ఆర్ డి ఎక్స్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 11, 2019 / 02:53 PM IST

“ఆర్ ఎక్స్ 100” చిత్రంతో భీభత్సమైన పాపులారిటీ, స్టార్ డమ్ సంపాదించుకొన్న పాయల్ రాజ్ పుట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “ఆర్ డి ఎక్స్ లవ్”. “అర్ధనారీ” ఫేమ్ భాను శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కంటే టీజర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లతో రచ్చ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకొందో చూద్దాం..!!

కథ: అలివేలు (పాయల్ రాజ్ పుట్) ఓ పల్లెటూరికి చెందిన ఆధునిక యువతి. ఎలా అయినా సరే తమ ఊరికి బ్రిడ్జ్ వేయించాలని తన తండ్రి ఎన్నాళ్ళ నుండో ప్రయత్నిస్తున్న తన తండ్రికి సహాయం అందించాలనుకొంటుంది. అయితే.. అమ్మాయిగా తన అందాలను అస్త్రాలుగా సంధించి ఈ కార్యాన్ని నెరవేర్చాలనుకొంటుంది. అందుకోసం అలివేలు చేసిన చిత్రవిచిత్రమైన పనుల యొక్క సమాహారమే “ఆర్ డి ఎక్స్ లవ్” కథాంశం.

నటీనటుల పనితీరు: నరేష్, తేజస్, ఆదిత్య మీనన్, ఆమని, ముమైత్ ఖాన్ లు తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. వాళ్ళ గురించి అంతకుమించి చెప్పడానికి కూడా ఏమీ లేదు. రెండున్నర గంటల సినిమాలో ఒక గంటన్నర సేపు కెమెరా పాయల్ మీదే ఉంటుంది. సినిమాలో ఆమె ఏం చేస్తుందో? ఎందుకు చేస్తుందో? వంటి ప్రశ్నలకు సమాధానం దర్శకుడికే తెలియాలి. తనను దర్శకుడు ఎందుకు తీసుకున్నారో.. అందుకు మాత్రం ఆమె పూర్తిగా న్యాయం చేసింది.

సాంకేతికవర్గం పనితీరు: రధన్ సంగీతం, సి.రాంప్రసాద్ లాంటి సీనియర్ కెమెరామెన్ పనితనం, సి.కళ్యాణ్ ప్రొడక్షన్ వేల్యూస్, గోదావరి ప్రాంతాల్లో చిత్రీకరణ బాగున్నప్పటికీ.. దర్శకుడు రాసుకున్న కథ, కథనం మరియు సన్నివేశాలు మాత్రం మరీ ఇబ్బందికరంగా ఉన్నాయి. గ్రామంలో మగాళ్ళందరూ.. మందు తాగి పాడుకుండిపోతున్నారని, తమతో కాపురం చేయడం లేదని ఆడాళ్ళు ఇచ్చిన కంప్లయింట్ కు.. పాయల్ సొల్యూషన్ గా వాత్సాయన కామసూత్రాలు వల్లించడం, ఆడాళ్ళ చేత కాపురం చేయించి మంచాలు విరిగేలా చేయడం అనే సీక్వెన్స్ ఒక్కటి చాలు దర్శకుడి మైండ్ సెట్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవడానికి.

ఇక కండోమ్స్ అమ్మడం, మల్లెపూల ఉపయోగాలు చెప్పడం వాయబ్బో ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి. ఇక హీరోని సెడ్యూస్ చేయడం కోసం హీరోయిన్ & గ్యాంగ్ చేసే పనులు పైత్యానికి పరాకాష్టలా ఉంటాయి. ఇక హీరోతో హీరోయిన్ చేసే రొమాన్స్ అయితే.. 90ల కాలం షకీలా, సిల్క్ స్మిత చేసిన బిగ్రేడ్ సినిమాలను గుర్తు చేస్తోంది. ఏ రకంగా చూసుకున్నా.. “ఆర్ డి ఎక్స్ లవ్” అనే సినిమా ఒక బీగ్రేడ్ సినిమాలాగే కనిపిస్తుంది తప్పితే.. ఒక సెన్స్ & లాజిక్ ఉన్న సినిమాలా మాత్రం కనిపించదు. మరి దర్శకుడు ఇలాంటి సినిమా తీసి డబ్బు సంపాదించాలనుకొన్నాడా లేక పేరు సంపాదించాలనుకొన్నాడా అనేది ఆయనకే తెలియాలి.

విశ్లేషణ: పాయల్ అందాల ఆరబోత ఉంటే చాలు అనుకోని థియేటర్లకు వచ్చే వాళ్ళను మాత్రమే కాస్తంత సంతృప్తిపరచగల సినిమా “ఆర్ డి ఎక్స్ లవ్”. కథ, కథనం, సెన్సబిలిటీస్ లాంటి వాటి కోసం వెతికితే మాత్రం బోర్ తోపాటు చిరాకు కూడా రావడం ఖాయం. ఇలాంటి బీగ్రేడ్ సినిమాలతో పాయల్ తన భవిష్యత్ ను ఎలా ప్లాన్ చేసుకొంటుంది అనేది ఆమెకే తెలియాలి.

రేటింగ్: 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus