‘లీడర్’ సినిమాతో దగ్గుబాటి కుటుంబం నుండి రెండో హీరోగా తెరమీదికొచ్చాడు రానా. వెనువెంటనే బాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చి దూకుడు చూపించిన ఈ దగ్గుబాటి కథానాయకుడు డిపార్ట్మెంట్, బేబీ వంటి సినిమాలతో అక్కడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ‘నేను నా రాక్షసి’, ‘నా ఇష్టం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ కలిపి నాలుగు సినిమాలు చేసిన రానా సరైన విజయం ఒక్కటీ అందుకోలేకపోయాడు. సరిగ్గా అదే సమయంలో రాజమౌళి పుణ్యమా అని ‘బాహుబలి’ కోసం విలన్ అవతారమెత్తిన రానా మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నాడట.
‘బాహుబలి’ ప్రభాస్ తో సమానంగా రానాకి గుర్తింపునిచ్చిందన్నది వాస్తవం. అయితే ఆ తరహా పాత్రలు ఎప్పుడో కానీ రావు. గనక విలన్ గా మిగిలిపోవడంలో అర్థం లేదు. రెగ్యులర్ తెలుగు సినిమాల్లో విలన్ పాత్రకి ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. తెలుగు సినిమా దిగ్గజాల్లో ఒకరైన రామానాయుడు కుటుంబం నుండి వచ్చి ఆ పాత్రలతో మిగిలిపోవాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. అందుకే రానా హీరోగా చేయాల్సిన సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు. మరోవైపు ఆయన తండ్రి నిర్మాత సురేష్ బాబు కూడా ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరెపు వంటి యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారట. ‘సబ్ మెరైన్’ నేపథ్యంలో రూపొందిన ‘ఘాజీ’ సినిమాలోనూ రానా హీరోగానే మెప్పించనున్నాడు.