శివబాలాజీ, సమ్మెట గాంధీ, ఎస్తర్ ప్రధాన పాత్రల్లో “జీ5” రూపొందించిన వెబ్ సిరీస్ “రెక్కీ”. కుటుంబ హత్యల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ జూన్ 17 నుండి జీ5 యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: ఓ సాధారణ మర్డర్ కేస్ డీల్ చేస్తున్న లెనిన్ (శ్రీరామ్), ఆ కేస్ విషయమై చేసిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక ఊర్లో జరిగిన తండ్రీకొడుకుల హత్యలను డీల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఊరి పెద్ద వరదరాజులు (ఆడుకాలం నరేష్), అతని కొడుకు చలపతి (శివబాలాజీ) కొద్ది రోజుల గ్యాప్ లో దారుణంగా చంపబడతారు.
ఈ హత్యల వెనుక ఓ “రెక్కీ” గ్యాంగ్ ఉందని తెలుసుకొని షాక్ అవుతారు పోలీసులు. అసలు ఎవరీ రెక్కీ గ్యాంగ్? వరదరాజులు & చలపతిని ఎందుకు చంపారు? వాళ్ళను చంపమని కిరాయి ఇచ్చింది ఎవరు? అనేది “రెక్కీ” కథాంశం.
నటీనటుల పనితీరు: 7 ఎపిసోడ్ల ఈ సిరీస్ లో తన నటనతో ప్రేక్షకుల్ని అమితంగా అలరించిన నటుడు సమ్మెట గాంధీ. “ఆటోనగర్ సూర్య” తర్వాత అతడిలోని నటుడ్ని పూర్తిగా వినియోగించుకున్నది ఈ సిరీస్ మాత్రమే. అతడి కళ్ళు, బాడీ లాంగ్వేజ్ చూస్తే.. నిజంగానే మర్డర్లు చేసేస్తాడేమో అనిపిస్తుంది.
పోలీస్ ఆఫీసర్ లెనిన్ గా శ్రీరామ్ సబ్టల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.. చలపతిగా శివబాలాజీ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. ఎస్తర్ కి డైలాగ్స్ లేకపోయినా.. స్క్రీన్ ప్రెజన్స్ & కళ్ళతోనే మ్యానేజ్ చేసింది.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ రామ్ కె.మహేష్ & మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరిల పనితనం సిరీస్ కి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆర్టిస్టుల పాయింటాఫ్ వ్యూను మహేష్ క్యాప్ఛ్యూర్ చేసిన విధానం బాగుంది. అలాగే.. శ్రీరామ్ తన నేపధ్య సంగీతంతో థ్రిల్లర్ కు న్యాయం చేశాడు.
ఇక కథకుడు-దర్శకుడు కృష్ణ పోలూరు “హత్య చేయడం ఎలా?” కంటే “ఆ హత్యను ప్లాన్ చేయడం ఎలా?” అనే విధానాన్ని తెరపై చూపిన విధానం బాగుంది. ఒక హత్య వెనుక ఇంత రెక్కీ ఉంటుందా? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. కథకుడిగానే కాకుండా దర్శకుడిగానే మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా బోలెడన్ని శృంగార సన్నివేశాలు జొప్పించడానికి ఆస్కారమున్నప్పటికీ.. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా సిరీస్ ను తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాగుంది. సెకండ్ సీజన్ కు ఇచ్చిన లీడ్ కూడా బాగుంది.
విశ్లేషణ: మర్డర్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్ కు విశేషంగా నచ్చే సిరీస్ “రెక్కీ”. నటీనటుల చక్కని పెర్ఫార్మెన్స్, కృష్ణ పోలూరు స్క్రిప్ట్ వర్క్ హైలైట్స్ గా నిలిచిన ఈ సిరీస్ “జీ5” యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. లేట్ చేయకుండా ఓ లుక్కేయండి. కాస్త బ్లడ్ ఉన్నా.. ఫ్యామిలీ (చిన్న పిల్లలు మినహా) అందరూ కలిసి చూడచ్చండోయ్.
రేటింగ్: 3/5