇది థ్రిల్లర్ అనే థాట్ ను పక్కన పెట్టేసి.. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఒకసారి ట్రై చేయొచ్చు. లేదంటే కష్టమే..!
రేటింగ్ : 2/5