“ఎంత మహా బలుడైనా.. అమ్మ ఒడి పసివాడే” అని ‘బాహుబలి” సినిమాలోని పాటను.. మన సోషల్ మీడియాలో స్టార్ హీరోల పరిస్థితికి అనుగుణంగా మారిస్తే.. “ఎంత పెద్ద స్టార్ అయినా.. సోషల్ మీడియాలో మామూలు మనిషే” అని చెప్పుకోవచ్చు. నువ్వు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కానివ్వు.. నీకు ఎంత పెద్ద భారీ కుటుంబ నేపధ్యం అయినా ఉండనివ్వు.. ఒక్కసారి సోషల్ మీడియాలో పబ్లిక్ ఎకౌంట్ క్రియేట్ చేసావంటే నిన్ను మెచ్చుకొనేవాళ్లూ, పొగిడేవాళ్ళకంటే ఇష్టమొచ్చిట్లు కామెంట్ చేసి, నోటికొచ్చినట్లు తిట్టేవాళ్లే ఎక్కువ. ఇక అభిమానం ముసుగులో జరిగే దరిద్రపుగొట్టు గొడవల్లోకి హీరోలను మాత్రమే కాక వారి కుటుంబాలను.. ముఖ్యంగా భార్యాపిల్లలను లాగి అత్యంత హేయంగా తిట్టడం అనేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ట్విట్టర్లో.
ఈ నెగిటివిటీ అంతా చూసి రామ్ చరణ్ మొన్నటివరకూ నాకెందుకులే అని ట్విట్టర్ కి దూరంగా ఉన్నాడు. నిజానికి చరణ్ ఒకసారి ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేశాడు.. కానీ కొద్ది రోజుల్లోనే ఆ గోల భరించలేక తన ఎకౌంట్ ను తొలగించాడు. అయితే.. ఈ డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా.. ప్రెజంట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి త్వరలోనే ట్విట్టర్ ఖాతాను పునరుద్దరించుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నాడు చరణ్. ఆల్రెడీ ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉండే చరణ్, ఇటీవలే ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ కూడా ఓపెన్ చేశాడు. ఇక ఇప్పుడు ట్విట్టర్ కూడా మొదలెడుతుండడంతో సోషల్ మీడియాలో ఉండే మెగా అభిమానులందరూ ఆనందపడుతున్నారు.