పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “రొమాంటిక్”. ముంబై బ్యూటీ కేతికా శర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించింది. టైటిల్ కు తగ్గట్లే ట్రైలర్ మొత్తం రొమాన్స్ తో నింపేశారు. యూత్ ఆడియన్స్ టార్గెట్ గా రూపొందిన ఈ చిత్రం వారిని ఏమేరకు అలరించగలిగిందో చూద్దాం..!!
కథ: పెద్ద డాన్ అయిపోయి బోలెడన్ని డబ్బులు సంపాదించేయాలనే అత్యుత్సాహంతో గోవా మాఫియాలో చేరతాడు వాస్కోడగామా (ఆకాష్ పూరి). మొదటి రెండు డీల్స్ బాగా చేయడంతో వాస్కోడగామాను గ్యాంగ్ లో మెయిన్ మెంబర్ గా మారుస్తాడు బడా డాన్. అదే తరుణంలో మోనికా బ్యాక్ చూసి టెంప్ట్ అయ్యి ఆమెను కామిస్తాడు వాస్కోడగామా. ఈ కామాయణం రంజుగా సాగుతున్న తరుణంలో.. అనుకోని విధంగా లోకల్ ఎస్సై ని చంపేస్తాడు వాస్కోడగామా. అప్పుడు కథలోకి ఎంటరవుతుంది రమ్య గోవారికర్ (రమ్యకృష్ణ). ఆమె పవర్ ఫుల్ ఎంట్రీతో కథ మొత్తం మారిపోతుంది. ఏం మారింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: పూరి ఆకాష్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు. చక్కగా నటించాడు. అతడి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఎక్స్ లెంట్. అయితే.. తన వయసుకు మించిన పాత్రలు సెలక్ట్ చేసుకోవడం అనేది బిగ్గెస్ట్ మైనస్. చిన్న పిల్లాడిలా కనిపించే ఆకాష్ అంత భారీ మాస్ డైలాగ్స్ చెబుతుంటే కాస్త కామెడీగా ఉంటుంది. రొమాంటిక్ సీన్స్ వరకు పర్లేదు కానీ.. యాక్షన్ బ్లాక్స్ కి వచ్చేసరికి పిల్లాడిలానే కనిపిస్తాడు.
తెలుగు రాష్ట్రాల యూత్ కి కేతిక పేరుతొ మరో క్రష్ దొరికినట్లే. అమ్మడి అందాలు, ఒంపులు, సొంపులు కుర్రకారుకి మత్తెక్కించడం ఖాయం. నటన పరంగా సోసోగా ఉన్నప్పటికీ.. అందాల ఆరబోత విషయంలో పొదుపు, రొమాంటిక్ సీన్స్ విషయంలో మొహమాటం లేదు కాబట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. రమ్య గోవారికర్ పాత్రలో రమ్యకృష్ణ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ & డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సునయన క్యారెక్టర్ కంటే ఆమె డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. రమాప్రభ, ఉత్తేజ్ లు అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమా మొత్తం పూరి జగన్నాధ్ కనిపిస్తాడు, వినిపిస్తాడు, అరిపిస్తాడు. అందువల్ల దర్శకుడిగా అనిల్ పాడూరి మార్క్ ఎక్కడా కనిపించదు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు పూరి అందించడం అందుకు కారణం. హీరో డాన్ గా ఎదిగే సన్నివేశాలు చాలా సిల్లీగా ఉన్నాయి. అలాగే రొమాంటిక్ సీన్స్ యూత్ ఆడియన్స్ వరకు పర్లేదు కానీ.. మిగతా సన్నివేశాల సీన్ కంపొజిషన్స్ లో క్లారిటీ కానీ కొత్తదనం కానీ లేదు. ఓవరాల్ గా.. డైరెక్టర్ గా అనిల్ బొటాబొటి మార్కులతో సరిపెట్టుకున్నాడు.
సునీల్ కశ్యప్ బాణీలు బాగున్నాయి. నేపధ్య సంగీతం సోసోగా ఉంది. నరేష్ రానా సినిమాటోగ్రఫీలో గోవా కొత్తగా కనిపించింది. ఇక హీరోయిన్ ను ఇన్ని యాంగిల్స్ లో చూపించవచ్చా అని రాఘవేంద్రరావు సైతం అవాక్కయ్యే రేంజ్ లో చూపించాడు నరేష్. యూత్ ఆడియన్స్ సదరు సన్నివేశాల కోసం థియేటర్లకు రిపీట్ లో వచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రొడక్షన్ డిజైన్, డి.ఐ ఇంకాస్త క్వాలిటీ ఉండాల్సింది.
విశ్లేషణ: పూరి మార్క్ యాక్షన్, రొమాన్స్, డైలాగ్స్ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. అయితే.. కాస్త శృతిమించిన రొమాన్స్, యాక్షన్ ఉంటుంది. వాటిని ఆస్వాదించే ప్రేక్షకులు ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఆ ఊరతనం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేరు. ఆకాష్ మాత్రం తన వయసుకు, పర్సనాలిటీకి తగ్గ పాత్రలు ఎంచుకొంటే మంచిది.
రేటింగ్: 2/5