ఓ సినిమాకు గుమ్మడికాయ కొట్టేముందే మరో సినిమా కొబ్బరియాక కొట్టేస్తుంటాడు మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) . ఆయన నటనలోని స్పీడే.. ఆయన సినిమాల ఎంపికలోనూ కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రశ్న ఇప్పుడు ఆయన ఫ్యాన్స్‌లో వినిపిస్తోంది. అదే నెక్స్ట్ ఏంటి మాస్ హారాజ్ అని. ఎందుకంటే ఆయన నటిస్తున్న ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమా షూటింగ్ చివరి దశకొచ్చేసింది. ఈ క్రమంలో ఓ యువ దర్శకుడి పేరు వినిపిస్తోంది. ‘మ్యాడ్’ (MAD) సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు కల్యాణ్ శంకర్..
ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఆఖరి దశకు వచ్చేసింది. ఈ సినిమాను మార్చి ఆఖరున రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత ఆయన రవితేజతో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం రవితేజకు ఆయన ఓ లైన్ చెప్పారని.. ఓకే అనడంతో పూర్తి స్థాయి కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే అవకాశముంది అని చెబుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన ఉంది అని చెబుతున్నారు.
మార్చి 29న ‘మ్యాడ్ 2’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఆ ఇంటర్వ్యూల కోసం కల్యాణ్ శంకర్.. ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ కోసం రవితేజ మీడియా ముందుకు వస్తారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మూడేళ్ల క్రితం ‘ధమాకా’ (Dhamaka) సినిమాతో విజయం అందుకున్న రవితేజ సోలో హీరోగా చేసిన నాలుగు సినిమాలు దారుణమైన ఫలితాలు చవి చూశాయి. ఈ నేపథ్యంలో ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమా ఫలితం కీలకంగా మారింది.
ఒకవేళ విజయం సాధిస్తే కల్యాణ్ శంకర్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొంటాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి కథతో కల్యాణ్ శంకర్ సినిమా చేస్తారో చూడాలి. ఆయన ట్రాక్ రికార్డు చూస్తే కామెడీ నేపథ్యంలో మంచి కథలను సిద్ధం చేస్తుంటారు. చూద్దాం మరి రవితేజతో ఏ సినిమా చేస్తారో?