అద్భుతమైన కథ.. రామ్ చరణ్, సమంతల నవరస నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కృషి కలిసి రంగస్థలాన్ని అందమైన కళాఖండంగా చేశాయి. గతనెల 30 న రిలీజ్ అయిన ఈ సినిమా హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. తెలుగు భాషలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్, 103 కోట్ల షేర్ ను వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన 3వ తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. నాన్ బాహుబలి రికార్డులన్నిటిని తిరగరాసింది. రామ్ చరణ్ కెరీర్ లో ఉత్తమచిత్రంగా చెప్పుకునే “మగధీర” ని కూడా క్రాస్ చేసింది.
విదేశాల్లోనూ రంగస్థలం భారీ వసూళ్లను రాబడుతోంది. టాలీవుడ్ చిత్ర ప్రముఖులందరితో అభినందనలు అందుకున్న ఈ సినిమాని ఇతర భాషల్లోకి అనువదించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. తమిళం, హిందీ, మలయాళం, భోజ్ పురి భాషల్లోకి చిత్రాన్ని డబ్బింగ్ చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే ఆ పనులు మొదలెట్టి.. రంగస్థలం ఫీవర్ తగ్గేలోపున రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. ఈ నాలుగుభాషల్లో రిలీజ్ అయితే బాహుబలి బిగినింగ్ చిత్ర రికార్డును సైతం రంగస్థలం అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.