నా సినిమాలకు నా కొడుకే నాకు పెద్ద క్రిటిక్ : రవితేజ

సాధారణంగా న్యూస్ పేపర్స్ లో వచ్చే స్టార్ హీరోహీరోయిన్లు లేదా సెలబ్రిటీల ఇంటర్వ్యూస్ అన్నీ చదవడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా లేదా ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి. నిజానికి వారి సమాధానాలు అంత ఆసక్తికరంగా ఉండవు. ఒక్కోసారి ఆసక్తికరమైన సమాధానాలు చెప్పినా అవన్నీ వన్ వర్డ్ ఆన్సర్స్ అయ్యుంటాయి. పేపర్స్ లో లేదా వెబ్ సైట్స్ లో కాస్త కంటెంట్ ఎక్కువగా కనిపించాలి కాబట్టి సదరు సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ను కాస్త విసదీకరించి ఇంకాస్త ఆసక్తికరంగా మారుస్తుంటారు మన జర్నలిస్ట్ మిత్రులు. ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. ఒక ప్రశ్నకి సింపుల్ గా సింగిల్ లైన్ లో ఆన్సర్ ఇచ్చేవారు కొందరు.. ఏదో 16 మార్కుల క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తున్నట్లుగా చెప్పేవారు ఇంకొందరు. మన మాస్ మహారాజా రవితేజ మాత్రం ఎప్పుడూ వన్ వర్డ్ ఆన్సర్స్ తో సరిపెట్టేస్తాడు. ఇవాళ “అమర్ అక్బర్ ఆంటోనీ” ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో ఎప్పట్లానే సరదాగా, చమత్కారంగా, హుందాగా ముచ్చటించారు. సో, ఆయన చెప్పిన సమాధానాలు పాలిష్డ్ గా కాకుండా ఆయన వెర్షన్ లోనే ప్రెజంట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రయత్నమే ఈ డిఫరెంట్ ఇంటర్వ్యూ..!!

ఎలా ఉన్నారు రవితేజ ?
బాగున్నానండి.

అమర్-అక్బర్-ఆంటోనీలు ముగ్గురా? ఒకరా?
ఇంకో 48 గంటల్లో తెలిసిపోతుంది.

మీకు అమర్, అక్బర్, ఆంటోనీలో మీకు ఎవరంటే ఇష్టం?
అమర్

ఎందుకు ఇష్టం?
48 గంటల్లో తెలుస్తుంది.

వెంకీ, దుబాయ్ శీను సినిమాల తరహాలోనే అమర్ అక్బర్ ఆంటోనీ కూడా ఉంటుందా ?
48 గంటల్లో తెలుస్తుంది.

ఈ సినిమాలో కూడా మందు సీను ఏమైనా ఉంటుందా?
48 గంటల్లో..

ఈ సినిమా కథ స్ప్లిట్ పర్సనాలిటీ ఆధారంగా ఉంటుంది అంటున్నారు?
ఇంకొక్క 48 గంటలు వెయిట్ చేయండి.

ఈ క్యారెక్టర్స్ కోసం హోమ్ వర్క్ ఏమైనా చేశారా?
నేను ఎప్పుడూ హోమ్ వర్క్ చేయను, నావన్నీ క్లాస్ వర్క్సే.

మూడు రకాల పాత్రలు చేయడం ఎలా అనిపించింది?
చాలా కొత్తగా అనిపించింది. మరీ ఎక్కువ కష్టపడలేదు కానీ.. మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నప్పుడు ఆ ట్రాన్సిషన్ నాకు బాగా నచ్చింది. శ్రీనువైట్ల ఆ క్యారెక్టర్స్ ను డిజైన్ చేసిన తీరు, ప్రతి పాత్రలోను తీసుకొచ్చిన వేరియేషన్ నాకు చాలా బాగా నచ్చింది.

సినిమాలో స్పూఫ్ లు ఏమైనా ఉన్నాయా?
ఈ సినిమాలో స్పూఫ్ లు ఏమీ లేవు కానీ.. హిలేరియస్ కామెడీ ఉంటుంది. వెన్నెల కిషోర్, సత్య, సునీల్ ల కామెడీకి విరగబడి నవ్వుతారు. ముఖ్యంగా.. సత్య క్యారెక్టర్ సినిమాకి హైలైట్ అవుతుంది.

శ్రీనువైట్ల తెచ్చిన కథలో మీరేమైనా మార్పులు చేశారా?
చిన్న చిన్న మార్పులుచేర్పులు జరుగుతూనే ఉంటాయి. నాకున్న డౌట్స్ ని నేను రెక్టిఫై చేసుకొంటాను. అయినా.. ఒక ఫ్లాప్ వచ్చిందని ఒక మనిషిని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే.. ఒక ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వొచ్చు. ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్ నెక్స్ట్ డిజాస్టర్ ఇవ్వొచ్చు. అయినా ఏ సినిమానైనా బాగా రావాలనే చేస్తాం.

మీరొక అద్భుతమైన యాక్టర్, మీ టాలెంట్ ని డైరెక్టర్స్ సరిగ్గా వాడుకున్నారు అనిపిస్తుందా?
నేను నా దగ్గరకి వచ్చిన పాత్ర ఎలాంటిదైనా నచ్చితే చేస్తాను. నెగిటివ్ రోల్స్, మల్టీస్టారర్స్ లాంటి తేడా ఏమీ లేదు నాకు. నాకు క్యారెక్టర్ నచ్చాలి. సో, ఒక దర్శకుడు నా దగ్గరకి మంచి కథ పట్టుకొని వస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాను. ఇక.. దర్శకులు నటుడిగా నన్ను పూర్తిస్థాయిలో వినియోగించుకొన్నారా లేదా అనేది మీరే (జర్నలిస్ట్స్) చెప్పాలి. ఎందుకంటే.. నాలో ఉన్న మైనస్ లు నాకు చాలా బాగా తెలుసు. కానీ.. నాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటీ అనేది మీరే చెప్పాలి.

సోంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని.. సినిమాలు తీద్దామనుకున్నారా ?
అస్సలు అలాంటి ఆలోచన లేదు. అయినా నాకు నటించడం ఒక్కటే వచ్చు, అదే చేస్తాను. నాకు రాని పని ఎందుకు చేస్తాను చెప్పండి. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే నేనే చెప్తాను. అయినా.. మీకు (మీడియాకి) చెప్పకుండా నేను ఏదైనా మొదలెడతానా చెప్పండి.

డిఫరెంట్ రోల్స్ చేయాలి అని ఎప్పుడు అనిపించలేదా ?
డిఫరెంట్ గా ఉన్నాయనే.. “శంభో శివ శంభో, నా ఆటోగ్రాఫ్, నేనింతే, ఈ అబ్బాయి చాలా మంచోడు” లాంటి సినిమాలు చేశాను. రిజల్ట్ ఏమయ్యిందో మీకు కూడా తెలుసు. అలాగని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయను అని చెప్పడం లేదు. చేస్తాను కానీ.. ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తాను. అయినా.. నేను నీళ్ళ లాంటి వాడిని. ఎలాంటి పాత్రనైనా చేయగలను. నన్ను సరిగా వినియోగించుకోగల దర్శకుడు రావాలి అంతే.

మీ కెరీర్ లో అసంతృప్తి ఏమైనా ఉందా?
అస్సలు లేదు.

ఇలా ఆలోచించడం ఎప్పట్నుంచి మొదలెట్టారు?
ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది కాబట్టి అడిగారు కానీ.. నేను ముందు నుంచీ అలాగే ఉన్నాను. అలాగే ఉంటాను.

ఇంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎలా ఉంటారు?
నేను ఎప్పుడూ అంతే.. అందరూ అలాగే ఉండాలి కూడా. అనవసరంగా ఈ స్ట్రెస్, డిప్రెషన్ లాంటివి తీసుకోకూడదు. ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి.

మీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా స్ట్రెస్ తీసుకోరా?
తీసుకొను అని చెప్పను. మరీ డిప్రెషన్ లోకి వెళ్లిపోయే రేంజ్ లో మాత్రం అస్సలు ఆలోచించను. నా ఆలోచన ఎప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? అనే.

పూరీ జగన్నాధ్ గారితో మళ్ళీ సినిమా ఎప్పుడు?
ఉంటుందిగా.. ఒక కథ మీద వర్క్ చేశాం కానీ, అది వర్క్ అవ్వలేదు.

మీ సినిమాతో స్టార్ట్ అయిన తమన్ 100 సినిమా చేశాడు, మీకెలా అనిపించింది?
అసలు తమన్ 100 సినిమాలు ఎప్పుడు చేశాడో అర్ధం కాలేదు. నేను ఆశ్చర్యపోయాను ఎప్పుడు చేశావ్ రా బాబు అన్ని సినిమాలు అని అడిగాను కూడా. అలా కొట్టుకుంటూ పోయాడు. మధ్యలో కాస్త మూసలో పడిపోయాడు కానీ.. ఇప్పుడు అద్భుతంగా వర్క్ చేస్తున్నాడు. మా సినిమాకి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాడు.

మీరు నెట్ ఫ్లిక్స్ చూస్తారా?
నేను నెట్ ఫ్లిక్స్ ఎడిక్ట్ ని.

మీరు వెబ్ సిరీస్ లు చేసే అవకాశం ఏమైనా ఉందా?
మనం ఎక్కడో మొదలెట్టి.. ఇంకెక్కడికో వెళ్తున్నామ్. అలాంటివి చేసినప్పుడు మాట్లాడుకుందాం.

వి.ఐ.ఆనంద్ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ సినిమా అంటున్నారు?
ఆ సినిమా చేసినప్పుడు మాట్లాడుకుందాం.

తెరి రీమేక్ చేస్తున్నారా?
చేయడం లేదు, సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కంప్లీట్ గా కొత్తది.

అమర్ అక్బర్ ఆంటోనీలో స్పెషాలిటీ ఎంటి?
మీరు డైరెక్టర్ శ్రీనువైట్లను అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ నన్ను అడుగుతున్నారు.

ఈ సినిమా ఇక్కడ హిట్ అయితే.. హిందీలో చేస్తానని శ్రీనువైట్ల అన్నారు? మీరు హిందీలో కూడా నటిస్తారా?
నాకు ఆల్రెడీ బాలీవుడ్ నుంచి చాలా ప్రొజెక్ట్స్ వచ్చాయి కానీ.. చాలా కారణాల వల్ల వర్కవుట్ అవ్వలేదు. ఆ కారణాలు మాత్రం చెప్పను. శ్రీనువైట్ల నిన్న చెప్పినట్లు.. ఈ సినిమా గనుక హిందీలో చేస్తే తప్పకుండా నటిస్తాను.

ఒక హిస్టారికల్ డ్రామాలో, ఒక కింగ్ క్యారెక్టర్ చేస్తారా?
సూట్ అవుతుందా నాకు? అయినా.. ఒకవేళ నచ్చితే తప్పకుండా చేస్తాను. ఇది చేయను అని ఏదీ లేదు. నాకు నచ్చితే ఎలాంటి పాత్రైనా చేస్తాను.

ఇంగ్లీష్ లో వచ్చిన టేకెన్ లాంటి సినిమా తెలుగులో చేద్దామనుకున్నారు కదా ఏమైంది?
నాకు ఇంగ్లీష్ లో చాలా బాగా నచ్చిన సినిమా మాత్రమే కాదు.. నేను ఎక్కువసార్లు చూసిన సినిమా కూడా అదే. అలాంటి స్క్రిప్ట్ పట్టుకొని ఎవరైనా వస్తే తప్పకుండా చేస్తాను. కానీ.. ఇప్పటివరకు ఎవరూ రాలేదు.

రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఏంటీ?
నాకు మీరు (మీడియా) చాలండి. ఈ పాలిటిక్స్, పొలిటీషియన్స్ గురించి పట్టించుకొనెంత టైమ్ లేదు. అవసరం లేదు కూడా.

“మీ టూ” ప్రభావం టాలీవుడ్ మీద ఎలా ఉంది ?
అందరూ ఇప్పుడు కుదురుగా ఉంటున్నారు. అయినా కొంచెం కుదురు వచ్చినట్లుంది కదా.. రావాలి, రావాలి.

మీ సినిమా గురించి పర్ఫెక్ట్ రిజల్ట్ ఎవరు చెప్తారు?
నా గురించి అందరికీ తెలుసు కాబట్టి.. నా సినిమా బాగుందా, బాలేదా అని నిక్కచ్చిగా అందరూ చెప్పేస్తారు. అంతెందుకు నా కొడుకే ముఖం మీద సినిమాలో ఏం నచ్చింది? నచ్చలేదు? అని చెప్పేస్తాడు.

సవ్యసాచి కథ కూడా మీ దగ్గరకి వచ్చిందన్నారు?
చందు మొండేటి కథ నా దగ్గరకి రాలేదు.. ఇదే తరహా కథాంశంతో ఒక కథ నా దగ్గరకి వచ్చింది. అది సరిగా వర్కవుట్ అవ్వలేదు.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus