బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. బాలీవుడ్ లో ఈ షో మరింత ఫేమస్ అయింది. ఈ షోలో పాల్గొనాలని చాలా మంది తారలు ఎదురుచూస్తుంటారు. కానీ ఎవరిని తీసుకొస్తే షోకి ప్లస్ అవుతుందో వాళ్లనే ఎన్నుకుంటుంది టీమ్. ముఖ్యంగా వివాదాల్లో ఉండే వారి పేర్లు ముందు కన్సిడర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో రియా చక్రవర్తిని షోలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
సుశాంత్ సూసైడ్, డ్రగ్స్ విషయంలో రియా పేరు బాగా వినిపించింది. సుశాంత్ చావుకి చాలా మంది రియాను బ్లేమ్ చేశారు. ఆమె షోకి వస్తే క్రేజ్ వస్తుందని భావించారు. ఈ మేరకు ఆమెకు రోజుకి రూ.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని.. అంటే వారానికి రూ.35 లక్షలు తీసుకోబోతుందని అన్నారు. తాజాగా ఈ విషయాలపై రియా స్పందించింది.
తను బిగ్ బాస్ టీవీ షోలో పాల్గొంటున్నట్లు పుకార్లు వస్తున్నాయని.. ఆ విషయం తనవరకు వచ్చిందని.. ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని.. క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఇది పోస్ట్ చేస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది. బిగ్ బాస్ లో తను పార్టిసిపేట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా తనపై వస్తోన్న ప్రచారాలన్నింటికీ ఫుల్ స్టాప్ పడినట్లయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెబ్ షోలు, సినిమాలు చేస్తూ బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టాలని చూస్తోంది!