Rowdy Boys Review: రౌడీ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

దిల్ రాజు సహోదరుడు మరియు ప్రొడక్షన్ పార్ట్నర్ అయిన శిరీష్ తనయుడు ఆశిష్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం “రౌడీ బాయ్స్”. దర్శకుడిగా “హుషారు”తో క్రేజీ హిట్ అందుకున్న శ్రీహర్ష కొనుగంటి రెండో చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా టార్గెట్ యూత్ ఆడియన్స్. మరి ఆ యంగ్ ఆడియన్స్ ను ఈ చిత్రం ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: అక్షయ్ (ఆశిష్) ఓ సాదాసీదా కుర్రాడు. జీవితంలో ఎలాంటి గోల్స్ ఉండవు. అలాంటి కుర్రాడు తొలిచూపులోనే కావ్య (అనుపమ పరమేశ్వరన్) అనే ఎంబీబీయస్ స్టూడెంట్ ను ప్రేమిస్తాడు. వయసులో తనకంటే పెద్దదైనప్పటికీ.. ఆమే కావాలనుకుంటాడు. ఇద్దరి ప్రేమ రెండు కాలేజీల మధ్య గొడవలా అయిపోతుంది.

కట్ చేస్తే.. అక్షయ్-కావ్యలు లివ్-ఇన్ లో ఉండడానికి నిర్ణయించుకుంటారు. ఆ రిలేషన్ షిప్ ఎలా సాగింది? ఈ ఇమ్మెచ్యుర్డ్ లవ్ స్టోరీ సక్సెస్ అయ్యిందా? ఫెయిల్ అయ్యిందా? అనేది “రౌడీ బాయ్స్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: నటుడిగా ఆశిష్ పరిచయ చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. కానీ.. హావభావాల ప్రదర్శనలో మాత్రం ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. అలాగే.. బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ కాస్త వర్కవుట్ చేయాలి. పరిచయ చిత్రం కాబట్టి చిన్న చిన్న తప్పిదాలను లైట్ తీసుకోవచ్చు. అనుపమ బక్కచిక్కి కొత్త లుక్ లో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. నటిగా ఎప్పట్లానే తన పాత్రకు న్యాయం చేసింది కానీ.. లుక్ వైజ్ మాత్రం తన ఫ్యాన్స్ ను నిరాశపరిచింది.

అలాగే.. రొమాంటిక్ సీన్స్ తో ఆశ్చర్యపరిచింది. ఒకరకంగా బోర్డర్ క్రాస్ చేసిందనే చెప్పాలి. కార్తీక్ రత్నం, సాహిదేవ్ లగడపాటిలు మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో లీడ్ క్యాస్ట్ ను కూడా డామినేట్ చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: “శ్రీమంతుడు, మిర్చి, భాగమతి” లాంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన మధి ఈ చిత్రానికి కెమెరామెన్ అంటే నమ్మడానికి కాస్త టైమ్ పట్టింది. ఓపెనింగ్ సీన్ మినహా ఎక్కడా కూడా ఆయన మార్క్ కనిపించలేదు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సోసోగా ఉంది. దిల్ రాజు మొదటిసారి ఒక డెబ్యూ హీరో మీద ఇంతలా ఖర్చు చేశాడు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ఇలా టెక్నికల్ గా సినిమాలో ఒక్కటంటే ఒక్క లోపం కూడా లేదు. కానీ.. దర్శకుడిగా, కథకుడిగా శ్రీహర్ష కొనుగంటి తన లభించిన సువర్ణావకాశాన్ని వేస్ట్ చేసుకున్నాడు.

ఒక్కటంటే ఒక్క క్యారెక్టర్ కి కూడా ఆర్క్ అనేది లేదు. క్యారెక్టరైజేషన్స్ కి క్లారిటీ లేదు. ఒక పాత్ర ఎప్పుడు, ఎందుకు, ఎలా బిహేవ్ చేస్తుంది అనేదానికి సరైన సమాధానం ఉండదు. హీరో క్యారెక్టర్ బిహేవియర్ లో రాక్ స్టార్ మొదలుకొని ఒక పది బాలీవుడ్ సినిమాలు కనిపిస్తాయి. అలాగే.. సీన్ కంపోజిషన్ లోనూ కొన్ని బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కాలేజ్ ఎపిసోడ్స్ & స్టూడెంట్ ఫైట్స్ “సఖి, చెలి, రన్” సినిమాలను తలపిస్తాయి. సొ, శ్రీహర్ష ఒరిజినాలిటీ కానీ అతడి శైలి కానీ సినిమాలో ఎక్కడా ఎలివేట్ అవ్వలేదు.

విశ్లేషణ: యూత్ ఫుల్ సినిమా అంటే కాలేజ్, బైక్స్, అమ్మాయిలు, పార్టీ సాంగ్ తో నింపేస్తే సరిపోతుంది అనే భ్రమ నుంచి బయటపడాలి. వీటన్నిటితోపాటు మంచి కథ, కథనం, క్యారెక్టర్స్ ఉండాలి. ఇలా ముఖ్యమైన అంశాలను మిస్ అయిన యూత్ ఫుల్ సినిమా “రౌడీ బాయ్స్”. సినిమాకి పెట్టిన ఖర్చుకి, మూడ్ కి కథ ఇంకాస్త బాగుంటే హిట్ అయ్యేది.


రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus