జనవరిలోనే తన సినిమా వస్తుందని చెప్పిన రామ్ గోపాల్ వర్మ

ప్రముఖ దర్శకుడు కొన్ని రోజుల క్రితం నందమూరి తారక రామారావు జీవితంపై “లక్ష్మీస్ ఎన్టీఆర్” మూవీ తెరకెక్కించనున్నట్లు ప్రకటిస్తూ… ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఆ సమయంలో టీడీపీ నేతలు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఏమన్నా.. సినిమా తెరకెక్కించి తీరుతానని వర్మ తేల్చిచెప్పారు. ఎన్టీఆర్‌ జీవితంలోని ప్రజలకు పెద్దగా తెలియని చీకటికోణాలను ఈ సినిమాలో ఆవిష్కరిస్తానంటూ వెల్లడించారు. కానీ ఆ తర్వాత ఆ మూవీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఈ రెండు చిత్రాలను వచ్చే ఏడాది జనవరిలో రెండు వారాల గ్యాప్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఆ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ అంచనాలను పెంచేస్తోంది. ఈ సమయంలో వర్మ మళ్ళీ ”లక్ష్మీస్ ఎన్టీఆర్” గురించి మాట్లాడారు. జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి నిర్మాణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రూపొందించనున్నామని, ఈ విజయదశమికి సినిమా స్టార్ట్ చేసి జనవరి చివరికల్లా సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తామని ట్విట్టర్ వేదికపై వెల్లడించారు. అక్టోబర్ 19న పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అంతేకాదు ఎన్టీఆర్, లక్ష్మిపార్వతి, చంద్రబాబు నాయుడులు ఉన్న పాత ఫోటోని షేర్ చేస్తూ ”ఎన్టీఆర్ ట్రూ స్టోరీ” అనే హ్యాష్‌ట్యాగ్ జత చేయటంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ విజయాలు మాత్రమే చూపిస్తారని.. ఆ సినిమాల్లో చూపించలేని విషయాలను వర్మ తన సినిమాలో చూపించవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus