దేవదాస్ విజయానికి ఎన్నో అడ్డంకులు

కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అనే విధంగా దేవదాస్ సినిమాపై నెగటివ్ టాక్ రావడానికి అనేక కారణాలున్నాయి. కింగ్ నాగార్జున, నేచురల్ నాని తో శ్రీరామ్ ఆదిత్య మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఇది హాలీవుడ్ మూవీ కి రీమేక్ అని కొంతమంది ప్రచారం మొదలెట్టారు. మొన్న రిలీజ్ అయిన టీజర్ తర్వాత అది నిజమని ఒక వర్గం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మంచి సంగీతాన్ని ఇచ్చి.. క్రేజ్ తీసుకురావడానికి ప్రయత్నించారు. పాటలు బాగానే ఉన్నాయి.. కానీ నాని చేస్తున్న బిగ్ బాస్ షో పుణ్యమా .. అని ఈ చిత్రంపై నెగటివిటీ కమ్మేసింది. హోస్ట్ గా చేసే సమయంలో కొంతమంది కంటెస్టెంట్ ని విమర్శించాల్సి వచ్చింది.

దాన్ని ఆసరాగా చేసుకొని ఆ కంటెస్టెంట్ అభిమానులు దేవదాస్ టీజర్, ట్రైలర్, పాటల వీడియోలకు డిస్ లైకులు కొట్టడం మొదలెట్టారు. అలాగే దేవదాస్ సినిమాని చూడకండని సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టారు. దీంతో ఎంత మంచి ప్రచారం చేద్దామని చిత్ర బృందం ప్రయత్నిస్తున్నా.. నెగటివ్ గానే వెళ్తోంది. పైగా నాని గత చిత్రం కృష్ణార్జున యుద్ధం ఫెయిల్… అలాగే నాగార్జున గత సినిమా ఆఫీసర్ డిజాస్టర్. ఇన్ని కారణాల మధ్య నుంచి దేవదాస్ హిట్ సాధిస్తుందా? అని సినీ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి ప్రేక్షకులను రప్పించే బాధ్యత హీరోయిన్లుగా నటిస్తున్న రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లపైనే ఉంది. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ మూవీ ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus