రాజ్ తరుణ్ కథానాయకుడిగా అన్నపూర్ణ సంస్థలో రూపొందిన రెండో చిత్రం “రంగుల రాట్నం”. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ అసిస్టెంట్ శ్రీరంజని ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవ్వగా.. రాజ్ తరుణ్ సరసన “మా అబ్బాయి” ఫేమ్ చిత్ర శుక్ల కథానాయికగా నటించింది. సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 14) విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : ఎమోషన్స్ క్రియేటివ్ కంపెనీ అనే సంస్థలో పని చేస్తూ.. పెద్దగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకపోయినా తల్లి పట్ల విపరీతమైన అభిమానంతో మెలుగుతుంటాడు విష్ణు (రాజ్ తరుణ్). అప్పటికే తల్లి (సితార) పెళ్లి చేసుకోమని గోల పెడుతుండడంతో.. తొలిచూపులోనే ఇష్టపడ్డ కీర్తి (చిత్రా శుక్లా)ను ప్రేమించి పెళ్లాడాలనుకొంటాడు. ఇద్దరి మధ్య స్నేహం కూడా ఏర్పడుతుంది. అయితే.. ఏ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకొని విష్ణుకి, ప్రతి విషయంలోని అమితమైన జాగ్రత్తతో వ్యవహరిస్తుండే కీర్తికి సఖ్యత కుదిరిందా? ఒకవేళ కుదిరితే వారి జీవనం ఎలా సాగింది? చివరి వరకూ కలిసే ఉన్నారా? కలిసుండడం కోసం వారు పడిన ఇబ్బందులేమిటి? అనేది “రంగుల రాట్నం” కథాంశం.
నటీనటుల పనితీరు : ఎమోషనల్ రోల్ లో రాజ్ తరుణ్ మెప్పించాడు. ప్రేమకి-జాగ్రత్తకి మధ్య నలిగిపోయే నవతరం ప్రేమికుడిగా రాజ్ తరుణ్ నటన చాలా మంది ఓన్ చేసుకొంటారు. అలాగే సెంటిమెంట్ సీన్స్ లోనూ తదైన ముద్ర వేయాలని ప్రయత్నించాడు కానీ.. పతాకస్థాయి బాధను ప్రదర్శించలేకపోయాడు. హీరోయిన్ చిత్ర శుక్లా అందంగా ఉంది, చక్కగా నటించింది కూడా. అయితే.. కొన్ని ఫ్రేమ్స్ లో రాజ్ తరుణ్ కంటే పెద్దదానిలా కనిపించడం (అప్పటికే దర్శకురాలు శ్రీరంజని హీరో కంటే హీరోయిన్ ఒక ఏడాది పెద్దది అని చెప్పినప్పటికీ) మాత్రం మైనస్ అనే చెప్పాలి. ఆమె క్యారెక్టరైజేషన్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగున్నప్పటికీ.. అందుకోసం ఎక్కువ నిడివి కేటాయించడం మాత్రం మెచ్చుకోదగ్గ విషయం కాదు. అలాగే ప్రియదర్శి-ఝాన్సీ రాధోడ్ లు మొగుడుపెళ్ళాలుగా ఆకట్టుకొన్నారు, వారిద్దరి కాంబినేషన్ ఎపిసోడ్స్ కాస్త నవ్వించాయి.
సాంకేతికవర్గం పనితీరు : శ్రీచరణ్ పాకల పాటల కంటే నేపధ్య సంగీతం కాస్త బాగుంది. ఉన్న ఒక్క ఎమోషనల్ సాంగ్ కూడా “రఘువరన్ బీటెక్” చిత్రంలోని అమ్మ పాటను గుర్తుకు తెచ్చేలా ఉంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ లో పేస్ మిస్సయ్యింది. కంటిన్యూటీ కనిపించకపోగా.. స్క్రీన్ ప్లే పరంగా ఎఫెక్టివ్ నెస్ కూడా చూపలేకపోయాడు. ఎల్.కె.విజయ్ సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. తక్కువ లొకేషన్స్ లోనే చిత్రీకరణ జరిపినప్పటికీ రిపిటీషన్స్ లేకుండానే కాక ప్రేక్షకుడికి కూడా బోర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం అభినందనీయం. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ కథకి తగ్గట్లుగా ఉన్నాయి.
దర్శకురాలు శ్రీరంజని సీన్ కంపోజిషన్ విషయంలో తన గురువు సెల్వ రాఘవన్ ను కాస్త గట్టిగా ఫాలో అవ్వడం వలన “7/జి బృందావన కాలనీ” ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక రచయితగా ఆమె ఎంచుకొన్న కథ నేటి తరానికి తగ్గదే అయినప్పటికీ.. నడిపించిన కథనం మాత్రం నత్త నడక సాగడంతో ప్రేక్షకుడు నీరసపడతాడు. ప్రేమలో ఉన్న అబ్బాయి దృష్టి కోణాన్ని వీలైనంత సహజంగా తెరకెక్కించిన శ్రీరంజని.. అమ్మాయి పాయింటాఫ్ వ్యూ విషయంలో మాత్రం పెద్దగా కొత్తదనం చూపలేకపోయింది. ప్రేమ అనేది అనంతం, ఆ సబ్జెక్ట్ పై ఇప్పటికే వేల సినిమాలోచ్చాయి భవిష్యత్ లో లక్షల సినిమాలోచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. థియేటర్ కి వచ్చే ప్రతి ప్రేక్షకుడు కేవలం ప్రేమను ఆస్వాదిద్దామని మాత్రమే రాడు. ఒకరికి కామెడీ, మరొకరు రొమాన్స్, ఇంకొంకరు సెంటిమెంట్.. ఇలా చాలా అంశాలను కోరుకొని థియేటర్ లోకి అడుగుపెడతారు.
శ్రీరంజని తెరకెక్కించిన “రంగుల రాట్నం”లో ఎమోషన్, లవ్, సెంటిమెంట్, కామెడీ అన్నీ ఉన్నాయి. అయితే.. వాటి మేళవింపు సరిగా లేదు.
మహిళా దర్శకురాళ్ళు కనుమరుగవుతున్న తరుణంలో శ్రీరంజని ఒక దర్శకురాలిగా తెలుగు తెరకు పరిచయమవ్వడం సరైనదే. అయితే.. ఒక దర్శకురాలిగా తనలోని రచయితను సాటిస్ఫై చేసుకోవడంతోపాటు ప్రేక్షకుల అభీష్టాన్ని కూడా ఆమె పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మదర్ సెంటిమెంట్, అమ్మాయి ప్రేమతో చూపే అతి జాగ్రత్త వంటి అంశాలను ప్రియదర్శిని తన పరిధిమేరకు అద్భుతంగా తెరకెక్కించింది. అయితే.. ఒక దర్శకురాలిగా ఆమె తన తెలివిని ఎంత విపరీతంగా ప్రదర్శించినా.. థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడు ఆ తెలివిని, ఎమోషన్ తో ఓన్ చేసుకోకపోతే సినిమా అటకెక్కినట్లే. శ్రీరంజని మాత్రమే కాదు భవిష్యత్ దర్శకులందరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
విశ్లేషణ : అసలే సంక్రాంతి సీజన్.. థియేటర్లకు కుటుంబం మొత్తం తరళి వెళ్తారు. అందువల్ల అందర్నీ ఆకట్టుకొనే సినిమా కాకపోవడం “రంగుల రాట్నం”కి మైనస్ పాయింట్ అయితే.. ప్రేమకథలను, సెన్సిబుల్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ మాత్రం “రంగుల రాట్నం” చిత్రాన్ని కాస్తో కూస్తో ఆదరించే అవకాశం ఉంది.