‘కె.జి.ఎఫ్’ తర్వాత కన్నడ చిత్రసీమ నుండి వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘కాంతార’. ఇప్పుడు దానికి ప్రిక్వెల్‌గా వస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే సినిమా బడ్జెట్, కథతో పాటు హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి పారితోషికంపై చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి.
‘కాంతార చాప్టర్ 1 ‘ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిలింస్’ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మొదటి భాగంతో పోలిస్తే బడ్జెట్‌ను దాదాపు 4 రెట్లు పెంచేశారు. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాకు ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. అవును ఇది నిజమే. అయితే సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారట.
అంతేకాదు, నిర్మాణంలో తను కూడా భాగస్వామి అయినట్లు తెలుస్తోంది.పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా పుచ్చుకోవడం బాలీవుడ్‌లో అగ్ర హీరోలైన షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి వారికి అలవాటు. ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా అదే దారిని ఎంచుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయి.
దీంతో నిర్మాతలకు లాభాలు ఖాయమని తేలిపోయింది. ఈ వ్యూహాత్మక నిర్ణయంతో రిషబ్ శెట్టి ఖాతాలో భారీ మొత్తం చేరడం ఖాయంగా కనిపిస్తోంది.ఇటీవల రిలీజైన ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. మొదటి భాగంలోని పంజుర్లి దైవం కథకు మూలం ఏంటి? శివ తండ్రి కథేంటి? వంటి ప్రశ్నలకు ఈ ప్రిక్వెల్ సమాధానం ఇవ్వనుంది. ఈ చిత్రంలో రిషభ్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో అక్టోబర్ 2న ఈ సినిమా 7 వేలకు పైగా స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇక తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 28 న హైదరాబాద్లోని జె.ఆర్.సి లో నిర్వహించబోతున్నారు. దీనికి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నాడు.