Vyuham Review in Telugu: వ్యూహం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రామదూత క్రియేషన్స్‌ (Hero)
  • మానస రాధాకృష్ణన్ (Heroine)
  • ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు (Cast)
  • రామ్‌ గోపాల్‌ వర్మ (Director)
  • దాసరి కిరణ్‌ కుమార్‌ (Producer)
  • ఆనంద్ (Music)
  • సాజీశ్ రాజేంద్రన్ (Cinematography)
  • Release Date : మార్చి 2, 2024

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల డేట్ దగ్గరపడుతోంది. జనాల్లో కూడా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరగబోతున్నాయి అనే ఆలోచన ఉంది. ఈ సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు పొలిటికల్ నేపథ్యంలో చేసిన సినిమాలను లైన్ గా రిలీజ్ చేస్తున్నారు కొంతమంది మేకర్స్. ఇప్పటికే ‘యాత్ర 2 ‘ ‘రాజధాని ఫైల్స్’ వంటి పొలిటికల్ సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ అందరి చూపు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ పైనే ఉంది. ఎందుకంటే అతను చేసిన పబ్లిసిటీ అలాంటిది. పైగా ఈ సినిమాకి సెన్సార్ కష్టాలు, కోర్టులో కేసులు వంటి హడావిడి చాలా జరిగింది. ఆ అడ్డంకులు దాటుకుని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘వ్యూహం’ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: కథ గురించి చెప్పుకునే ముందు రాంగోపాల్ వర్మ జోడించిన ఫిక్షన్ గురించి చెప్పుకోవాలి. ఇందులో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రని వీర శేఖర్ రెడ్డిగా, జగన్ పాత్రని మదన్ గా,భారతి పాత్రని మాలతిగా,రోశయ్య పాత్రని కాశయ్యగా, చంద్రబాబు పాత్రని ఇంద్రబాబు గా, పవన్ కళ్యాణ్ ని శ్రవణ్ కళ్యాణ్ గా.. మార్చాడు. అలాగే ‘జనసేన’ ని ‘మన సేన’ గా, ‘వై.ఎస్.ఆర్.సి.పి’ ని ‘వి.ఎస్.ఆర్.సి.పి’ గా మార్చాడు.

సీఎం వీర శేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన తనయుడు మదన్ (అజ్మల్ అమీర్)ను ముఖ్యమంత్రి చేయాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడతారు. కానీ భారత్ పార్టీ మేడం మదన్ ని కాదని కాశయ్యను సీఎంను చేస్తుంది. మరోపక్క మదన్ చేపట్టిన ఓదార్పు యాత్ర ని సైతం ఆపాలని ఆదేశిస్తుంది. కానీ మదన్ దాన్ని పట్టించుకోకుండా ఓదార్పు యాత్రను కొనసాగిస్తాడు. ఈ క్రమంలో అతని పై రైడ్స్, కేసులు, ఇన్వెస్టిగేషన్లు జరుగుతాయి. ఆ కేసులను ఎదుర్కొని, జైలుకు వెళ్లి.. చివరికి పార్టీని ఎలా నిలబెట్టగలిగాడు? ఇంద్రబాబు, శ్రవణ్ కళ్యాణ్..ల వల్ల మదన్ కి వచ్చిన సమస్యలేంటి? తర్వాత అతను ఎలా సీఎం అయ్యాడు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: అజ్మల్ ఇదివరకు వచ్చిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ లో కూడా జగన్ పాత్ర చేశాడు. అతనికి ఇది అలవాటైపోయిన పాత్ర. జనాలకి కూడా కొత్తగా ఏమీ అనిపించదు. ఉన్నంతలో అతను బాగానే చేశాడు. ఇంద్రబాబు పాత్ర చేసిన ధనంజయ్ ప్రభునే కూడా అంతే..! మాలతి గా చేసిన మానస రాధాకృష్ణన్, జయమ్మ పాత్ర చేసిన సురభి ప్రభావతి, షర్మిల పాత్ర చేసిన రేఖా నిరోషా.. వంటి వారు పర్వాలేదు అనిపిస్తారు. కొంచెం కొత్తగా అనిపిస్తాయి. శ్రవణ్ కళ్యాణ్ గా చేసిన చింటూ బాగానే చేసినా, ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేసినట్టు అనిపించడం వల్ల అది ఒరిజినల్ పెర్ఫార్మన్స్ లా అనిపించదు. మిగిలిన నటీనటులు బాగానే చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: రాంగోపాల్ వర్మ .. జగన్ కోసం, అతని వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ కోసం తీసిన సినిమా ఇది. కథ అందరికీ తెలిసిందే. ‘యాత్ర 2’ కథ కూడా ఇదే. కాకపోతే ఆ సినిమా విషయంలో దర్శకుడు మహి వి రాఘవ్ కాంట్రోవర్సీలకి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. కేవలం జగన్ కి అతని పార్టీకి సపోర్ట్ చేసినట్టుగానే ఆ సినిమాని తీర్చిదిద్దాడు. జనసేన , షర్మిల వంటి సెన్సిటివ్ టాపిక్స్ జోలికి కూడా అతను పోలేదు. కానీ రాంగోపాల్ వర్మ అలా కాదు చంద్రబాబు, పవన్ కళ్యాణ్..ల పై సెటైర్లు వేయడానికే ఈ ‘వ్యూహం’ ని తీర్చిదిద్దాడు.

ఛాన్స్ దొరికిన ప్రతి సారి చంద్రబాబు పై సెటైర్లు వేస్తూనే, మరోపక్క పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఆడిస్తున్న కీలు బొమ్మ అన్నట్టు చూపించాడు. ఏమాత్రం ఒరిజినాలిటీ లేని ఈ కథనం కేవలం వైసీపీ అభిమానుల కోసమే అన్నట్లు ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం రిచ్ గా లేవు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వంటివి పేలవంగా ఉన్నాయి. రన్ టైం 2 గంటల 2 నిమిషాలు మాత్రమే ఉండటం ప్రేక్షకుల అదృష్టం అని చెప్పాలి.

విశ్లేషణ: ‘వ్యూహం’ (Vyuham) వైసీపీ పార్టీకి పాజిటివ్ గా తీసినా, ఆ పార్టీ అభిమానులు కూడా ఓపిగ్గా చూడలేని సినిమా. ‘యాత్ర 2’ లో కనీసం కొన్ని మంచి సీన్లు, డైలాగులు ఉన్నాయి. ఇందులో ఒక్కటి కూడా లేవు. పోనీ రాంగోపాల్ వర్మ మార్క్ టేకింగ్ ఏమైనా అలరించేలా ఉందా అంటే అది కూడా లేదు.

రేటింగ్ : 0.5/5

Rating

0.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus