రాబర్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 12, 2021 / 10:34 AM IST

కన్నడలో ఛాలెంజింగ్ స్టార్ గా విశేషమైన స్టార్ డమ్ మరియు ఫ్యాన్ బేస్ కలిగిన నటుడు దర్శన్. ఆయన కన్నడలో నటించిన “రాబర్ట్” చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగులో అనువాద రూపంలో విడుదల చేశారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మన తెలుగు ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: రాఘవ (దర్శన్) ఢిల్లీలోని ఓ వంట మాష్టర్. త కొడుకుతో కలిసి సాధారణ జీవితాన్నీ సాగిస్తుంటాడు. అనుకోని విధంగా ఓ లోకల్ గ్యాంగ్ వార్ లో చిక్కుకుంటాడు. అప్పుడు తెలుస్తుంది రాఘవ అసలు పేరు రాబర్ట్ అని, వైజాగ్ లో అతనో పెద్ద డాన్ అని. అసలు రాబర్ట్ తన పేరును ఎందుకని రాఘవగా మార్చుకుని సీక్రెట్ లైఫ్ గడుపుతున్నాడు అనేది “రాబర్ట్” కధాంశం.

నటీనటుల పనితీరు: దర్శన్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఫైట్స్ & మ్యానరిజమ్స్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తాయి. అయితే.. తెలుగు ఆడియన్స్ మిగతా కన్నడ హీరోలను ఆదరించినట్లుగా దర్శన్ ను ఆదరించడం అనేది కాస్త కష్టమే. బాలీవుడ్ బ్యూటీ ఆషా భట్ ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్ చేయడానికి ప్రయత్నించింది కానీ.. పెద్దగా స్కోప్ లేకుండాపోయింది. ఇక లెక్కకుమిక్కిలి విలన్లు ఉన్న ఈ సినిమాలో జగపతిబాబు తన మార్క్ చూపించాడు. రవికిషన్, రవిశంకర్ లు హీరో ఎలివేషన్స్ కి మాత్రమే ఉపయోగపడ్డారు. ఇక మిగతా కన్నడ క్యాస్టింగ్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు.

సాంకేతికవర్గం పనితీరు: కన్నడలో ఊరమాస్ హీరో అయిన దర్శన్ తన తోటి హీరోలైన యష్, సుదీప్, ఉపేంద్ర తరహాలో తెలుగులోనూ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనుకోవడం కరెక్టే. మార్కెట్ ను, మార్కెట్ పరిధిని పెంచుకోవడం అనేది ఏ హీరోకైనా ప్లస్సే. అయితే.. మల్టీలింగువల్ రిలీజ్, అది కూడా ఏకకాలంలో అనుకున్నప్పుడు కంటెంట్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బింగ్ పరంగా చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. కానీ.. జగపతిబాబు ఒరిజినల్ డబ్బింగ్ మినహా, ఎవ్వరి క్యారెక్టర్ కి సరైన డబ్బింగ్ లేకపోవడం గమనార్హం. పాటల విషయంలోనూ కనీస స్థాయి జాగ్రత్తలు తీసుకోలేదు. మాస్ ఆడియన్స్ ను అలరించే యాక్షన్ బ్లాక్స్ కూడా పలు తెలుగు సినిమాల్లొనివి కావడంతో వాటిని కూడా ఎంజాయ్ చేయలేరు. ఇలా ఏ రకంగా చూసుకున్నా తెలుగులో విడుదల చేయడానికి సరైన రీజన్ ఒక్కటి కూడా లేని చిత్రం “రాబర్ట్”.

ఇక దర్శకుడు తరుణ్ సుధీర్ పలు తెలుగు, తమిళ చిత్రాల నుండి కథను స్పూర్తి పొంది, ఒక్కో పార్ట్/సీన్ ను ఒక్కో సినిమా నుంచి లేపేసాడు. నరసింహనాయుడు మొదలుకొని వేదాలమ్ దాకా చాలా సినిమాలు గుర్తొస్తుంటాయి. కథ ప్రకారమే కాదు సీన్ కంపోజిషన్ పరంగానూ కాపీలా ఉంటుంది సినిమా. ప్రొడక్షన్ డిజైన్ మరియు ఆర్ట్ వర్క్ మాత్రమే పతాక స్థాయిలో ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని స్పష్టమవుతుంది.

విశ్లేషణ: కన్నడ ప్రేక్షకులు “రాబర్ట్” చిత్రాన్ని ఎంజాయ్ చేయగలరేమో కానీ.. పలు తెలుగు-తమిళ చిత్రాల నుండి కాపీ కొట్టిన సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించడం కష్టమే. మల్టీలింగువల్ సినిమా అనేది ఎప్పుడూ ఒరిజినల్ ఐడియాతో తెరకెక్కిన సినిమా అయ్యుండాలి కానీ.. ఇలా కాపీ సీన్లతో చుట్టేసిన సినిమా కాకూడదు. ఆల్రెడీ విడుదలైన మూడు సినిమాలతో బిజీగా ఉన్న తెలుగు ప్రేక్షకులు “రాబర్ట్”ను కనికరించడం కష్టం.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus