కోలీవుడ్ ఇండస్ట్రీలో వందల సంఖ్యలో సినిమాల్లో కమెడియన్ రోల్స్ లో నటించి వివేక్ మెప్పించారు. కొన్ని రోజుల క్రితం వరకు షూటింగ్ లో పాల్గొన్న వివేక్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు. వివేక్ చనిపోవడానికి ఒకరోజు ముందు కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవడంతో ఆయన మృతికి సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నటులు కరోనా వ్యాక్సిన్ వల్లే వివేక్ చనిపోయాడని చెబుతున్నారు.
వివేక్ అభిమానులు సైతం ఆరోగ్యంగా ఉన్న వివేక్ కు గుండె పోటు రావడానికి వ్యాక్సిన్ కారణమా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళనాడు హెల్త్ సెక్రటరీ రాధాకృష్ణన్ సోషల్ మీడియాలో వివేక్ మృతికి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై స్పందించి వివరణ ఇచ్చారు. వివేక్ గుండె వాల్వ్‌లు నూరు శాతం మూసుకుపోవడం వల్లే ఆయన చనిపోయారని రాధాకృష్ణన్ తెలిపారు.
వ్యాక్సిన్ కు గుండె వాల్వ్‌లు మూసుకుపోవడానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. వివేక్ గుండె విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆయన ప్రాణాలు పోయాయని కరోనా వ్యాక్సిన్ పట్ల జనాల్లో భయం పెంచేలా కొందరు నటులు మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. వివేక్ వ్యాక్సిన్ వేయించుకున్న రోజే మరి కొందరు నటులు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారని హెల్త్ సెక్రటరీ వెల్లడించారు.
కరోనా వ్యాక్సిన్ వల్ల గుండెపోటు రావడం ఎప్పుడూ జరగలేదని వైద్యులు చెబుతున్నారు. హెల్త్ సెక్రటరీ వివరణ ఇచ్చినా కొందరు నెటిజన్లు మాత్రం వివేక్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.