ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అనేక సినిమాలకు పనిచేసిన అజయ్ భూపతి తెరకెక్కించిన తొలి సినిమా “ఆర్‌ఎక్స్ 100” సంచలన విజయం సాధించింది. గురువు మాదిరిగానే తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ లు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగు యువతకు బాగా కనెక్ట్ అయింది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12 న రిలీజ్ అయి నాలుగురోజుల్లోనే 10 కోట్ల గ్రాస్ సాధించి ఔరానిపించింది. అంతేకాదు పదకొండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల షేర్ రాబట్టి అదరగొట్టింది. అందుకే ఈ మూవీపై బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కన్నుపడింది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఆ విషయాన్ని వర్మ ఇండైరెక్ట్ గా చెప్పారు.
తెలుగు వెర్షన్ ని డైరక్ట్ చేసిన అజయ్ భూపతి హిందీ వెర్షన్ ని డైరక్ట్ చేయనున్నట్టు చెప్పకనే చెప్పారు. “అనంతపురం నుంచి ముంబైకి అజయ్ జర్నీ” అంటూ వర్మ ప్రకటించడంతో ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాకు బాలీవుడ్ రీమేక్ ఖరారు అయినట్లు స్పష్టమయింది. దీనిని వర్మ సొంత బ్యానర్లో నిర్మిస్తారని సమాచారం. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు రావాలంటే మరికొంతకాలం పడుతుంది. తెలుగులో మాదిరిగానే హిందీలోనూ ఈ మూవీ హిట్ అయితే అజయ్ భూపతి కూడా గురువు గారి మాదిరిగానే బాలీవుడ్ కే పరిమితమవ్వచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.