అందుకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసాను : వర్మ

తాజాగా విడుదల చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తుంది. రాంగోపాల్ వర్మ.. అలాగే తన శిష్యుడు అగస్త్య మంజు కలిసి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక పక్క ఎన్టీఆర్ జీవిత కథ అంటూ బాలయ్య – క్రిష్ కలిసి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ని రూపొందిస్తున్నప్పుడే.. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అసలైన నిజాలను అలాగే కుట్రలను నేను చూపిస్తానంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ని మొదలుపెట్టాడు వర్మ. ఇక ఈ చిత్రం తీయడానికి గల అసలు కారణాన్ని ప్రజలకు చెప్పాలని ఎన్టీఆర్ గారు తనను అడిగారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటున్నాడు. ఈ క్రమంలో ఓ ఆడియో ని కూడా సోషల్ మీడియాలో విడుదల చేశాడు.

ఇక ఆ వాయిస్ ద్వారా వర్మ మాట్లాడుతూ….. “ఎన్టీఆర్ గారు 1989 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి అధికారం కోల్పోయిన సమయంలో .. అయన కుటుంబీకులు, పార్టీ నేతలు ఆయన్ని ఏకాకిగా వదిలేసిన సమయంలో లక్ష్మీపార్వతి అనే స్త్రీ ఆయన జీవితంలోకి ప్రవేశించింది. ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన సంబంధం ఆంధ్రప్రదేశ్ రాజకీయ రూపురేఖలను అతలాకుతలం చేసేసి.. పర్మినెంటుగా ఎలా చెరగని ముద్ర వేసిందనేదే ఈ సినిమా సారాంశం. అలాగే పాతిక సంవత్సరాల నుండీ నిజాలుగా చెలామణి అవుతున్న సిగ్గులేని అబద్ధాలను శాశ్వతంగా నిజం అనే గోతిలో పాతిపెట్టడం, రాజకీయ మోసగాళ్ళ మొహాల మీద ముసుగులుతీసి పారేసి వాళ్ళ అసలు వికార నగ్నత్వాన్ని అందరికీ చూపెట్టడం. అలాగే లక్ష్మీ పార్వతితో ఆయన సంబంధం వెనుక ఉన్న రహస్యం, వైశ్రాయ్ ఉదంతం వెనుక ఉన్న అత్యంత నీచమైన కుట్రలు, ఎన్టీఆర్ చివరి రోజుల్లో బోరుబోరున ఏడ్చి పడిన కుమిలిపాటుని కూడా ఈ సినిమాలో వివరంగా చూపించబోతున్నాం.

ఎన్టీఆర్ గారిని మోసం అనే విషం పూసి వెన్నుపోటు కత్తితో పొడిచి చంపారు. ఆ మహా మనిషి ఎన్టీఆర్ గారి చావుకి కారణమైన ప్రతీ ఒక్కరినీ ప్రజా కోర్టులో నిలబెట్టడానికి మీ అభిమాన థియేటర్లలో ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ప్రపంచం యావత్తు ఉన్న తెలుగు ప్రజలే ఈ సినిమాకి న్యాయనిర్ణేతలు. స్వర్గంలో ఉన్న అన్నగారు ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో మీ రాంగోపాల్ వర్మ. సత్యం… విజయం.. తథ్యం…! కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది కల్పితం.. ఆ అందరూ ఎన్టీఆర్ ని ఎందుకు వెన్నుపోటు పొడిచారన్నది యదార్థం” అంటూ రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడా..? లేక ఎన్నికలు ఉన్న సమయం కాబట్టి నందమూరి, నారా వారి కుటుంబాల వారి పై నెగెటివ్ ప్రచారం చేస్తున్నాడా.. అన్నది అర్ధం కాని ప్రశ్న..! ఏదేమైనప్పటికీ వర్మ ప్రచారంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంటుంది. మరి ఇంకా ఈ చిత్రాన్ని ఎన్ని రకాలుగా వర్మ ప్రమోట్ చేస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus