నా మొదటి సినిమా ఇదే అయితే బాగుండు అనిపించింది..
నిజానికి నా మొదటి సినిమా “ఆకతాయి”. ఆ సినిమా విడుదలైందన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. అయితే.. ఆ సినిమానే నాకు నటన పట్ల అవగాహన తీసుకొచ్చింది. అలాగే కెమెరాను ఎలా ఫేస్ చేయాలి వంటి బేసిక్స్ కూడా నేర్పించింది. తర్వాత మేర్లపాక గాంధీ నన్ను హీరోయిన్ గా సెలక్ట్ చేయడం, నాని సరసన నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా అనిపించింది. అయితే.. నా స్నేహితులు అనేవారు “ఇదే నీ మొదటి సినిమా అయితే బాగుండు” కదా అని. ఆ ఆలోచన నాకు కూడా వచ్చింది కానీ.. ఇదే నా మొదటి సినిమా అయితే నా పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేదాన్ని కాదేమో, అసలు “కృష్ణార్జున యుద్ధం”లో ఆఫర్ కూడా వచ్చేది కాదేమో (నవ్వుతూ).
నానిని సెట్స్ లో చూసి షాక్ అయ్యాను..
“కృష్ణార్జున యుద్ధం” మూవీలో నాని హీరో అని తెలిసినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. అసలే వరుస హిట్స్, సూపర్ స్టార్ డమ్. అతనితో ఎలా మూవ్ అవ్వాలో, ఆన్ స్క్రీన్ ఒక యాక్టర్ గా ఆయనతో కలిసి ఎలా నటించాలో అని చాలా భయపడ్డాను. అయితే.. సెట్స్ లో నానిని చూస్తే “నేను విన్నది ఈయన గురించేనా?” అని నన్ను నేను ప్రశ్నించుకొనేలా ఉంది ఆయన బిహేవియర్. ఇక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆయన డైలాగ్ వెర్షన్ & ఎమోషన్ విషయంలో చాలా హెల్ప్ చేస్తారు.
థియేటర్ ఆర్టిస్ట్ ని..
బేసిగ్గా నేను పంజాబీని. పుట్టింది లండన్ లో, పెరిగింది బెంగుళూరులో. కొన్నాళ్లు గోవాలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత థియేటర్స్ లో పాల్గొన్నాను. పర్టీక్యులర్ కోర్స్ అంటూ ఏమీ చేయలేదు కానీ.. కొన్ని వర్క్ షాప్స్ లో పాల్గొన్నాను. “మిస్ బెంగుళూరు” పోటీల్లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచాను. దాంతో కన్నడలో “ఆంటోనీ” అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అదే నా మొదటి సినిమా. ఆ తర్వాత “ఆకతాయి”, ఇప్పుడు “కృష్ణార్జున యుద్ధం”.
బాడీ లాంగ్వేజ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాను..
తెలుగు డైలాగులకి లిప్ సింక్ ఇవ్వడం అనేది పెద్ద సమస్య కాదు నాకు. కాకపోతే.. “కృష్ణార్జున యుద్ధం” మూవీలో నానితోపాటు నా చుట్టూ ఉన్న ఆర్టిస్టులందరూ చిత్తూరు యాసలో మాట్లాడుతుంటారు. వాళ్ళ డైలాగ్ డెలివరీని అర్ధం చేసుకొని నేను పర్ఫెక్ట్ రియాక్షన్ ఇవ్వడం కోసం మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది.
గాంధీ నన్ను బిహేవ్ చేయమనేవారు..
ఈ సినిమాలో నేను “రియా” అనే పాత్రలో కనిపించాను. డైరెక్టర్ గాంధీ ఏ రోజూ కూడా నన్ను ఇలా నటించమని అడగలేదు. పాత్రలో నన్ను బిహేవ్ చేయమన్నారు. అందుకే ఆడియన్స్ నా రోల్ ని యాక్సెప్ట్ చేయగలిగారు. నా పాత్రలోని అమాయకత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒక నటిగా నాకు ఇంతకుమించిన అనుభూతి ఏం కావాలి.
సెకండ్ హీరోయిన్ ట్యాగ్ గురించి భయం లేదు..
ముందుగా ఒక్క విషయంలో నేను క్లారిటీ ఇస్తున్నాను. “కృష్ణార్జున యుద్ధం” సినిమాలో నేను సెకండ్ హీరోయిన్ కాదు. ఈ సినిమాలో ఇద్దరు నానీలు ఉన్నారు. ఇద్దరికీ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. సో నేను కూడా మెయిన్ హీరోయిన్నే. ఇంకో విషయం ఏంటంటే.. అలాంటి ట్యాగ్ ని నేను అస్సలు పట్టించుకోను. ఒక నటిగా నాకు లభించిన పాత్రకు నేను పూర్తి న్యాయం చేయాలనుకొంటానే తప్ప.. సెకండ్ హీరోయిన్నా, మెయిన్ హీరోయిన్నా అనే విషయం నేను అస్సలు పట్టించుకోను. కాకపోతే.. నాకంటే అనుపమ సినిమాల పరంగా సీనియర్ కావడంతో ఆమెను గుర్తించిన స్థాయిలో నన్ను జనాలు గుర్తించలేదు. అయితే.. సినిమా రిలీజ్ అయ్యాక ఇద్దరికీ సమానమైన పేరొచ్చింది.
కథానాయికలకు ప్రాధాన్యత పెరుగుతుంది..
ఇదివరకట్లా కథానాయికని కేవలం కమర్షియాలిటీ కోసం వాడట్లేదు. కథానాయికను కూడా కథలో భాగం చేస్తున్నారు. ఈమధ్యకాలంలో వచ్చిన “భాగమతి, రంగస్థలం” సినిమాల్లో అనుష్క, సమంత పాత్రలు చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. త్వరలోనే హీరోయిన్లకి కూడా హీరోలతో సమానమైన క్రేజ్, ప్రాధాన్యత పెరుగుతుంది.
గ్లామర్ అనే పదానికి అర్ధం మారుతోంది..
సినిమాలో కథ, సందర్భం బట్టి హీరోయిన్స్ ను గ్లామర్ గా చూపుతున్నారు కానీ.. ఏదో అమ్మాయిని అందంగా చూపించాలి లేదా ఒక పర్టీక్యులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను సాటిస్ఫై చేయాలి కాబట్టి హీరోయిన్స్ ను గ్లామరస్ గా చూపించట్లేదు. అలాగే.. నన్ను గ్లామర్ డాల్ అనడాన్ని కూడా స్వాగతించను. అయినా గ్లామర్ అంటే తక్కువ బట్టలు వేసుకోవడం కాదు. అంటే.. ఇప్పుడు అందంగా కనిపిస్తే సరిగ్గా నటించట్లేదనా లేక చక్కగా నటిస్తే అందంగా కనిపించట్లేదనా?. సో, త్వరలో “గ్లామర్” అనే పదానికి కూడా మీనింగ్ మారుతుంది.
నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్..
నేను రెమ్యూనరేషన్, స్టార్ డమ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా పాత్రకు నేను న్యాయం చేశానా లేదా అనేది మాత్రమే నాకు ఇంపార్టెంట్. సో, ఫ్యూచర్ లో నా దగ్గరకి ఎవరైనా వచ్చి తక్కువ బడ్జెట్ లో మంచి కథలో నటించమని అడిగితే రెమ్యూనరేషన్ గురించి ఏమాత్రం కేర్ చేయకుండా నను ఆ స్క్రిప్ట్ ఒప్పుకుంటాను.
మొదటిసారి ఐమాక్స్ లోనే చూశాను..
రిలీజ్ కి ముందు సినిమా చూడాలనే ఆశ ఉన్నప్పటికీ.. ప్రేక్షకులతోపాటు సినిమా చూడాలి అనుకున్నాను. అందుకే హైద్రాబాద్ లో ఐమాక్స్ లో 8.45 షోకి వెళ్లిపోయాను. ఆడియన్స్ నా క్యారెక్టర్ ఇంట్రోకి, నానితో కాంబినేషన్ సీన్స్ కి ఇస్తున్న రెస్పాన్స్ చూసి సంబరపడిపోయాను. నా జీవితంలో ఒన్నాఫ్ ది బెస్ట్ మూమెంట్ అది.
నెగిటివిటీ అస్సలు పట్టించుకోను..
సోషల్ మీడియాలో నేను చాలా యాక్టివ్ గా ఉంటాను. నా కోసం టైమ్ స్పెండ్ చేసి నన్ను పోగొడుతున్న, సినిమాలో నా నటన పొగుడుతున్న వారందరికీ కృతజ్నతలు చెబుతాను. అయితే.. కొందరు మాత్రం చాలా నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంటారు. వాళ్ళని నేను అస్సలు పట్టించుకోను. నా నటన బాలేదు అనండి నేను సరిదిద్దుకుంటాను.. కానీ కొందరు మరీ దారుణంగా కామెంట్ చేస్తుంటారు. వాళ్ళని అస్సలు కేర్ చేయను.
మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో వర్క్ చేయాలనుంది..
తెలుగు ఇండస్ట్రీకి రావడానికి ముందు నేనెప్పుడూ తెలుగు సినిమాలు చూడలేదు. అయితే.. గోవాలో చదువుతున్నప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్ ల తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ అయ్యేవి. అవి చూసినప్పుడల్లా వాళ్ళతో కలిసి వర్క్ చేస్తే బాగుండు అనుకొనేదాన్ని.
చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు..
నేను మేనేజర్ హరి గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆయన టీం లో ఉండే హెబ్బా పటేల్, రీతికా సింగ్ లాంటి వాళ్ళందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు నాని కూడా నాకు మంచి ఫ్రెండ్. సొ, తదుపరి సినిమాలను బట్టి నా ఫ్రెండ్స్ లిస్ట్ పెరుగుతూ ఉంటుంది.
– Dheeraj Babu