వెండితెరపై రానా దగ్గుబాటి కనిపించి చాలా కాలమే అవుతోంది. ఒకప్పుడు హీరోగా, విలన్‌గా బిజీగా ఉన్న ఈ భళ్లాలదేవ, ఇప్పుడు మాత్రం నటన కంటే బిజినెస్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. సినిమాలు చేయకపోయినా, ఇండస్ట్రీలో ఆయన ఆదాయం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దీనికి కారణం రానాలోని తెలివైన వ్యాపారవేత్త. బాలీవుడ్ బడా నిర్మాతలు, డిజిటల్ సంస్థలతో ఆయనకున్న బలమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, సైలెంట్‌గా తన ఖాతాలో కోట్లు వేసుకుంటున్నారు.
RANA DAGGUBATI
రానా స్ట్రాటజీ చాలా సింపుల్ కానీ ఎఫెక్టివ్. ఆయన టీమ్ నిరంతరం కొత్త కంటెంట్‌ను, చిన్న సినిమాలను పరిశీలిస్తూ ఉంటుంది. ఏదైనా కథ నచ్చితే చాలు, ఆ ప్రాజెక్ట్‌లో రానా ఒక ప్రమోటర్‌గా జాయిన్ అయిపోతారు. కేవలం తన బ్రాండ్ ఇమేజ్‌ని ఉపయోగించి, ఆ సినిమా బిజినెస్‌లో 15 నుండి 20 శాతం వాటా తీసుకుంటారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా, బిజినెస్ డీల్స్ ద్వారానే లాభాలు గడించడం ఆయన కొత్త పంథా.
ముఖ్యంగా నాన్ థియేట్రికల్ రైట్స్ (OTT, శాటిలైట్) అమ్మకాల్లో రానా దిట్ట. సినిమా రిలీజ్‌కు ముందే ఈ హక్కులను భారీ రేట్లకు విక్రయించి, నిర్మాతలు సేఫ్ అయ్యేలా చూస్తారు. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో కలిసి రానా నిర్మించిన ‘కాంత’ సినిమానే ఇందుకు నిదర్శనం. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, వీరిద్దరూ కలిసి డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారానే దాదాపు 50 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారట.
దీంతో సినిమా థియేటర్లలో ఆడిందా లేదా అనే టెన్షన్ లేకుండా, పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేసింది. ఇక థియేటర్ రెవెన్యూ ఏదొచ్చినా అది అదనపు లాభమే. ఇలాంటి స్మార్ట్ డీల్స్ వల్లే ఇప్పుడు చాలా చిన్న సినిమాలు రానా ‘స్పిరిట్ మీడియా’ వైపు చూస్తున్నాయి. మంచి కంటెంట్ ఉన్నా మార్కెటింగ్ చేసుకోలేని వారికి రానా ఒక పెద్ద దిక్కులా మారారు. అటు వారికి హెల్ప్ చేస్తూనే, ఇటు తన వాటా తాను తీసుకుంటున్నారు. రానా ఇప్పుడు కేవలం నటుడు మాత్రమే కాదు, కార్పొరేట్ స్థాయి వ్యూహాలతో ఇండస్ట్రీని శాసించే బిజినెస్ మ్యాన్. మేకప్ వేసుకోకుండా, కెమెరా ముందు నిలబడకుండానే ఇంత తెలివిగా సంపాదించడం బహుశా రానాకు మాత్రమే చెల్లిందేమో. రాబోయే రోజుల్లో మరిన్ని చిన్న సినిమాలు రానా చేతి మీదుగా విడుదలై, ఇలానే లాభాల బాట పట్టే అవకాశం ఉంది.