జయలలిత మరణంతో గుండెపగిలేలా రోదిస్తున్న అభిమానులు!

ప్రముఖ నటి, అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) కన్నుమూశారు. తమిళ పేద ప్రజలు అమ్మగా పిలుచుకునే గొప్ప ప్రజా నేత చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. జ్వరం, డీహైడ్రేషన్‌తో సెప్టెంబరు 22న గ్రీమ్స్‌రోడ్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆమెకు ఆదివారం (డిసెంబర్ 04 ) రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో వైద్యులు మెరుగైన చికిత్సను అందించారు. డాక్టర్లు ఎంత శ్రమించినా జయలలితను దక్కించుకోలేక పోయారు.

రాజకీయాలలోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో జయలలిత నటించారు. 1961 నుంచి1980 వరకు ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు.

విధి వక్రించి..
మైసూర్ రాష్ట్రానికి చెందిన జయకుమార్, వేద వల్లి అనే దంపతులకు 1948 ఫిబ్రవరి 24 న జయలలిత జన్మించారు. జయలలిత రెండేళ్లప్పుడే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ ఆమె తల్లిపై పడింది. వేదవల్లి సినిమాల్లో చిన్న పాత్రలు వేస్తూ కూతురిని మెట్రిక్ లేషన్ వరకు చదివించింది. అమ్మ కష్టాలను చూసి భరించలేక కుటుంబ భారాన్ని మోయడానికి 15 ఏళ్లకే జయలలిత చిత్ర సీమలో అడుగు పెట్టారు. 1964 లో కన్నడ సినిమా “చిన్నది గొంబే ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాతి సంవత్సరం తెలుగులో “మనసు మమత” చిత్రం చేశారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు కి జోడిగా నటించి పేరు తెచ్చుకున్నారు. అలా 16 ఏళ్లకే స్టార్ అయ్యారు. అప్పటి తరం తెలుగు హీరోలు ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు లతో కలిసి గూఢచారి 116 , చిక్కడు దొరకడు (1967), కొండవీటి సింహం (1969), ఆలీబాబా 40 దొంగలు (1970), దేవుడు చేసిన మనుషులు (1973) వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్నారు.

ప్రజలకు సేవ చేయాలనీ..
60, 70 దశకంలో తెలుగు, తెలుకు, కన్నడ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా జయలలిత క్రేజ్ సంపాదించారు. అప్పుడే ప్రముఖ తమిళ హీరో ఎం. జె .ఆర్(ఎం జి రామచంద్రన్ )కు బాగా సన్నిహితులయ్యారు. ఆయనతో కలిసి 28 సినిమాల్లో నటించారు. ఎం. జె .ఆర్ 1977 లో ముఖ్యమంత్రిగా అయినప్పుడు జయలలిత రాజకీయంలోకి అడుగుపెట్టారు. ప్రజలకు సేవ చేయాలనీ 1982 లో ఏఐఏ డీఎంకె పార్టీలో చేరిన ఆమె 1984 లో రాజ్య సభకు ఎంపికయ్యారు. 1984 లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం జి ఆర్ ఆరోగ్యం క్షీణిస్తే ఆ బాధ్యతలను జయలలిత స్వీకరించారు. అతను మరణించడంతో ముఖ్యమంత్రి గా ఎన్నికయ్యారు. కొన్ని కారణాల వల్ల దిగిపోయారు. 1991లో రాజీవ్‌ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉన్నారు. 1996, 2006 జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందారు. 2001, 2011 జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయం సాధించారు. గత ఏడాది (2015 ) ఎన్నికల్లోనూ గెలిచి సత్తా చాటారు.

కన్నీటి సముద్రంలో …
అమ్మ మరణించిన వార్త తెలుసుకొని అన్నాడీఎంకే కార్యకర్తలు గుండె పగిలేలా ఏడ్చారు. సోమవారం ఉదయమే భారీ సంఖ్యలో అపోలో ఆస్పత్రికి చేరుకున్న అభిమానులు కన్నీటి సముద్రంలో మునిగిపోయారు. దీంతో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఆస్పత్రి పరిసరాల్లో భారీగా భద్రతా దళాలను మోహరించారు. చెన్నై మొత్తం ఆర్మీ, పోలీసు బలగాలతో నిండిపోయింది. జయలలిత నివాసం పొయెస్‌ గార్డన్‌ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నైలోని అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus