తెలుగు సినిమా అభిమానులు ఎక్కువమంది ఎదురుచూస్తున్న సినిమా రంగస్థలం. ధృవ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా.. రామ్ చరణ్ పక్కన తొలిసారి సమంత నటించిన మూవీ.. పైగా సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ నటించడం కూడా ఇదే మొదటిసారి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది పాతికేళ్ల క్రితం నాటి. ఆది నుంచి అంతం వరకు అప్పటి కాలంలోనే… ఓ గ్రామంలోనే ఈ స్టోరీ జరుగుతుంది. ఇన్ని కారణాల వల్ల ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను టీజర్, ట్రైలర్, పాటలు డబల్ చేశాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30 న అంటే మరో నాలుగు రోజుల్లో థియేటర్లోకి రానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పబ్లిసిటీ వేగం పెంచింది. ఇందులో భాగంగానే చరణ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా సినిమా ప్రారంభానికి ముందు రంగస్థలం 1985 అని ఉన్న టైటిల్ రంగస్థలం గా ఎందుకు మిగిలిందని ప్రశ్నకు స్పందించారు. “1985కే ఫిక్స్ అయిపోతే అప్పటి ఫ్యాషన్లను మాత్రమే చూపించాలి. ఆ సంవత్సరం తీసేస్తే మేకింగ్ పరంగా చాలా స్వేచ్ఛ ఉంటుందనిపించింది. అందుకే 80వ దశకం కథ అని మాత్రమే చెబుతున్నాం” అని వివరించారు. అది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ సాధిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది.