బాలీవుడ్ లో అద్భుత చిత్రాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ నుంచి వచ్చిన మరో అపురూపమైన సినిమా “సంజు”. సంజయ్ దత్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ బయోపిక్ లో రణబీర్ కపూర్ చక్కగా నటించి అభినందనలు అందుకున్నారు. ఈమూవీ 300 కోట్లు వసూలు చేసి లాభాలను పంచింది. అయితే కొంతమంది సంజయ్ దత్ జీవితంలో ఒకే కోణాన్ని మాత్రమే చూపించారని విమర్శించారు. వర్మ మాత్రం అది నిజమని అందరి ముందు చెప్పారు. రాజ్ కుమార్ హిరానీకి సంజయ్ దత్ మంచి మిత్రుడు కావడంతో మంచివాడిగా చూపించారని ఆరోపణలు చేశారు. అందుకే సంజు చిత్రం తనని తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపారు. సంజయ్ దత్ బయోపిక్ ని వాస్తవాలతో మళ్ళీ తెరకెక్కిస్తానని ప్రకటన చేశారు.
వర్మ ప్రకటనతో బాలీవుడ్ లో అలజడి రేగింది. డ్రగ్స్ కేసు, ముంబై పేలుళ్లు ఇలా అనేక వివాదాలు సంజయ్ దత్ జీవితంలో చోటుచేసుకున్నాయి. ముంబై పేలుళ్ల ఘటన సంజయ్ దత్ జీవితంపై తీవ్రంగా ప్రభావం చూపింది. అందుకోసమే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఘటనని సంజు చిత్రంలో సరైన విధంగా చూపించలేదనేది వర్మ అభిప్రాయం. 1993 ముంబై పేలుళ్లు, సంజయ్ దత్ నుంచి ఏకే 47 స్వాధీనం అంశాలను ప్రధానంగా చూపిస్తూ తెరకెక్కే ఈ చిత్రానికి “సంజు ది రియల్ స్టోరీ” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ముంబయి పత్రికలూ కథనాలను ప్రచురిస్తున్నాయి. ప్రకటనతోనే అలజడి రేపిన ఈ ప్రాజక్ట్ విడుదలనాటికి ఎన్ని వివాదాల్లో చిక్కుకుంటుందో చూడాలి.