హీరోయిన్ కూతురు హీరోయిన్ అవ్వడం అనేది ఇండియన్ సినిమాలో కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా ఇలా అవుతూనే ఉన్నారు. నెపో కిడ్స్ అంటూ వారిని నెటిజన్లు, ట్రోలర్లు ఏదో ఒకటి అనడం వింటూనే ఉన్నాం. అయితే వారు నెపో కిడ్ హీరో కంటే బాగా మెప్పించి.. వావ్ అనిపిస్తున్నారు కూడా. ఇప్పుడు ఇలా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మరో నెపో కిడ్ రషా తడానీ. సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె ఈమె అనే విషయం తెలిసిందే. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా రూపొందిన ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ఈ నెల 30న విడుదల అవుతున్న సందర్భంగా రషా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తెలుగు భాషపై పట్టు లేకపోవడంతో డైలాగులు చెప్పడానికి మొదట్లో ఇబ్బంది పడ్డానని.. ఆ తర్వాత సినిమా టీమ్ సాయంతో బాగానే చేశానని చెప్పింది. జయకృష్ణ సైలెంట్‌గా కనిపిస్తాడు కానీ సెట్స్‌లో అల్లరి చేసేవాడని చెప్పింది. షూటింగ్ సమయంలో బోర్డ్ గేమ్స్ ఆడేవాళ్లమని, జయకృష్ణ చీటింగ్ చేసేవాడని చెప్పింది.
మోహన్ బాబుతో పనిచేయడం సరదాగా అనిపించిందని, మా అమ్మతో ఆయన నటించిన రోజులను, తన అనుభవాలను తనతో షేర్ చేసుకున్నారని చెప్పింది. మరి అమ్మేమీ చెప్పలేదా అని అడిగితే.. నటనకు సంబంధించి సూచనలు ఏవీ అమ్మ ఇవ్వదని. అయితే తెలుగు సినిమా అనగానే.. అక్కడ షూటింగ్ సరదాగా సాగుతుందని చెప్పింది. తెలుగు నేర్చుకోమని సలహా ఇచ్చింది అని రషా చెప్పుకొచ్చింది. ‘శ్రీనివాస మంగాపురం’లో తాను పోషించిన మంగ పాత్ర లాగే నిజ జీవితంలోనూ అలానే ఉంటా అని చెప్పింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ప్రత్యేక గీతం, ఓ సినిమాతో మంచి పేరే తెచ్చుకుంది. మరి తెలుగులో ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.