రంగస్థలం సాంగ్స్ రివ్యూ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ రంగస్థలం. ఇది 1985 లో జరిగిన కథ. అందుకు తగ్గట్టుగానే అప్పటి వాతావరణం కళ్ళకు కట్టేలా డైరక్టర్ ప్రయత్నించారు. ఇక చెవులకు వినిపించేలా మ్యూజిక్ డైరక్టర్ సంగీతాన్ని అందించారు. ఇది వరకు మూడు పాటలు యూట్యూబ్ లో రిలీజ్ అయి సంచనం సృష్టించాయి. చంద్రబోస్ సింగిల్ కార్డు అందుకున్న ఈ సినిమా పూర్తి పాటలు విడుదలై సంగీతఅభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలు ఎలా ఉన్నాయో… తెలుసుకుందాం.

ఎంత సక్కగున్నావే

పల్లెటూరి కుర్రోడు తన మనసుదోచిన అమ్మాయి అందాన్ని వర్ణించే ఈ పాట ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకుంది. పల్లె అందాల కింద నిద్రపోతున్న పదాలను నిద్రలేపి మరీ చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా.. దేవీ శ్రీ ప్రసాద్ సింపుల్ గా పాడుకునే ట్యూన్ ఇచ్చి అందరి నోటానానేలా చేశారు. దేవీ తానే సొంతంగా ఈ పాట పాడి కొత్త అనుభూతిని కలిగించారు.

రంగా రంగా రంగస్థలాన

“రంగు పూసుకోకున్నా.. వేషం వేసుకోకున్నా.. ఆట బొమ్మలం.. మనమంతా” అంటూ చంద్రబోస్ ఈ పాటలో జీవిత సత్యాన్ని చెప్పారు. ఫిలాసఫీ చెబుతున్నా దాన్ని డప్పుల దరువులతో దేవీ స్టెప్పులు వేయించేలా చేశారు. రాహుల్ చాలా ఈజ్ తో పాడి అదరగొట్టారు.

రంగమ్మా మంగమ్మా

చిట్టిబాబు ప్రేమ తెలియని వాడు.. అమ్మాయి బాధపడుతున్నా పట్టించుకోడు అంటూ రామలక్ష్మి రంగమ్మా మంగమ్మాలకు గోడు వెళ్లబోసుకునే ఈ పాటకు జానపద గీతంలా కంపోజ్ చేసి దేవీ అప్పటి కాలానికి తీసుకుపోయారు. ఎం ఎం మానసి తన గాత్రంతో ఈ పాటని మరింత జోష్ ని ఇచ్చింది.

ఆ గట్టునుంటావా నాగన్న

సినిమాలో సందర్భానుసారం వచ్చే పాట “ఆ గట్టునుంటావా”. గ్రామంలో ఎన్నికల సందర్భంగా వచ్చే ఈ పాట నేటి పరిస్థితికి కూడా సరిగ్గా సూటవుతుంది. ప్రముఖ జానపద గాయకుడు శివ నాగులు అద్భుతంగా ఆలపించారు. అటుపక్క గంజాయి మొక్క ఉంది… ఇటుపక్క గంధపు చెక్క ఉంది… అంటూ సాధారణ పదాలతో చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా రాక్ స్టార్ సంప్రదాయ వాయిద్యాలతో వీనుల విందు చేశారు

జిగేల్ రాణి

సుకుమార్, దేవీ కాంబినేషన్లో ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ రేంజ్ లోనే జిగేల్ రాణి పాటను అందించారు దేవీ. నేటి తరం వాయిద్యాల బీట్ లేకపోకపోవడంతో స్పీడ్ తగ్గినా తబలతో కాలు కదిలించేలా సంగీతం ఇచ్చారు. రేలా రేలా షోలో అందరి అభినందనలు అందుకున్న కుమార్ ఈ పాటను హుషారుగా పాడి ప్రశంసలు అందుకుంటున్నారు. అలాగే గంట వెంకట లక్ష్మి వాయిస్ ఈ సాంగ్ కి ప్లస్ అయింది.

ర్యాప్, పాప్.. హిప్ హాప్, వెస్ట్రన్ మ్యూజిక్ తో మునిగిపోయి ఉన్న నేటితరం వారిని రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ డప్పులు, తబలా.. వంటి సాంప్రదాయ వాయిద్యాలతో ఆనాటి కాలానికి తీసుకెళ్లారు. మన సాంప్రదాయ సంగీతాన్ని మరోసారి పరిచయం చేశారు. ఇక చంద్రబోస్ కూడా స్వచ్ఛమైన మట్టి వాసనలాంటి సాహిత్యాన్ని ఇచ్చి తెలుగు రుచిని చూపించారు. మొత్తం మీద రంగస్థలం టీమ్ పాటలతోనే సగం హిట్ అందుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus