దేశంలో కరోనా మహమ్మారి ఉధృతితో జనాలు ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకక, సమయానికి ఆక్సిజన్ అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారు. దీంతో జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కరోనా పట్ల అవగాహన కల్పించడానికి సెలబ్రిటీలు తమవంతు సాయంగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్ కోవిడ్ బాధితులకు సాయం అందిస్తుండగా.. తాజాగా రేణుదేశాయ్ కూడా ముందుకొచ్చింది. కరోనా కష్టకాలంలో అవసరంలో ఉన్న వాళ్లు తనకు మెసేజ్ చేస్తే సాయం చేయడానికి రెడీగా ఉన్నానంటూ లైవ్ వీడియో ద్వారా వెల్లడించింది.
ప్లాస్మా, ఆక్సిజన్, మెడిసిన్ ఇలా ఎలాంటి అవసరం ఉన్న తనకు మెసేజ్ చేయాలని కోరింది. ఈ మెసేజ్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసే అవసరమైన సాయం అందేలా కృషి చేస్తానని చెప్పింది. తన ఇన్ బాక్స్ ని ఓపెన్ గా ఉంచుతున్నానని.. అవసరంలో ఉన్నవారు తనకు మెసేజ్ చేయాలని కోరింది. దయచేసి స్పామ్, ఫార్వార్డ్ మెసేజ్ లు పంపించొద్దని.. నిజంగా అవసరంలో ఉన్నవాళ్లు పూర్తి వివరాలతో తనకు మెసేజ్ చేస్తే సాయం అందిస్తానని స్పష్టం చేసింది.
అయితే ఆర్థికంగా మాత్రం సాయం చేయలేనని.. ఈ విషయంలో తనను అర్ధం చేసుకోవాలని కోరింది. గతంలో డబ్బు విషయంలో చాలాసార్లు మోసపోయానని, డొనేషన్స్ అంటూ చీట్ చేశారని చెప్పింది. కాబట్టి ప్లాస్మా, ఆక్సిజన్, బెడ్స్ లాంటి అవసరాల గురించి మాత్రమే అడగమని చెప్పింది.