హీరోహీరోయిన్లు మొదలుకొని దర్శకుడు వరకు అందరూ కొత్తవాళ్లే. ఈ యంగ్ గ్యాంగ్ కలిసి తెరకెక్కించిన సినిమా “రోటీ కపడా రొమాన్స్” (Roti Kapda Romance) . యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో ఎనిమిదిమంది టాలెంటెడ్ హీరోహీరోయిన్లతోపాటుగా విక్రమ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యాడు. కారణాంతరాల వలన పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (నవంబర్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ యూత్ ని ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!
కథ: సక్సెస్ ఫుల్ ఈవెంట్ ప్లానర్ హర్ష (హర్ష నర్రా), బిజీ సాఫ్ట్వేర్ ఉద్యోగి రాహుల్ (సందీప్ సరోజ్), సూపర్ రిచ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్ విక్కీ (సుప్రజ్ రంగా), ఆర్జే టర్నడ్ ప్రోగ్రామింగ్ హెడ్ సూర్య (తరుణ్ పొనుగోటి).. నాలుగేళ్ల ముందు వరకు ఒకే ఫ్లాట్ లో ఉండేవాళ్ళు. విక్కీ తప్ప అందరూ లైఫ్ లో సెటిల్ అయినవాళ్ళే. హ్యాపీగా ఉన్న పని చేసుకుంటూ, నైట్ రైడ్స్, ఇష్టం వచ్చినప్పుడు మందు సిట్టింగులు, రెస్ట్రిక్షన్స్ లేని లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటారు.
అలాంటి వాళ్ల జీవితాల్లోకి నలుగురు అమ్మాయిలు వస్తారు. హర్ష లైఫ్ లోకి రొమాన్స్ ట్రై చేయాలన్న తపనతో మార్వాడి పిల్ల సోనియా (కుష్భూ చౌదరి), రాహుల్ లైఫ్ లోకి ప్రేమ వద్దు పెళ్లి ముద్దు అని నమ్మే ప్రియ (సోనూ ఠాకూర్ (Sonu Thakur), హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న విక్కీ లైఫ్ లోకి జాబ్ కోసమే బ్రతికే శ్వేత (మేఘ లేఖ (Megha Lekha), ఆర్జేగా స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న సూర్య జీవితంలోకి పోష్ పోరి దివ్య (నువేక్ష (Nuveksha).
ఈ అమ్మాయిలు ఎంట్రీ మన కుర్రాళ్ల జీవితాల్ని ఎలా మార్చింది? హ్యాపీగా ఉండే వాళ్ల జీవితాల్లో కన్నీళ్లు ఎందుకొచ్చాయి? కలిసి ఉన్న ఈ నలుగురు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? మళ్లీ ఇలా కలిశారు? కలిసి ఏం చేశారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “రోటీ కపడా రొమాన్స్” చిత్రం.
నటీనటుల పనితీరు: సినిమాలో నలుగురు హీరోలకు సమానమైన స్క్రీన్ టైమ్ ఉన్నా.. అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం విక్కీ పాత్ర పోషించిన సుప్రజ్ రంగా. తనదైన ఈజ్ & డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ను హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా విక్కీ క్యారెక్టరైజేషన్ కు యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా తర్వాత సుప్రజ్ రంగా మంచి బిజీ ఆర్టిస్ట్ అయిపోతాడు.
హర్ష నర్రా పాత్రలో ఉన్న సీరియస్ నెస్ అతని ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది, సందీప్ సరోజ్ కన్ఫ్యూజన్ & తరుణ్ ఫ్రీ ఆటిట్యూడ్ అన్నీ వాళ్ల పాత్రల్లో స్పష్టంగా కనిపిస్తాయి. నటులుగా వాళ్లు పాత్రలను ఏ స్థాయిలో ఓన్ చేసుకున్నారు అనేందుకు నిదర్శనం ఇది.
హీరోయిన్లుగా కనిపించిన సోనూ ఠాకూర్, మేఘ లేఖ, నువేక్ష, ఖుష్బూ చౌదరిలు కూడా చక్కని నటనతో ఆకట్టుకున్నారు. ప్రీక్లైమాక్స్ ముందువరకు వీళ్ళని తిట్టుకున్నా.. చివర్లో మాత్రం సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అవుతుంది. అందువల్ల హీరోల పాత్రలతోపాటు హీరోయిన్ల పాత్రలు కూడా గుర్తిండిపోతాయి.
సాంకేతికవర్గం పనితీరు: హర్షవర్ధన్ రామేశ్వర్ – ఆర్ఆర్ ధృవన్ – వసంత్ జి కలిసి అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. అన్నీ పాటల్ని సింపుల్ గా మాంటేజ్ ఫార్మాట్ లోనే తెరకెక్కించడంతో ఎక్కడా బోర్ కొట్టలేదు. అలాగే.. సన్నీ ఎం.ఆర్ (Sunny M.R.) నేపథ్య సంగీతం సినిమాకి మంచి ఫన్ యాడ్ చేసింది. సంతోష్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. రెండు కోట్ల రూపాయల సినిమాలా అనిపించదు, లొకేషన్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనాన్ని సరిగ్గా వినియోగించుకుని సరైన అవుట్ పుట్ అందించడంలో సంతోష్ రెడ్డి సక్సెస్ అయ్యాడు.
దర్శకుడు విక్రమ్ రెడ్డి రాసుకున్న కథలో తొలి భాగం హిందీలో సూపర్ హిట్ సినిమా అయిన “ప్యార్ క పంచ్ నామా” గుర్తు చేస్తుంది. అయితే.. కామెడీని రాసుకున్న విధానం మాత్రం బాగా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా విక్కీ క్యారెక్టర్ చుట్టూ రాసుకున్న సన్నివేశాలు బాగా పేలాయి. సెకండాఫ్ లో ఒక దర్శకుడిగా కంటే ఒక రచయితగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు విక్రమ్. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా.. కాస్త భిన్నమైన ఆలోచనాధోరణితో ఎవరిదీ తప్పు కాదు, పరిస్థితులే అన్నీ బ్యాలెన్స్ చేస్తాయి అనే విషయాన్ని కాస్త కొత్తగా చెప్పాడు. అయితే.. నాణానికి రెండు వైపులా గెలుపు ఉండదు.
ఏదో ఒకవైపే గెలుస్తుంది. రెండు వైపులా గెలిపించాలి అనే కోణంలో కథను దర్శకుడు విక్రమ్ రెడ్డి కథను ముగించిన విధానం కొంతమంది ప్రేక్షకులకు మింగుడుపడకపోవచ్చు. అయితే.. రచయితగా అతడి ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకొని తీరాలి. ఒక ఫిలిం మేకర్ గా తాను రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం లేదని చెప్పకనే చెప్పాడు విక్రమ్ రెడ్డి. ఈ సినిమాతో దర్శకుడిగా అలరించిన విక్రమ్ తదుపరి సినిమాతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి. అయితే.. స్నేహం, తొలి ప్రేమ, బాధ్యత, తొలి ముద్దు, తొలి Sruగారం వంటి అంశాలను అసభ్యత లేకుండా ఎక్ప్లోర్ చేసిన విధానం ప్రేక్షకుల్ని అలరిస్తుంది.
విశ్లేషణ: ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఎంజాయ్ చేసే సినిమాలు తగ్గిపోయాయి. “మ్యాడ్” (MAD) తర్వాత ఆ స్థాయిలో ఫ్రెండ్స్ అందరూ కలిసి చూసే రేంజ్ సినిమా “రోటీ కపడా రొమాన్స్”. చాలా సరదాగా మొదలై.. చివర్లో కాస్త ఏడిపించి చిన్న మెసేజ్ ఇస్తుంది. యూత్ ఆడియన్స్ అయితే ఫస్టాఫ్ తెగ ఎంజాయ్ చేస్తారు. మెచ్యూర్డ్ ఆడియన్స్ కు సెకండాఫ్ నచ్చుతుంది. ఓవరాల్ గా మంచి టైమ్ పాస్ తోపాటు ఎమోషనల్ గానూ ఎంటర్టైన్ చేసే సినిమా ఇది.
ఫోకస్ పాయింట్: రొటీన్ కి భిన్నమైన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్!
రేటింగ్: 2.5/5