‘అత్తారింటికి దారేది’ రిలీజ్ కి ముందువరకూ తండ్రి పాత్రలకు లేక మంచితనం ఉట్టిపడే పాత్రలకు ప్రకాష్ రాజ్ తప్ప వేరొక నటుడు లేకపోవడంతో దర్శకనిర్మాతలందరూ ప్రకాష్ రాజ్ డేట్స్ కోసం క్యూ కట్టేవారు. కానీ.. రావురమేష్ రాకతో ఆ పరిస్థితి మారింది. ఒకానొక స్టేజ్ లో ప్రకాష్ రాజ్ కి రీప్లేస్ మెంట్ లా తయారయ్యాడు రావు రమేష్. ఆయన పాత్రలన్నీ తన్నుకుపోయాడు. అయితే.. ఆ తరహా పాత్రలో రావు రమేష్ ను చూసీ చూసీ ప్రేక్షకులకు మోనాటనీ వచ్చేసింది. అందుకే ఆయన పోషించే పాత్రల కోసం హిందీ లేదా భోజ్ పురీ నటులను అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే.. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తెలుగు సినిమాకి మంచి తండ్రి దొరికాడు. గతవారం విడుదలైన “నీదీ నాదీ ఒకే కథ” సినిమా చూశాక, అందులో దర్శకుడు దేవీప్రసాద్ తండ్రిగా నటించిన తీరు చూసి మెచ్చుకోనివారు లేరు. ప్రకాష్ రాజ్, రావు రమేష్ ల కంటే సహజంగా దేవీప్రసాద్ నటించిన విధానం చూసి అభినందించకుండా ఉండలేకపోతున్నారు. సో, తమిళ దర్శకుడు సముద్రఖని తరహాలో దేవీప్రసాద్ కూడా దర్శకుడిగా సినిమాలకు స్వస్తిపలికి, నటుడిగా కొత్త కెరీర్ ను స్టార్ట్ చేస్తారేమో చూడాలి.