క్లిక్కుల కోసం బ్రతికున్న మనుషులను చంపుతున్న యూట్యూబ్ చానల్స్

మనిషి జీవితంలో డబ్బు సంపాదన అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే.. ఆ సంపాదన మార్గం ఏమిటనేది మాత్రం ఆలోచించి ఎంచుకోవాల్సిన విషయం. కొందరు డబ్బు సంపాదన కోసం నీతి నిజాయితీలను నమ్ముకొంటే.. కొందరు మాత్రం సదరు నీతి అనేది చెత్తబుట్టలో పడేసి అత్యంత హేయమైన పద్ధతులను ఎంచుకొని డబ్బు సంపాదిస్తుంటారు. ఆ రెండో కేటగిరీకి చెందినోళ్లే ప్రస్తుతం యూట్యూబ్ లో “బ్రహ్మానందం ఇక లేరు, శోక సంద్రంలో ఇండస్ట్రీ” అని తంబ్ నైల్స్ పెట్టి మరీ బ్రతికున్న బ్రహ్మానందం గురించి చెత్త వార్తలు రాస్తున్న చానల్స్ నిర్వాహకులు. ఈమధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ చానల్స్ క్రియేట్ చేస్తున్న రచ్చకీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం బాధపడాల్సి వచ్చిన పరిస్థితిని చూసే ఉంటాం. కోటా శ్రీనివాసరావు, సుమన్, జగపతిబాబు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ లు అయితే..

ఏకంగా మీడియా ముందు ఈ యూట్యూబ్ చానల్స్ పుణ్యమా అని తాము పడుతున్న ఇబ్బందులను ఏకరవు పెట్టుకొన్నారు. సెలబ్రిటీలను ఆ స్థాయికి దిగజారుస్తున్నాయి కొన్ని యూట్యూబ్ చానల్స్. ఇప్పుడు బ్రహ్మానందం కుటుంబ సభ్యులా పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. ఇటీవల బ్రహ్మానందం ఊపిరి సమస్య కారణంగా ముంబైలోని ఆసుపత్రిలో జాయినవ్వగా.. ఆయనకి వెంటనే బైపాస్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలోనే కొలుకొంటారని ఆయన కుమారుడు గౌతమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నప్పటికీ.. కొన్ని యూట్యూబ్ చానల్స్ దిగజారి చేస్తున్న హడావుడికి బ్రహ్మానందంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాక ఇండస్ట్రీ వర్గాలు కూడా బాధపడాల్సి వస్తోంది. ఈ చానల్స్ ను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మన ఇండస్ట్రీ లేదా ప్రభుత్వం ఈ విషయమై జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus