Ramanna Youth Review in Telugu: రామన్న యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అభయ్ నవీన్ (Hero)
  • అమూల్య రెడ్డి (Heroine)
  • బన్నీ అభిరన్, అనిల్ గీల, జగన్ యోగిరాజ్, తాగుబోతు రమేష్, విష్ణు ఓయ్, (Cast)
  • అభయ్ నవీన్ (Director)
  • ఏ.ఏ.ఆర్ (Producer)
  • కమ్రాన్ (Music)
  • ఫహాద్ అబ్ధుల్ మజీద్ (Cinematography)
  • Release Date : సెప్టెంబర్ 15, 2023

“పెళ్ళిచూపులు, పిట్టకథలు (వెబ్ సిరీస్), సమ్మోహనం, గీతగోవిందం” తదితర చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అభయ్ నవీన్ అలియాస్ అభయ్ బేతగంటి హీరోగా తెరంగేట్రం చేస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “రామన్న యూత్”. తెలంగాణ నేపధ్యం, పాలిటిక్స్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం గత రెండేళ్లుగా చిత్రీకరణ దశలోనే కొట్టుమిట్టాడి.. ఎట్టకేలకు నేడు (సెప్టెంబర్ 15) విడుదలైంది. దర్శకుడిగా, కథానాయకుడిగా అభయ్ నవీన్ విజయాన్ని అందుకోగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!!

కథ: చందు (బన్నీ అభిరన్), రాజు (అభయ్ నవీన్), బాలు (అనిల్ గీల), రమేష్ (జగన్ యోగిరాజ్) అక్షాంపూర్ గ్రామంలోని చిన్ననాటి స్నేహితులు. రాజుకి రాజకీయాలంటే విపరీతమైన అభిమానం, తమ ఏరియా ఎమ్మెల్యే రాజన్న అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఎప్పటికైనా యూత్ లీడర్ అయ్యి.. ఆ తర్వాత పెద్ద పొలిటీషియన్ అయిపోవాలని కలలు కంటూ ఉంటాడు.

ఊరి ఎక్స్ సర్పంచ్ అనిల్ (తాగుబోతు రమేష్) వెంట తిరుగుతూ టైమ్ పాస్ చేస్తుంటాడు. ఒకానొక సందర్భంలో అనిల్ తమ్ముడు మహిపాల్ (విష్ణు ఓయ్)తో కట్టిన పందెం కోసం హైద్రాబాద్ లోని ఎమ్మెల్యేని కలవడం కోసం బండి తీసుకొని వెళ్తారు.

అక్కడ చందు, రాజు, రమేష్ లు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? చివరికి ఎమ్మెల్యేను కలిశారా లేదా అనేది “రామన్న యూత్” కథాంశం.

నటీనటుల పనితీరు: నటించిన నలుగురిలో బాధ్యతగల యువకుడిగా జగన్ యోగిరాజ్ నటన, హావభావాలు ఆకట్టుకుంటాయి. ప్రతి బ్యాచ్ లో ఇలాంటోడు ఒకడుంటాడు అనిపిస్తుంది. చందు డైరెక్ట్ గా పరేషాన్ సినిమా సెట్స్ నుంచి ఈ సినిమా షూట్ కి వచ్చేసినట్లు ఉంటాడు. అనీల్ గీల కాస్త నవ్వించాడు. డైరెక్టర్ కమ్ మెయిన్ లీడ్ అభయ్ నటుడిగా ఇంకా ఓనమాల దగ్గరే ఆగిపోయాడు. తానే దర్శకుడు కావడం వల్ల.. మరీ ఎక్కువ నటించాల్సిన అవసరం లేకుండా తన క్యారెక్టర్ రాసుకున్నాడు. తాగుబోతు రమేష్, విష్ణు ఓయ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా “రామన్న యూత్” చాలా వీక్ సినిమా. సినిమాటోగ్రఫీ నుంచి సంగీతం వరకూ ప్రతి ఒక్క అంశం చాలా పేలవంగా ఉన్నాయి. ముఖ్యంగా సంగీతం.. అసలు సన్నివేశంలోని ఎమోషన్ కి, నేపధ్య సంగీతానికి ఏమాత్రం పోలిక లేదు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. ఎంత తక్కువ బడ్జెట్ సినిమా అయినా కూడా థియేట్రికల్ రిలీజ్ అనుకున్నప్పుడు మినిమం క్వాలిటీ లేకపోతే థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు ఏం చూస్తాడు అనే విషయాన్ని కనీస స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకోలేదు. అందువల్ల.. ఒక షార్ట్ ఫిలిమ్ లేదా ఇండిపెండెంట్ ఫిలిమ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కానీ.. ఒక థియేటరికల్ రిలీజ్ చూస్తున్న అనుభూతి మాత్రం ఈ కోశాన ఉండదు.

