దాదాపు నాలుగు నెలలపాటు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు నేడు (మార్చ్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “రాబిన్ హుడ్”(Robinhood). “భీష్మ” (Bheeshma) అనంతరం వెంకీ కుడుముల (Venky Kudumula) -నితిన్ (Nithiin) కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడం, నితిన్ & వెంకీకి కెరీర్లకు ఈ సినిమా హిట్ అవ్వడం కీలకమవ్వడంతో “రాబిన్ హుడ్” సినిమా చాలా స్పెషల్ అయిపోయింది. “అదిదా సర్ప్రైజు & డేవిడ్ వార్నర్” కారణంగా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం అనుకోని విధంగా నాలుగు సినిమాలతో పోటీగా విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!
కథ: చిన్నప్పుడే మనుషుల్లో కామన్ లక్షణం మోసం చేయడం అని అర్థం చేసుకున్న రామ్ (నితిన్). పదిమందికి మంచి చేయడం కోసం ఒకర్ని మోసం చేయడంలో తప్పేం లేదనే విధంగా పెరుగుతాడు. అందుకే రాబిన్ హుడ్ గా మారి అనాథలకు, అనాథ శరణాలయాలకు అండగా నిలుస్తాడు. ఇండియన్స్ అందరూ బ్రదర్స్ & సిస్టర్స్ గా భావించే రామ్ కి ఎన్నారై నీర (శ్రీలీల) (Sreeleela) ఒక మిషన్ లో భాగంగా పరిచయమై.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
అయితే.. సామి (దేవ్ దత్త నాగ్) కథలోకి వీళ్లందరూ అనుకోకుండా ఎంటర్ అవుతారు. సామి ఎవరు? అతని ధ్యేయం ఏంటి? రామ్ & నీర అతని కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వాటిని ఎలా జయించారు? అనేది “రాబిన్ హుడ్” కథాంశం.
నటీనటుల పనితీరు: నితిన్ ఈ తరహా పాత్రలు ఇప్పటికే పలుమార్లు చేసి ఉండడంతో.. అతనికి ఈ పాత్ర కేక్ వాక్ లా అయిపోయింది. చాలా ఈజ్ తో రామ్ పాత్రలో ఒదిగిపోయాడు. క్యారెక్టరైజేషన్ ఇంకాస్త కొత్తగా ప్రాజెక్ట్ చేసి ఉంటే బాగుండేది. శ్రీలీల నటించగలదు అని ప్రూవ్ చేసుకుంది కానీ.. ఆమె క్యారెక్టరైజేషన్ సరిగా వర్కవుట్ అవ్వలేదు. కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేసి కానీ అది కూడా సరిగా పండలేదు. వెన్నెలకిషోర్ (Vennela Kishore), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కాంబినేషన్ మాత్రం మంచి కామెడీ క్రియేట్ చేసి ప్రేక్షకుల్ని నవ్వించింది.
దేవ్ దత్త నాగ్ కి (Devdatta Nage) ఎందుకో సౌత్ సరిగా అచ్చిరాలేదు. అతడు నటించిన “ఆదిపురుష్ (Adipurush), దేవకీనందన వాసుదేవ” (Devaki Nandana Vasudeva) ఇప్పుడు “రాబిన్ హుడ్”లో కూడా అతని క్యారెక్టర్ ఎందుకో సరిగా ఎలివేట్ అవ్వలేదు. షైన్ టామ్ చాకో (Shine Tom Chacko), మైమ్ గోపి, లాల్, శుభలేఖ సుధాకర్ తదితరులు తమ తమ టెంప్లేట్ రోల్స్ లో పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ ఎప్పుడూ గ్రాండ్ & బ్రైట్ గా ఉంటుంది. లిమిటెడ్ అండ్ తక్కువ బడ్జెట్ లో కూడా మంచి అవుట్ పుట్ ఇవ్వగల సినిమాటోగ్రాఫర్ ఈయన. యాక్షన్ బ్లాక్ కోసం కాస్త ఎక్కువ ఖర్చు చేశారు అనిపించినప్పటికీ.. కాస్త డిఫరెంట్ గా ట్రై చేశాడు. జీవి ప్రకాష్ కుమార్ పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. అయితే సదరు పాటల ప్లేస్మెంట్ మాత్రం ఎందుకో సెట్ అవ్వలేదు. “గాంజా మ్యాన్” అనే రీమిక్స్ సాంగ్ మాత్రం ఆ ఫైట్ సీన్స్ కి మంచి వెల్యూ యాడ్ చేసింది.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు నిర్మాతలు. సినిమాకి కావాల్సినదానికంటే ఎక్కువ ఖర్చు చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల తన సేఫ్ జోన్ లో నుంచి బయటికి వచ్చి తీసిన సినిమా ఇది. ఒక రొటీన్ టెంప్లేట్ సినిమాను యాక్షన్ & సస్పెన్స్ థీమ్ లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. వెన్నెల కిషోర్ & రాజేంద్రప్రసాద్ పాత్రలతో నవ్వించడం వరకు సక్సెస్ అయినప్పటికీ.. ఓవరాల్ గా ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. అందువల్ల కామెడీ అక్కడక్కడా పండినా, పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
విశ్లేషణ: అస్తమానం కొత్త కథలు దొరకవు, అందుకే పాత కథలను కొత్తగా చెప్పడం మొదలెట్టారు దర్శకులు. వెంకీ కుడుముల కూడా తన తొలి రెండు సినిమాల్లో చేసింది అదే. రెగ్యులర్ సినిమాలకు చిన్నపాటి ట్రెండీ ట్రీట్మెంట్ అద్దే హిట్స్ కొట్టాడు వెంకీ కుడుముల. అలాంటిది తన మూడో సినిమా, అది కూడా చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా విషయంలో మాత్రం ఆ కొత్త తరహా ట్రీట్మెంట్ ఇవ్వడంలో తడబడ్డాడు. అందువల్ల “రాబిన్ హుడ్” చాలా తక్కువగా నవ్వించి, ఓ మోస్తరు సినిమాగా మిగిలిపోయింది.
ఫోకస్ పాయింట్: రొటీన్ రాబిన్!
రేటింగ్: 2/5