కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ధన్ రాజ్ (Dhanraj) ఇప్పుడు దర్శకుడిగా తన సత్తా చాటుకొనే ప్రయత్నంలో తెరకెక్కించిన చిత్రం “రామం రాఘవం” (Ramam Raghavam). సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నమోదయ్యేలా చేశాయి. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకుంది? దర్శకుడిగా ధన్ రాజ్ సక్సెస్ అయ్యాడా? అనేది చూద్దాం..!!
కథ: తన కొడుకు తనకు తానుగా మంచి పేరు సంపాదించుకొని జీవితంలో స్థిరపడాలి అనుకునే సగటు తండ్రి దశరథ రామం (సముద్రఖని) (Samuthirakani). చిన్నప్పటినుండి చెడు అలవాట్లకు బానిసై సరైన ఉద్యోగం లేక తండ్రి నెలజీతం మీద ఆధారపడి బ్రతికేసే కొడుకు రాఘవ (ధన్ రాజ్). ఒకానొక సందర్భంలో అప్పుల్లో కూరుకుపోయి.. ఏం చేయాలో తెలియక తండ్రిని చంపేసి, ఆయన చనిపోతే వచ్చే ఇన్స్యూరెన్స్ డబ్బుతో సెటిల్ అవ్వాలనుకుంటాడు రాఘవ.
కన్నతండ్రిని చంపాలనే రాఘవ ప్లాన్ కి లారీ డ్రైవర్ దేవ (హరీష్ ఉత్తమన్) (Harish Uthaman)ఎలా ఉపయోగపడ్డాడు? తండ్రి ప్రేమను రాఘవ అర్థం చేసుకోగలిగాడా? అనేది “రామం రాఘవం” (Ramam Raghavam). సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: తండ్రి పాత్రలో సముద్రఖని జీవించేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో హరీష్ ఉత్తమన్ తో ఆయన మాట్లాడే సందర్భం చాలా హృద్యంగా ఉంటుంది. నటుడిగా ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ధన్ రాజ్ ఒక కిరాతకమైన కొడుకుగా కనిపించడానికి కాస్త కష్టపడ్డాడు. అయితే.. అతడి వ్యవహారశైలి ఎందుకు అలా ఉంది? ఎందుకలా మారాడు? అనేది సరిగా చూపించకపోవడంతో ఆ క్యారెక్టర్ సరిగా కనెక్ట్ అవ్వలేదు.
తల్లి పాత్రలో ప్రమోదిని (Pramodini) ఒదిగిపోయింది. ఆమెను చూస్తే మన ఇంట్లో అమాయక తల్లులు గుర్తుకొస్తారు. హరీష్ ఉత్తమన్ చాన్నాళ్ల తర్వాత ఒక మంచి పాత్రలో నటించాడు. సముద్రఖని తర్వాత మంచి క్యారెక్టర్ ఆర్క్ ఉన్నది హరీష్ ఉత్తమన్ పోషించిన దేవా పాత్రకే. సత్య (Satya Akkala) కామెడీ పంచులు అక్కడక్కడా పేలాయి. 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj), సునీల్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: దుగ్రాప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. లైటింగ్ & సీన్ కంపోజిషన్ విషయంలో తీసుకున్న కేర్ అవుట్ పుట్ లో కనిపించింది. కొన్ని ఫ్రేమ్స్ చూస్తే ఇది చిన్న సినిమా అని అస్సలు అనిపించదు. అలాగే.. అరుణ్ చిలువేరు సంగీతం కూడా డీసెంట్ గా ఉంది. నేపథ్య సంగీతం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. కథకు అవసరమైన మేరకు ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ఉన్నాయి. ప్రత్యేకించి ఎలివేట్ చేసే స్థాయిలో అయితే లేవు. చాలా క్రూషియల్ క్లైమాక్స్ సీన్ లో వర్షం గ్రాఫిక్స్ చేయడం అనేది సీన్ మూడ్ ను ఎఫెక్ట్ చేసింది. అలాంటి పొరపాట్లు చాలానే దొర్లాయి.
ఇక దర్శకుడిగా ధన్ రాజ్ పనితనం గురించి మాట్లాడుకోవాలి. ఒక టెక్నీషియన్ గా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. నటీనటుల నుంచి సరైన నటన రాబట్టుకోవడం కానీ, ఫ్రేమ్స్ & లైటింగ్ విషయంలో కానీ ఒక దర్శకుడిగా అతడికి ఉన్న కమాండ్ ప్రశంసార్హం. అయితే కథకుడిగా మాత్రం అలరించలేక తడబడ్డాడు. ముఖ్యంగా.. తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాగే కొడుకుక్కి తండ్రి మీద కోపం ఎందుకు అనేది కూడా సరిగా చూపించలేదు. అందువల్ల డ్రామా సరిగా వర్కవుట్ అవ్వలేదు. ఆ కారణంగా దర్శకుడిగా బొటాబోటి మార్కులతో సరిపెట్టుకున్నాడు ధన్ రాజ్.
విశ్లేషణ: ఒక కథలోని పాత్రలను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు.. సదరు పాత్రల ప్రయాణం కూడా చూపించాలి. లేకపోతే.. ఆ పాత్ర ఎందుకలా బిహేవ్ చేస్తుంది? లేదా అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? అనేదానికి అర్థం ఉండదు. “రామం రాఘవం” (Ramam Raghavam) విషయంలో దర్శకుడిగా ధన్ రాజ్ చేసిన తప్పు అదే.. కొడుకు పాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు, ముఖ్యంగా కొడుకు క్యారెక్టర్ అంత దారుణమైన డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమిటి అనేది సరిగా చూపించకపోవడం కారణంగా.. ముగింపు కదిలించినా, రీజనింగ్ సరిగా లేకపోవడంతో పెద్దగా ఎఫెక్ట్ చేయదు. ఆ కారణంగా “రామం రాఘవం” (Ramam Raghavam). కోర్ పాయింట్ లో షాక్ వాల్యూ ఉన్నప్పటికీ.. దాన్ని తెరకెక్కించిన విధానంలో ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడంతో ఓ సగటు సినిమాగా మిగిలిపోయింది.
ఫోకస్ పాయింట్: ధన్ రాజ్ డీసెంట్ డెబ్యూ!
రేటింగ్: 2.5/5