స్టార్ డమ్, సక్సెస్ నాలో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు!! : రష్మిక మందన

పరిచయమైన తొలి చిత్రంతోనే స్టార్ డమ్, ఫేమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం అనేది మామూలుగా అందరు హీరోయిన్లకు దక్కే అదృష్టం కాదు. అలాంటిది ఒకే ఒక్క సినిమాతోనే యావత్ సౌత్ ఇండియన్ ఆడియన్స్ హృదయాల్లో తన నటనతో, అందంతో చెరగని సంతకం చేసింది రష్మిక మందన. కన్నడలో నటించిన రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా రూపాంతరం చెందిన రష్మిక తెలుగులో “ఛలో” చిత్రంతో పరిచయమవుతుంది. ఇంకో రెండ్రోజుల్లో రిలీజవుతున్న తన పరిచయ చిత్రం గురించి, తన భవిష్యత్ సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి చెప్పిన విశేషాలు మీకోసం..!!

నేను కూర్గ్ అమ్మాయిని..
నాన్న బెంగుళూరు బేస్డ్ బిజినెస్ మ్యాన్. నేను పుట్టింది, 10th క్లాస్ వరకూ చదివింది మొత్తం కూర్గ్ లోనే. తర్వాత డిగ్రీ చదువుకోవడం కోసం బెంగుళూరు వచ్చాను. మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అందువల్ల చాలా పద్ధతిగా పెరిగాను, కనీసం క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉండేవారు కాదు.

అక్షయ్ కుమార్ నన్ను “ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా”గా సెలక్ట్ చేశారు..
కాలేజ్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన “ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా”లో సరదాగా పార్టిసిపేట్ చేశాను. అయితే ఊహించని విధంగా అందులో విన్నర్ గా నిలిచాను. అప్పుడు అక్షయ్ కుమార్, రాణా చేతుల మీదుగా అవార్డ్ తీసుకోవడం ఎప్పటికీ మరువలేను.

గూగుల్ లో ఫోటోలు చూసి..
“ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా” అవార్డ్ గెలుచుకొన్న తర్వాత నా పేరు బెంగుళూరు మొత్తం మారుమ్రోగిపోయింది. అప్పుడే “కిరిక్ పార్టీ” ప్రొడ్యూసర్స్ నా ఫోటో గూగుల్ లో చూసి నాకోసం విపరీతంగా ట్రై చేశారు. అయితే నా నెంబర్ ఎవరి దగ్గరా లేదు, మా టీచర్ ద్వారా నా నెంబర్ సంపాదించి నన్ను సంప్రదించారు. అలా కన్నడ “కిరిక్ పార్టీ”లో అవకాశం సొంతం చేసుకొన్నాను.

“కిరిక్ పార్టీ” వల్లే “ఛలో” ఛాన్స్..
మా డైరెక్టర్ వెంకీ “కిరిక్ పార్టీ”ని చెన్నైలో చూసి మా మదర్ ని కాంటాక్ట్ చేశారు. నిజానికి “కిరిక్ పార్టీ” తర్వాత సినిమాలే చేయొద్దనుకొన్నాను. అందులోనూ నాకు అసలు అర్ధమే కాని తెలుగు భాషలో సినిమాలే వద్దనుకొన్నాను. కానీ.. వెంకీ కథ చెప్పిన విధానం, ఆ సినిమాలో నా క్యారెక్టర్ “కిరిక్ పార్టీ”లో ప్లే చేసిన స్టూడెంట్ రోల్ కి దగ్గరగా ఉండడంతో ఒకే చేశాను.

కొత్తగా ఏమీ ఉండదు..
నా క్యారెక్టర్ ద్వారా సినిమాలో ఇంపాక్ట్ ఏమీ ఉండదు. సినిమాలో నా పాత్ర కేవలం 5% మాత్రమే. అయితే.. టీం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా శౌర్య ఎనర్జీ లెవల్స్, వెంకీ టేకింగ్ బాగా నచ్చాయి. నా క్యారెక్టర్ పెద్ద కొత్తగా ఏమీ ఉండదు. రెగ్యులర్ కాలేజ్ స్టూడెంట్ రోల్ లాగే ఉంటుంది.

“నా పేరు సూర్య”లో హీరోయిన్ గా నేనే చేయాల్సింది.. .
నిజానికి అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమాలో హీరోయిన్ గా ముందు నన్ను సంప్రదించారు. టెస్ట్ షూట్ తోపాటు ఫోటో షూట్ కూడా అయ్యింది. నేనే హీరోయిన్ అని నేను స్ట్రాంగ్ గా మైండ్ లో ఫిక్స్ కూడా అయిపోయాను. కానీ ఆఖరి నిమిషంలో ఏం జరిగిందో నాకు కూడా తెలియకుండానే ఆ సినిమా నేను చేయలేకపోయాను.

అందుకే ధైర్యంగా డబ్బింగ్ చెప్పగలిగాను..
మా డైరెక్టర్ వెంకీ స్క్రిప్ట్ ఒకరోజు ముందుగానే ఇచ్చేవాడు. అందువల్ల డైలాగులు బాగా కంటతాపట్టేదాన్ని. అలా ఆల్మోస్ట్ అన్నీ డైలాగ్స్ నా బ్రెయిన్ లో స్టోర్ అయిపోయాయి. అందుకే డబ్బింగ్ చెప్పమన్నప్పుడు ధైర్యంగా ట్రై చేస్తానన్నాను. తర్వాత మా కో డైరెక్టర్స్ హెల్ప్ వల్ల సక్సెస్ ఫుల్ గా డబ్బింగ్ చెప్పాను. భవిష్యత్ లోనూ నా సినిమాలకి నేనే డబ్బింగ్ చెప్పుకొంటాను.

అడిగారు కానీ కుదరలేదు..
కన్నడలో సూపర్ హిట్ అయిన “కిరిక్ పార్టీ” తెలుగు రీమేక్ అయిన “కిర్రాక్ పార్టీ”లోనూ నన్ను హీరోయిన్ గా తీసుకోవాలనుకొన్నారు. కానీ.. నేను ఆల్రెడీ ఒకసారి నటించిన క్యారెక్టర్ లో మళ్ళీ నటించాలంటే నాకే బోర్ అనిపించి ఆ సినిమా చేయనన్నాను. ఇంకొన్ని తెలుగు సినిమాలకు కూడా అడిగారు కానీ ఆ టైమ్ కి కన్నడలో సినిమాలతో బిజీగా ఉండడం వల్ల అవి చేయలేకపోయాను.

చాలా ఇబ్బందిగా ఉందండీ..
కన్నడ/తెలుగు చిత్రసీమల్లో నాకు షూటింగ్ పరంగా పెద్ద తేడాలేమీ తెలియలేదు కానీ.. కన్నడలో ఏవైనా ఈవెంట్స్ కి వెళితే చాలా సింపుల్ గా జీన్స్, టీషర్ట్ వేసుకొని వెళ్లిపోయేదాన్ని. కానీ.. ఇక్కడ చాలా జాగ్రత్తగా బాగా రెడీ అయ్యి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూకి కూడా అరగంట సేపు మేకప్ వేసుకొని ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఇంకో అరగంట ఆలోచించి మొత్తానికి మీ ముందు ఇలా కూర్చున్నాను. ఇలా భారీ డ్రెస్సింగ్ నాకు చాలా ఇబ్బందిగా ఉందండీ.

యంగ్ హీరోస్ అన్ ప్రెడిక్టబుల్..
కన్నడలో “కిరిక్ పార్టీ” కాకుండా ఇద్దరు సీనియర్ హీరోలతో కలిసి నటించాను. ఇక్కడ తెలుగులో శౌర్య, విజయ్ దేవరకొండ అనే యంగ్ స్టర్స్ తో కలిసి నటించాను. సొ, కన్నడలో సీనియర్స్ నుంచి రెస్పాన్సబిలిటీ నేర్చుకొంటే.. తెలుగులో యంగ్ హీరోస్ దగ్గరనుంచి కొత్తగా ఎలా నటించాలి అనే విషయం నేర్చుకొన్నాను.

ఇంట్లో వాళ్ళ కోసమే ఎంగేజ్ మెంట్..
నా వయసు ఇప్పుడు 21. ఈ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదు. కానీ కుటుంబ సభ్యులు ఫోర్స్ చేయడం, వాళ్ళ అభీష్టాన్ని ఎందుకు కాదనాలి అనే ఉద్దేశ్యంతోనే రక్షిత్ ని ఒప్పించి ఎంగేజ్ మెంట్ చేసుకొన్నాను. పెళ్లి ఎప్పుడు అనేది నేను ఇప్పటివరకూ డిసైడ్ అవ్వలేదు. ప్రస్తుతం నా ధ్యాస మొత్తం సినిమాల మీదే ఉంది.

రోడ్ మీద సైక్లింగ్ చేస్తున్నా ఎవరూ గుర్తుపట్టరు..
నా పరిచయ చిత్రం “కిరిక్ పార్టీ” కన్నడలో ఆల్మోస్ట్ సంవత్సరం ఆడింది. ఆ తర్వాత నటించిన “అంజనీపుత్ర, చమక్” చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. అయినప్పటికీ ఆ సక్సెస్ ల విజయగర్వం నాకు ఏమాత్రం రాలేదు. పైగా నేను రోడ్డుమీద కళ్ళజోడు పెట్టుకొని సైక్లింగ్ చేస్తుంటే ఎవరూ గుర్తుపట్టరు కూడా. అందుకే ఇప్పటికీ ఒక సాధారణ అమ్మాయిలా ఫీలవుతుంటా.

ఈ జర్నీ చాలా కష్టంగా ఉంది..
వారానికి ఒకసారి హైద్రాబాద్ నుంచి బెంగుళూరు ట్రావెల్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ నాలుగు రోజులు ఉండి అందరితో తెలుగు మాట్లాడడం వల్ల కన్నడ మర్చిపోతున్నాను. మళ్ళీ బెంగుళూరు వెళ్ళాక అక్కడ అందరితో కన్నడ మాట్లాడి తెలుగు మర్చిపోతున్నాను.

నా ఫియాన్సీని ఒక బైలింగువల్ చేయమని అడుగుతున్నా..
నా ఫియాన్సీ (రక్షిత్ శెట్టి)కి కన్నడలో మంచి పేరు, స్టార్ డమ్ ఉంది. ఇప్పుడు “ఛలో” మరియు నెక్ట్స్ విజయ్ దేవరకొండతో సినిమా వల్ల తెలుగులో నాకు మంచి మార్కెట్ వస్తుంది. సో అందుకే ఆయన్ని తెలుగు-కన్నడలో ఒక బైలింగువల్ సినిమా చేయమని అడుగుతున్నా (నవ్వుతూ..).

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus