రాజకీయ, సామాజిక అంశాలపై వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తపరడం ఎవరికైనా ఉండే హక్కు. సోషల్ మీడియా విప్లవం తరువాత సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు ప్రతి విషయంపై అందరికీ తెలిసేలా మాట్లాడుతున్నారు. ఐతే వివాదాలు, సున్నితమైన అంశాలపై ప్రముఖులు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా రాజకీయ వివాదాలలో తలదూర్చడం అంత మంచిది కాదు. ఒక పార్టీకో, వ్యక్తితో మద్దతు ప్రకటించడం, ఓ వివాదంపై మాట్లాడడం కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. పార్టీలు, పాలకులు, వారి నిర్ణయాలపై సినిమా తారలకు కూడా అభిప్రాయాలు ఉంటాయి.
ఐతే ఎవరూ బయటపడరు, కారణం ఓ హీరోకి ఉండే అభిమానులలో అన్ని పార్టీలకు చెందినవారు ఉంటారు. సదరు హీరో ఒక పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుంటే మిగతా వారు దూరమయ్యే అవకాశం ఉంది. అలాగే అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి ప్రయోజనాలు దెబ్బ తీసుకోవడం ఎందుకు అనే ఆలోచన కూడా ఉంటుంది. అందుకే సినిమా తారలు తాము ఏ ఒక్కరి తరపునా మాట్లాడరు. ఐతే ఇటీవల యంగ్ హీరో రామ్ ఈ పద్దతిని బ్రేక్ చేశారు.
ఆయన స్వర్ణ ప్యాలస్ ప్రమాద ఘటనలో ముద్దాయిగా ఉన్న రమేష్ చౌదరికి మద్దతు తెలపడంతో పాటు, ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే ఒక సామాజిక వర్గంలో కులపిచ్చి ఎక్కువై మిగతా వారిని ఇబ్బంది పెడుతున్నట్లు ట్వీట్స్ వేశారు. వరుస ట్వీట్స్ తో రాజకీయంగా హీట్ పెంచిన రామ్ టీడీపీ మద్దతు దారుగా రాజకీయ రంగు పులుముకున్నారు. ఈ వ్యవహారంలో ఆయన వైసీపీ శ్రేణుల కోపానికి గురికాగా, టీడీపీ వారికి దగ్గరయ్యారు.