ఇక కథ-కథనం-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వంటి బాధ్యతలు చేపట్టి.. సినిమాలో కథానాయకుడిగా కూడా నటించిన అభయ్ నవీన్ పనితనం గురించి మాట్లాడుకోవాలి.

ట్రైలర్ లో వినిపించే చిన్నపాటి డైలాగులు తప్పితే.. సినిమాలో ఒక్క చెప్పుకోదగ్గ డైలాగ్ కూడా లేదు. ఇక స్క్రీన్ ప్లే అని టైటిల్ కార్డ్ వేసుకున్నందుకైనా కాస్త కథనం మీద కాన్సన్ ట్రేట్ చేసి ఉంటే బాగుండేది. వెబ్ సిరీస్ లా తీసినా కూడా మినిమమ్ 4 ఎపిసోడ్లు కూడా తీయలేని ఒక సాధారణ పాయింట్ తో రెండు గంటల సినిమాను నడపడానికి నవీన్ చేసిన ప్రయత్నం గట్టిగా బెడిసికొట్టింది. ఒక్క రమేష్ పాత్ర తప్పితే.. ఏ ఒక్క క్యారెక్టర్ కి సరైన ఆర్క్ ఉండదు. పాపం హీరోయిన్ క్యారెక్టర్ అసలే చిన్నది అనుకుంటే.. ఆమెకి ఉన్న ఒక్క పాట కూడా ఎడిటింగ్ లో లేపేశారు. అభయ్ రాసుకున్న కథ కొత్తదేమీ కాదు.. ఇదే కాన్సెప్ట్ తో ఓంకార్ అప్పట్లో “జీనియస్” అనే సినిమా తెరకెక్కించాడు. భారీ కమర్షియల్ అంశాలున్న ఆ సినిమానే సరిగా ఆడలేదు.

అలాంటిది.. కనీస స్థాయి కథనం లేని “రామన్న యూత్” ఆడుతుంది అని అభయ్ ఎలా అనుకున్నాడు అనేది అర్ధం కానీ ప్రశ్న. మూల కథగా “రామన్న యూత్” ఓ మోస్తరుగా ఉంటుంది.. అయితే ఆ మూలకథను ఆకట్టుకొనే విధంగా చెప్పే కథనం బాగోకపోవడం అనేది సినిమాకి పెద్ద మైనస్. 122 నిమిషాల సినిమాను అలరించే విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు అభయ్ దారుణంగా విఫలమయ్యాడు.

విశ్లేషణ: అరుపులు, తిట్లు, కొట్లాటలు, తాగుడు సన్నివేశాలతో సినిమాను నింపేస్తే.. అది తెలంగాణ సినిమా అయిపోతుంది అనే భ్రమ నుండి దర్శకులు, రచయితలు బయటకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. తెలంగాణ సినిమా ఎలా ఉండొచ్చు అనేది “బలగం” సినిమాతో చూపించాడు వేణు. సినిమాలో కథ, కథనం, ఆచారవ్యవహారాలతోపాటు.. ఆత్మ కనిపించాలి, సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఓ భావోద్వేగానికి లోనవ్వాలి కానీ.. నీరసపడకూడదు. ఈ విషయాల్ని దర్శకనిర్మాతలు సీరియస్ గా తీసుకోనంత వరకూ “రామన్న యూత్” లాంటి సినిమాలు వచ్చిపోతూనే ఉంటాయి!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus