తెలుగులో డబ్బింగ్ చెప్పని వారు మనకెందుకు?… కొంతమంది దర్శకనిర్మాతల విమర్శ… ఈ విమర్శను తమపై వేసుకోవడానికి ఏ పరభాషా నటి సిద్ధంగా లేరు. తెలుగు సినిమా పూర్తికాగానే డబ్బింగ్ కి సై అంటున్నారు. అ..ఆ సినిమాతో అనుపమ పరమేశ్వరన్, ఫిదా సినిమాలో సాయి పల్లవి తమ క్యారెక్టర్స్ కి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. అలాగే అజ్ఞాతవాసి మూవీలో నటించిన కీర్తి సురేష్, అను ఇమ్యానుయేల్ లు సొంత వాయిస్ తో ఆకట్టుకున్నారు. కన్నడ కిరిక్ పార్టీ సినిమాతో పాపులర్ అయిన రష్మిక తెలుగులో “చలో” మూవీ చేసింది. ఇందులో తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. సమంత కూడా తెలుగింటి కోడలు కాగానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది. మహానటి స్వయంగా డబ్బింగ్ చెప్పింది.
మొన్నటిమొన్న సమ్మోహనం హీరోయిన్ అదితీ హైదరీ కూడా డబ్బింగ్ అవకాశాన్ని వేరొకరికి ఇవ్వలేదు. సొంత గొంతుతోనే పాత్రకు మరింత అందాన్ని అద్దారు. తాజాగా మరో హీరోయిన్ తెలుగు డబ్బింగ్ కి సిద్ధమైంది. ఆమె రితిక సింగ్. నార్త్ నుంచి సౌత్ కి వచ్చిన ఈ క్రీడాకారిణి / నటీమణి గురు సినిమాలో తెలుగువారిని ఆకట్టుకుంది. ప్రస్తుతం హరినాథ్ దర్శకత్వంలోతెరకెక్కుతోన్న నీవెవరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆది హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే తాప్సి కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ డబ్బింగ్ పనులను మొదలు పెట్టింది. అందులో భాగంగానే రితిక సింగ్ తన రోల్ కి డబ్బింగ్ చెప్పుకుంటోంది. తెలుగులో మాట్లాడి రితికా సింగ్ తెలుగు వారికీ మరింత దగ్గర కాబోతోంది.